తెలంగాణ రాక ముందు తొలకరి వచ్చిందంటే ఎంతో మంది రైతులు పెట్టుబడి కోసం అరిగోస పడేది. చేతిలో చిల్లిగవ్వ లేక బ్యాంకుల చుట్టూ తిరేగిది. అక్కడ రుణం రాక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేంది. పంట దిగుబడి చేతికి రాగానే అమ్మి.. అసలు వడ్డీ కట్టేది. మళ్లీ సీజన్ రాగానే కథ పునరావృతమయ్యేది. స్వరాష్ట్రంలో ఈ పరిస్థితి మారింది. సరైన పెట్టుబడి ఉంటే రైతులు నిరందీగా పంటలు పండించగలుగుతారని భావించిన కేసీఆర్ సర్కారు, ‘రైతుబంధు’ అమలు చేసింది. ప్రతి ఎకరాకు ఏడాదికి 10 వేల ఆర్థిక సహాయాన్ని అందించింది. సీజన్ ప్రారంభంలోనే ఖాతాల్లో నగదు జమ చేయడంతో రైతులకు పెట్టుబడి భారం తప్పింది. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకొని, నిశ్చితంగా సాగు చేసుకునేది. కానీ, కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.
రైతు భరోసా అమలుకు కాంగ్రెస్ సర్కారు ఆపసోపాలు పడుతున్నది. తరచూ ఇప్పుడూ అప్పుడూ అంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నది. సకాలంలో ఇవ్వకుండా రైతులను గోస పెడుతున్నది. సీజన్ ప్రారంభంలో వేయాల్సిన పంట పెట్టుబడిని సంక్రాంతికి వేస్తామని చెప్పి దాటవేసింది. ఆ తర్వాత జనవరి 26న ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి మరోసారి మాట తప్పింది. ఇప్పుడు ఎప్పుడిస్తారో తెలియని గందరగోళ పరిస్థితి ఉండగా, పరిషత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆపుతున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుత పరిణామాలను చూస్తే ఎన్నికలకు ముందు రైతు భరోసా ఇచ్చి ఓట్ల పొందాలనే ఆలోచనలో ఉన్నట్టు అర్థమవుతున్నది. ఈ ఎన్నికలు జరిగేదెప్పుడు తమకు రైతు భరోసా వచ్చేదెప్పుడని రైతులు నిరాశకు గురవుతున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోని సర్కారు తీరుపై మండిపడుతున్నారు.
కరీంనగర్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా పథకానికి తూట్లు పొడుస్తున్నది. పథకం పేరు మార్చి ఎకరాకు ఏడాదికి 12 వేలు ఇస్తామని చెప్పినా.. అమలులో మాత్రం తీవ్ర జాప్యం చేస్తున్నది. అనేక సాకులు చూపి వేలాది మంది రైతులను ఈ పథకం నుంచి తప్పించింది. సాగుయోగ్యత లేని భూములపై ముందుగా అధికారులతో సర్వే చేయించిన సర్కారు, కరీంనగర్ జిల్లాలో 5,476 ఎకరాలను తొలగించింది. ఇప్పుడు సాగు చేసిన భూములకు మాత్రమే ఇస్తామని చెబుతూ.. శాటిలైట్ సర్వే ద్వారా ఇమేజ్ మ్యాపింగ్ చేసి అర్హులైన రైతులను ఎంపిక చేస్తామని మెలిక పెట్టింది. నిజానికి ఈ యాసంగి సీజన్ ప్రారంభంలో అంటే గత అక్టోబర్, నవంబర్లోనే రైతు భరోసా అందాల్సి ఉంది. అప్పుడు సంక్రాంతి వరకు ఇస్తామని మభ్యపెట్టింది. కానీ, ఇవ్వకుండా.. జనవరి 26కు వాయిదా వేసింది. ఆ గడువు కూడా దాటిపోయింది. అసలు రైతు భరోసా ఇస్తారా.. ఇవ్వారా..? అనేది ఎక్కడా స్పష్టత లేదు. అధికారులను అడిగినా కచ్ఛితమైన సమాధానం రావడం లేదు. జనవరి నుంచి అధికారుల నుంచి ఇదే సమాధానం వస్తున్నది. కానీ ఎప్పుడిస్తారనేది మాత్రం ఎవరూ చెప్పడం లేదు. ఈ నేపథ్యంలో రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. వస్తుందనే నమ్మకాన్ని కూడా కోల్పోతున్నారు.
కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం లేదు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికి 15 వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చింది. కేవలం 12 వేలు ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఏ ఒక్క సీజన్లో కూడా సకాలంలో అందించ లేకపోయారు. అందినా అర్హులైన రైతులందరికీ ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023-24 యాసంగి సీజన్ మొదటి సారి వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేటాయించిన నిధులనే ఎకరాకు 5వేల చొప్పున వచ్చింది. 2024 వానకాలంలో పూర్తిగానే ఎగ్గొట్టింది. 2024-25 యాసంగిలో మాత్రం మూడెకరాలు ఉన్న రైతుల వరకే ఇచ్చింది. అంతకు ఎక్కువ ఉన్న రైతులకు మొండిచేయి చూపింది. 2025 వానకాలంలో మాత్రం పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో ఇచ్చింది. ఇప్పుడు యాసంగి సీజన్ వచ్చే సరికి సాగు చేసిన భూములకే మాత్రమే రైతు భరోసా ఇస్తామని రాష్ట్ర సర్కారు చెబుతున్నది. అందుకు శాటిలైట్ సర్వే ద్వారా ఇమేజ్ మ్యాపింగ్ చేసి అర్హులను నిర్ణయిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటించారు. కానీ, యాసంగి సీజన్ మధ్యకు వచ్చినా ఈ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్టు కనిపించడం లేదు..
రైతు భరోసాపై రైతుల్లో తీవ్రమైన గందరగోళం నెలకొన్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క సీజన్లో కూడా రైతులకు సకాలంలో రైతు భరోసా అందించ లేక పోయింది. నాట్ల సమయంలో ఇవ్వాల్సిన భరోసాను కోతల సమయంలో ఇవ్వడంతో సాగు అసరాలకు వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వానకాలం పంటలకు ఏప్రిల్, మేలో.. యాసంగి పంటలకు అక్టోబర్, నవంబర్‌లో రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు జమయ్యేది. కాంగ్రెస్ పాలనలో అసలు సకాలంలో అందకపోవడం ఒక ఎత్తయితే.. వచ్చినప్పుడు కూడా అర్హులైన రైతుల్లో చాలా మందికి అందడం లేదు. 2024-25 యాసంగి సీజన్లో జిల్లాలోని అనేక మంది అర్హులైన రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ కాకపోవడమే అందుకు నిదర్శనం. ఆ సీజన్లో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2,09,450 మంది రైతులను అర్హులుగా గుర్తించి 213.95 కోట్లు కేటాయించారు. కానీ, కేవలం 1,95,945 మంది వివరాలు మాత్రమే అధికారుల వద్ద ఉండగా వాటిని మాత్రమే ట్రెజరీకి పంపించారు. మిగిలిన 13,505 మందికి అన్యాయం జరిగింది. అంతే కాకుండా భూభారతి (ధరణి) పోర్టల్‌లో భూములు నమోదై ఉన్న రైతులకు కూడా రైతు భరోసా అందలేదు. సాగు యోగ్యమైన భూముల సర్వే చేసినప్పుడు అధికారులు రీ సర్వే సెటిల్మెంట్ రిజిస్టార్ (ఆర్ఎస్ఆర్)లో నమోదు చేశారు. అందులో విస్తీర్ణం తక్కువ ఉండి, పట్టాదారు పాసు పుస్తకంలో ఎక్కువ ఉన్న రైతులకు ప్రభుత్వం మొండి చేయి చూపింది. అంతేకాకుండా పట్టాదారు పాసు పుస్తకంలో ఉన్న పూర్తి స్థాయి భూమికి రైతు భరోసా అందలేదు. రైతు భరోసా అమలుకు క్రాప్ బుకింగ్ పోర్టల్‌ను కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఒకట్రెండు సీజన్లలో పంటలు సాగు చేయకుంటే ఖాళీగా చూపించారు. ఆ తర్వాత సాగు చేసినా వారికి కూడా ఇవ్వలేదు. ఇలాంటి సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు జిల్లాలో 16 వేలకుపైనే ఉన్నట్టు తెలుస్తున్నది. వీటిని పరిష్కరించాలనే ఆలోచనలో ప్రభుత్వం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఎంత తక్కువ విస్తీర్ణానికి రైతు భరోసా ఇస్తే అంత ఆదా అవుతుందనే ధోరణిలో ప్రభుత్వం కనిపిస్తున్నది. అందుకు అనేక సాకులు వెతుకుతోందనే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.
రైతు భరోసాను రాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. నిజానికి ఈ యాసంగి సీజన్‌కు గతేడాది అక్టోబర్, నవంబర్లోనే రైతు భరోసా ఇవ్వాల్సి ఉంది. కుంటి సాకులు చెబుతూ వాయిదాల మీద వాయిదాలు వేస్తున్న ప్రభుత్వం ఈ పథకాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. వచ్చే జిల్లా, మండల ప్రజా పరిషత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్‌కు ముందు రైతు భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇదే నిజమైతే ఈ ఎన్నికలపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. తమకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని మరోపక్క బీసీలు ఉద్యమించే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముడిపెట్టి తమను ఎందుకు ఇబ్బందులు పెడతారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అనేక సార్లు వాయిదాలు వేసిందని, ఇప్పుడు సీజన్ పూర్తికాక ముందైనా ఇవ్వాలని కోరుతున్నారు.