ఉమ్మడి రాష్ట్రంలో కమ్ముకున్న కరెంట్ చీకట్లు స్వరాష్ట్రంలో తొలిగిపోయాయి. తెలంగాణ వచ్చిన ఆరు నెలల్లోనే సరికొత్త వెలుగులు నిండాయి. దీంతో తమ వ్యాపారాలు గాడిన పడ్డాయని చిరువ్యాపారులు చెబుతున్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత నిరంతర కరెంట్‌తో తమకు భరోసా దొరికిందని సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఉమ్మడి రాష్ట్రంలో సరైన విద్యుత్ సరఫరా లేక వ్యాపారాలు సాగేవి కాదని, ఆ రోజులను తలుచుకుంటేనే భయం వేస్తున్నదని అంటున్నారు. మళ్లీ అలాంటి పరిస్థితులు రావొద్దని, కరెంట్ విషయంలో అనవసరంగా కేసీఆర్‌ను బద్నాం చేయొద్దని సూచిస్తున్నారు.
కరీంనగర్, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉండేది. ఒక ప్రణాళిక పద్ధతి ఉండేది కాదు. కరెంట్ ఎప్పుడు ఉండేదో.. ఎప్పుడు పోయేదో తెలిసేది కాదు. కరెంట్ పోయినప్పుడు పెద్ద పెద్ద వ్యాపారులు జనరేటర్లు వినియోగించి వ్యాపారాలు చేసే వారు. కానీ, చిరువ్యాపారులు మాత్రం గంటల కొద్దీ కరెంట్ కోతలతో తల్లడిల్లేది. దుకాణాలు మూసేసి ఖాళీగా కూర్చునే పరిస్థితి ఉండేది. గిరాకీలు కూడా దెబ్బతినేది. ఉపాధిపై ప్రభావం పడేది. ఫలితంగా చిన్నా చితక వ్యాపారాలు నిర్వీర్యమయ్యే దుస్థితి ఉండేది. దుకాణాల అద్దెలు చెల్లించలేక అనేక మంది తమ వ్యాపారాలను మూసేసిన పరిస్థితి అప్పట్లో కనిపించేది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, జువెల్లరీ షాపులు జనరేటర్లపై ఆధార పడినా.. ఆర్థిక భారంతో ఇబ్బంది పడేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికతో అన్ని రంగాలకూ 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అయింది. షాపింగ్ మాల్స్, ఇతర వ్యాపార, వాణిజ్య వర్గాలు ఏర్పాటు చేసుకున్న భారీ జనరేటర్లు సైతం మూలనపడ్డాయి. నాడు నగరాలు, పట్టణాల్లో వినిపించిన మోతలు పూర్తిగా ఆగిపోయాయి. ఇటు చిరు వ్యాపారులు కూడా కుదురుగా వ్యాపారాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. తమ వ్యాపారాలను విస్తరించుకునే అవకాశం ఏర్పడింది.
నేను 18 ఏండ్లుగా సిరిసిల్లలో జ్యూస్ స్టాల్ నడిపిస్తున్న. గతంలో కాంగ్రెస్ అధికారంల ఉన్నప్పుడు కరెంటు సమస్యతో జనరేటర్ మీద ఆధారపడి దుకాణం నడిపెటోళ్లం. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటలు కరెంటు ఇచ్చిండ్రు. పదేళ్లు ఏ సమస్య లేకుండా గడిచింది. కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ రాకపోవడం మాకు శాపమైంది. కాంగ్రెస్ సర్కారు వచ్చి ఆరు నెలలు కాకముందే కరెంటు కష్టాలు మళ్లీ మొదలైనయ్. కరెంటు ఎప్పుడు పోతదో.. పోయిన కరెంటు మళ్లెప్పుడస్తదో కూడా తెలుస్తలేదు. జ్యూస్ కోసం వచ్చిన కస్టమర్లు కరెంటు లేక మర్రిపోతున్రు. గిరాకీ లేక షటర్ కిరాయి కట్టే పరిస్థితి లేకుండా పోయింది. నెలయ్యిందంటే అప్పులు చేసి కిరాయి కడుతున్నం. మూలకేసిన జనరేటర్లను రిపేర్ చేయించి దుకాణం నడిపిస్తున్నం. కొద్దిపాటి గిరాకీతో కుటుంబం గడవడం భారంగా మారింది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. కాంగ్రెస్ అసమర్థ పాలనతో మాలాంటి సామాన్యులకు కష్టాలు తప్పడం లేదు.
రాష్ట్రం ఏర్పడక ముందు పొద్దంతా కరెంటు పోయేది. ఎప్పుడు వస్తుందా.. అని ఎదురుచూసెటోళ్లం. నేను 30 ఏళ్లుగా ఫొటో స్టూడియో నడుపుతున్న. తెలంగాణ రాక ముందు కరెంటు సక్కగ ఉండకపోయేది. దీంతో గిరాకీ దెబ్బతినేది. అప్పుడు ఇన్వర్టర్లు పెట్టుకుని నడిపించినా అవి నాలుగైదు గంటల బ్యాక్ అప్ వచ్చి అయిపోయేవి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 24 గంటల పాటు కరెంటు ఉన్నది. మాకు ఇన్వర్టర్లతో పనిలేకుండా పోయింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిరంతరం కరెంట్ ఉండేది. దీంతో మాకు చేతినిండా పని దొరికేది. ఏ ఇబ్బంది ఉండేది కాదు. కానీ, కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుంచి కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. ట్రాన్స్‌కో అధికారులు ప్రతి నెలా రెండో శనివారం ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతులు చేసినప్పుడు విద్యుత్ సరఫరాలో అంతరాయాన్ని భరిస్తున్నాం. కానీ, మిగతా సమయాల్లో ఎందుకు కరెంట్ పోతుందో తెలుస్తలేదు. దీంతో వెల్డింగ్ పనులకు ఇబ్బందులు వస్తున్నయ్. కరెంట్ అంతరాయంతో పనులు చేసుకోలేక పోతున్నం. ఉపాధి కోల్పోతున్నం.
తెలంగాణ రాక ముందు చీటికి మాటికి కరెంటు పోతుండె. అప్పట్లో మినీ జనరేటర్ వాడేవాడిని. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ జనరేటర్లు అవసరమయ్యేటట్టున్నయ్. కరెంట్ విషయంలో ఇప్పటి ప్రభుత్వం ఫెయిల్ అయింది. నాణ్యమైన కరెంటు ఇవ్వకపోతే ప్రతి వ్యవస్థకు చాలా ఇబ్బందు వస్తయ్.