Ramagundam | కోల్ సిటీ, ఫిబ్రవరి 8: రామగుండంలోని 60 డివిజన్లలో గమ్మత్తు ప్రచారం జరుగుతోంది. ఇంటింటికి ప్రచారంలో అభ్యర్థులు మారుతున్నా.. వెనుకాల జెండాలు పట్టుకొని ఓట్లు అడిగే ప్రచార మహిళలు మాత్రం మారడం లేదు. వచ్చిన వారే మళ్లీ మళ్లీ రావడం, గంటల వ్యవధిలోనే ప్రచారంలో గుర్తులు మారడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈసారి రామగుండంలో ప్రధాన పార్టీల నుంచి కొత్త వ్యక్తులకు టికెట్లు రావడం, మాజీ కార్పొరేటర్లు ఎక్కువ చోట్ల పోటీ చేయకపోవడంతో ఓటర్లు గందరగోళంకు గురవతున్నారు.
అభ్యర్థుల తరపున ప్రచారంకు సీనియర్ నాయకులు వస్తేనే గుర్తు పట్టే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని డివిజన్లలో అభ్యర్థులకు ప్రచార కార్యకర్తల కొరత ఉంటోంది. దీంతో ఉదయం పూట ఓ అభ్యర్థికి, పగలు మరో అభ్యర్థి తరపున, ఇక మాపటీలి ఇంకో అభ్యర్థి తరపున యువకులు, మహిళలు ప్రచారానికి వెళ్తున్నారు. ప్రచారానికి రోజుకు రూ.200 చొప్పున ఇస్తుండటంతో కొంతమంది ఏ అభ్యర్థి పిలిస్తే ఆ అభ్యర్థి వెంట ప్రచారానికి వెళ్తున్నారు. ఇక్కడే ఓటర్లను తికమక పెడుతుంది. ఉదయం బీఆర్ఎస్ అభ్యర్థి తరపున ప్రచారం కోసం వస్తే కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి అభ్యర్థిస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది.
ఐతే ఈ ప్రచారం ముగియగానే మళ్లీ అదే మహిళలు మధ్యాహ్నం మరో పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తున్నారు. ఉదయం కారు గుర్తుకు ఓటేయాలని ఓ ఇంటికి వెళ్లి అడిగిన ప్రచార మహిళలే మధ్యాహ్నం అదే ఇంటికి ఇంకో అభ్యర్థి తరపున వెళ్లి మహిళలు గంట వ్యవధిలో మరో పార్టీ గుర్తుకు ఓటు వేయాలని అడగడంతో అవాక్కవుతున్నారు. ఒకే రోజు మూడు సార్లు ముగ్గురు అభ్యర్థుల తరపున వచ్చిన మహిళలే మళ్లీ మళ్లీ వచ్చి ఓట్లు అడగడంతో గందరగోళానికి గురవుతున్నారు. దాదాపు అన్ని డివిజన్లలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రచారంకు వెళ్తే నాలుగు డబ్బులు వస్తాయని ఆశతో వెళ్తున్న మహిళలు, యువతులు ఒకే ఇంటికి మూడుసార్లు వచ్చి ముగ్గురు అభ్యర్థులకు ఓటు వేయాలని కోరడం ఓటర్లకు ఆశ్చర్యమనిపిస్తోంది