కోరుట్ల కల్వకుంట్ల సంజయ్
KORUTLA | కోరుట్ల, మార్చి 29: కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఉత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రజలకు నిరంతరమైన వైద్య సేవలు కార్పోరేట్ స్థాయిలో అందించేందుకు అవసరమైన వసతుల కల్పనకు శాయశక్తుల కృషి చేస్తానని పురనరుద్ఘాటించారు.
కోరుట్ల పట్టణంలోని ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం శనివారం ఎమ్మెల్యే అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా సమావేశంలో ఆసుపత్రి పరిధిలో చెపట్టాల్సిన పనులు, ఖర్చు చేయాల్సిన నిధులు, ఇతరాత్ర అంశాలపై చర్చించారు. ఆసుపత్రి అభివృద్ధి కోసం పలు ప్రతిపాదనలు ఆమోదించారు. ఆసుపత్రిలో మంచినీటి కొరతపై స్పందించిన ఎమ్మెల్యే మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా నీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. ఏరియా ఆసుపత్రిలో సమస్యలపై అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో ప్రస్తావించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఆసుపత్రిలో తగినంత సిబ్బందిని నియమించాలని, అల్ట్రా సౌండ్ మిషన్ కోసం నిధులు కేటాయించాలని ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల డిమాండ్ తో త్వరలోనే ప్రభుత్వం సీఎం కేసీఆర్ కిట్లను పేరు మార్పు చేసి అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రజలు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వాసుపత్రులో నిష్ణాతులైన వైద్యులు, ఖరీదైన మందులు అందుబాటులో ఉన్నాయని పట్టణ, పరిసర గ్రామాల ప్రజలు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించుకోవాలన్నారు. దేశంలో రాష్ట్ర జనాభా 2.5 శాతంగా ఉందని, కేంద్రానికి మాత్రం నిధుల రూపంలో 5 శాతం పన్నులు చెల్లిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. వైద్య రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఎక్కువగా నిధులు కేటాయిస్తున్న కేంద్రం నుంచి అరకొరగా సాయం అందుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పధకాలను తమవిగా చెప్పుకుంటూ కేంద్ర ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకు పోవడం విడ్డూరంగా ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడం తగదన్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు అందిస్తున్న నిధులను తెలంగాణ రాష్ట్రానికి అందించి ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి మరింత కృషి చేయాలని హితవు పలికారు. అంతుకుమందు ఆసుపత్రిలో పలువురు వెన్నుపూస సంబంధిత వ్యాది గ్రస్తులను పరీక్షించిన ఎమ్మెల్యే వారికి మందుల చీటీలు రాసి ఇచ్చారు. ఆసుపత్రిలో ఏదేని సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హమీ ఇచ్చారు. సమావేశంలో ఆసుపత్రి సూపరిండెంట్ సునీతరాణి, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, ఎంపీడీవో రామకృష్ణ, డిప్యూటీ తహశీల్దార్ పరూఖ్, ఆసుపత్రి వైద్యులు, స్టాప్ నర్సులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.