కరీంనగర్రూరల్, అక్టోబర్ 28 : కాంగ్రెస్ సర్కారు వ్యవసాయరంగాన్ని విస్మరిస్తున్నది. రైతులకు సమగ్ర సమాచారం అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ సర్కారు క్లస్టర్ల వారీగా నిర్మించిన రైతు వేదికల పర్యవేక్షణను గాలికొదిలేసింది. కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న నగునూరు రైతు వేదిక నిర్వహణ లేక.. డోర్లు పగిలి, కిటికీలు విరిగి, విద్యుత్ వైర్లు తెగిపోయి అధ్వానంగా మారింది.
మూత్రశాలల, మరుగుదొడ్లు డోర్లు లేకుండా వెక్కిరిస్తుండగా, రక్షణ లేక మద్యం ప్రియులకు అడ్డాగా మారింది. గుర్తుతెలియని వ్యక్తులు డోర్లు పగుల కొట్టి ఫర్నిచర్, ఇంటర్నెట్ కేబుల్స్, విద్యుత్ వైర్లు, రైతులకు అందించే వ్యవసాయ బోధన పద్ధతుల, భూసార పరీక్ష, లైట్లు, మైక్సెట్స్, ఇతర సామగ్రి ఎత్తుకెళ్లినా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. ఇక్కడ ఒక్కచోటే కాదు, చామనపల్లి, ముగ్దుంపూర్లోని రైతు వేదికలకు రక్షణ లేకుండా పోయింది. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన రైతుల వేదికలపై ఇప్పటికైనా దృష్టి సారించాల్సి ఉన్నది.