ఏళ్ల తరబడిగా ఉండాల్సిన సీసీ రోడ్లు ఆర్నెళ్లకే పగళ్లు బారుతున్నాయి. నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు ఇస్తుండడం.. దృష్టి పెట్టాల్సిన అధికారులు ‘మామూలు’గా తీసుకుంటుండడంతో రూ.లక్షల నిధులు వృథా అవుతున్నాయి. శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత కరువైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పనులపై ఫిర్యాదులు, ఆరోపణలు వస్తున్నా రెండు శాఖల అధికారుల మధ్య సమన్వయలోపంతో పట్టించుకునే వారు లేకుండా పోయారు. ముఖ్యంగా పంచాయతీ శాఖ, నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారుల ఇష్టారాజ్యంతో సుడా పనులు అస్తవ్యస్తంగా మారుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.
కరీంనగర్ కార్పొరేషన్, జూలై 9: సుడా పరిధిలో చేపడుతున్న అభివృద్ది పనులను నగరపాలక సంస్థ, పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగాలు పర్యవేక్షణ చేస్తున్నాయి. సుడా పరిధిలో చేపట్టే అన్ని పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయడం, టెండర్లు పిలవడం, అగ్రిమెంట్లు చేయడం నగరపాలక సంస్థ ఇంజినీరింగ్శాఖ చేపడుతుంది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు పనులు చేయిస్తున్నారు. వీటిల్లో వర్క్ ఇన్స్పెక్టర్, ఏఈ, డీఈ స్థాయిలో ఈ విభాగం అధికారులు పర్యవేక్షణ చేపడుతున్నారు. అయితే.. ఈఈ, ఎస్ఈ స్థాయి పనుల పర్యవేక్షణ మళ్లీ నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగం చేపడుతున్నది. అలాగే, చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లుల మంజూరు కూడా బల్దియా ఇంజినీరింగ్ విభాగమే చేపడుతుంది.
అయితే, ఇక్కడే అధికారుల మధ్య సమన్వయలోపం వస్తుందన్న విమర్శలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పనుల తీరు ఎలా ఉందన్న విషయంలో పూర్తిస్థాయిలో పరిశీలన లేకుండానే ఇంజినీరింగ్ అధికారులు బిల్లులు మంజూరు చేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చేపడుతున్న అభివృద్ధి పనుల విషయంలో ఆరోపణలు, ఫిర్యాదులు వస్తే తమ పరిధిలోకి రావడం లేదంటూ ఇరువర్గాల ఇంజినీరింగ్ అధికారులు తప్పుకుంటున్నారు. దీంతో సుడా పరిధిలో సాగుతున్న అభివృద్ధి పనులు కాస్తా కొన్ని నెలలకే పగుళ్లు బారి అధ్వాన్న స్థితికి చేరుతున్నాయి. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు సైతం దృష్టి సారించకపోవడంతో కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులు కుమ్మక్కై అడ్డగోలుగా బిల్లులు డ్రా చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
కొన్ని నెలలకే పగుళ్లు
సుడా పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో కొన్ని నెలలకే పగుళ్లు కనిపిస్తుండడంతో నాణ్యతా ప్రమాణాలపై విమర్శలు వస్తున్నాయి. గత జనవరిలో దుర్శేడ్ ప్రాంతంలో రూ.20 లక్షల సుడా నిధులతో డ్రైనేజీ పనులు చేపట్టారు. కాగా, జూలై నాటికే ఆ డ్రైనేజీల్లో అనేక పగుళ్లు వచ్చాయి. అలాగే, డ్యాం సమీపంలో గతంలో స్పోర్ట్స్ స్కూల్, కుల సంఘాల భవనాలకు రూ.10 లక్షల వ్యయంతో వేసిన సీసీ రోడ్డు కూడా ఎక్కడికక్కడ పగుళ్లు బారి అధ్వాన్నంగా మారింది. ఇలా వివిధ ప్రాంతాల్లో సుడా నిధులతో వేసిన రోడ్లు, డ్రైనేజీలు నెలల రోజుల్లోనే పగుళ్లు బారుతున్నా పట్టించుకునే అధికారులు లేకుండా పోయారు.