గంగాధర,మార్చి 13: సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, నారాయణపూర్ రిజర్వాయర్ నుండి సాగునీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ(BRS party) ఆధ్వర్యంలో మండలంలోని మధురనగర్ చౌరస్తాలో నిర్వహించ తలపెట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. ధర్నా చేస్తున్నారన్న సమాచారంతో చొప్పదండి సీఐ ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులను మొహరించారు. ధర్నా కోసం వచ్చిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల అత్యుత్సాహం బీఆర్ఎస్ పార్టీ ధర్నా సందర్భంగా కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి బస్సుల కోసం చౌరస్తాలో వేచి చూస్తున్న సాధారణ ప్రజలను సైతం బెదిరించారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ ఏం చేస్తున్నారు? గుర్తింపు కార్డు చూపించాలి అంటూ సాధారణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో పోలీసుల తీరుపై సాధారణ ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. నాయకులెవరో, సాధారణ ప్రజలు ఎవరో తెలియదా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు బీఆర్ఎస్ నాయకులు, అటు పోలీసులతో చౌరస్తాలో ఏం జరుగుతుందో తెలియక స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ధర్నా నేపథ్యంలో బూరుగుపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యేను బయటికి వెళ్లకుండా ఇంటిలోనే నిర్భందించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే పోలీసులతో వాగ్వాదానికి దిగారు.