Siricilla | రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, జూన్ 22 : ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ప్రత్యేక ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగారపు రజనీకాంత్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగారపు రజనీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇప్పటికీ యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పూర్తిస్థాయిలో అందలేదని విమర్శించారు.
మధ్యాహ్న భోజన పథకానికి తగిన నిధులు కేటాయించి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని కోరారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చాయని ఆరోపించిన ఆయన, ఫీజుల నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలను మూసివేయకుండా కొత్త పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. ధర్నా అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్‌తో పాటు పలువురు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.