Rasamayi Balakishan | తిమ్మాపూర్, ఫిబ్రవరి9 : మానకొండూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అల్గునూర్ డివిజన్లో ఎన్నికల వేడి హీటెక్కింది. ఇక్కడ ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా తిష్టవేసి గెలుపు కోసం యత్నిస్తున్నారు. నువ్వా..? నేనా..? అన్న స్థాయిలో జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి కూడా ఎగిరేది బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండానే, తమ అభ్యర్థి కాల్వ మల్లేశం గెలుస్తున్నాడని అని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికీ తిరుగుతున్న రసమయి బాలకిషన్ ‘నమస్తేతెలంగాణ’తో ముచ్చటించారు.
అల్గునూర్లో ప్రజల స్పందన ఎలా ఉంది..?
రసమయి : తెలంగాణ ఉద్యమంలో అల్గునూర్కు ప్రత్యేక ఘట్టం ఉంది. కేసీఆర్ అరెస్టు చేసిన స్థలం ఇంది. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రత్యేక శ్రద్ధ, చూపించి అభివృద్ధి చేసినం. కార్పోరేషన్ లో విలీనం చేసిన తర్వాత ఎంతో అభివృద్ధి జరిగింది. అప్పటి నుండి ఎన్నో షోరూంలు, సంస్థలు కార్యాలయాలు నెలకొల్సినయి, స్థానికులకు ఉపాధి దొరుకుతున్నది. కొద్దిరోజులుగా ఇక్కడే ఉండి ప్రచారం చేస్తున్నా. ఇంటింటికీ తిరుగుతున్నప్పుడు ప్రజలు ఈ రెండేళ్లలో పడుతున్న ఇబ్బందులను చెప్తున్నారు. గతంలో తాము చేసిన అభికవృద్ధిని గుర్తు చేస్తున్నారు. ప్రజల నుండి అద్భుతమైన స్పందన వస్తున్నది.
బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలి..?
రసమయి : కార్పొరేషన్లో విలీనం అయినతర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాను ఎంతగానో అభివృద్ధి చేసినం. తమ అభ్యర్థి కాల్వ మల్లేశంకు గతంలోనే టికెట్ ఇవ్వాల్సినా.. అప్పుడున్న సమీకరణల దృష్ట్యా వేరేవాళ్లకు ఇవ్వాల్సి వచ్చింది. అప్పటి నుండి ప్రభుత్వంతో పాటూ కాల్వ మల్లేశం సైతం వ్యక్తిగతంగా ఎంతగానో సేవా చేస్తూ వస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది.
వాళ్లు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదు. అల్గునూర్ అంటే అవ్వగారూరు అని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పుకున్నడు.. కనీ, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ ఏం అభివృద్ధి కాలే. కవ్వంపల్లి, కాంగ్రెస్ ప్రభుత్వం అల్గునూరుకు ఏం చేయలేదు. మా అభివృద్ధి తప్ప ఇక్కడ ఏ పని చేయలే. అభివృద్ధి చేసింది తామే కాబట్టి ఓటు అడుగుతున్నం.
ఎమ్మెల్యేగా, సాంస్కృతిక సారధి చైర్మన్గా చేసిన మీరు.. ఒక్క డివిజన్ కోసం ఇంత తాపత్రయం ఎందుకు..
రసమయి : అల్గునూర్ అనేది కరీంనగర్ కు గుండెకాయ లాంటిది. తమకు అల్గునూర్తో పాటూ సదాశివపల్లి ఉన్నది. ఉద్యమానికి ప్రధాన ఘట్టం కేసీఆర్ అరెస్టు అయిన స్థలం అల్లునూర్. తప్పకుండా తాము మళ్లీ గులాబీ జెండా ఎగిరేందుకు కష్టపడుతున్నాం.
కరీంగనర్ దర్వాజ అల్గునూర్.. ఇక్కడ గులాబీ జెండా ఉండాలనేది నా తపన. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి చెమటలు పట్టించినం. కాంగ్రెస్ అభ్యర్ధులను ఓడించినం. అల్గునూర్లో విధ్వంసం జరుగుతున్నది. తానున్నప్పుడే అన్ని కులాల అభివృద్ధికి పాటుపడినం. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఎందరో తెలియకుండా వ్యవహరిస్తున్నారు. వారి అహంకారం తగ్గాలంటే టీఆర్ఎస్ పార్టీ గెలవాలి.
జనరల్ స్థానంలో బీసీ అభ్యర్థిని నిల్చోపెట్టడానికి కారణం
రసమయి : కాంగ్రెస్ పార్టీ బీసీల పేరు చెప్పుకుని మోసం చేసింది. 40 శాతం ఇస్తమని ఇవ్వలేదు. మేము ఒక బీసీ బిడ్డను, గ్రామానికి సేవ చేసిన కుటుంబానికి చెందిన కాల్వ. మల్లేశానికి అవకాశం ఇచ్చినం. కాంగ్రెస్ ఎమ్మెల్యే తనకు సన్నిహితంగా ఉంటాడనే ఒకే కారణంతో, రాజకీయ అవగాహన లేని వ్యక్తికి టికెట్ ఇచ్చారు. సొంత మనిషి అని ప్రజల మీద రుద్దుతే ఎందుకు ఒప్పుకుంటరు. బీసీలను ఉద్దరిస్తమని చెప్పే కాంగ్రెస్ పార్టీ.. కాల్వ మల్లేశంను వాడుకుని పీల్చుకుని పిప్పి చేస్తే, ఉద్యమ బిడ్డ అని మళ్లీ చేర్చుకుని అవకాశం ఇచ్చినం. ఈ విషయంలోనే కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలు గమనిస్తున్నరు.
వాళ్లు గెలవకపోతే పథకాలు రావంటున్నారు..?
రసమయి : పథకాలు ఎవరి జాగీరు కావు. ఎవరున్నా వస్తయి. ప్రతిపక్షంలో ఉన్నవారు గెలిస్తేనే ప్రశ్నించి తీసుకువస్తరు. కుటుంబం మొత్తం వచ్చి అండగా ఉంటం అని కవ్వంపల్లి అంటున్నారు.. ఇప్పుడు నియోజకవర్గాన్ని దోచుకుటుంన్నది చాలు. మళ్లీ అల్గునూర్ మీద పడితే ఊకోం. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు వాళ్ల అభ్యర్థి కుటుంబానికి చెందిన దుకాణాల్లో నాసిరకం మెటీరియల్ అమ్ముతూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ కొనకపోతే బిల్లులు రావని బెదిరిస్తున్నరు. నియోజకవర్గంలో అఫ్యామిలీ.. అల్గునూర్లో ఈ ఫ్యామిలీ దోపిడీ ఆగాలంటే బీఆర్ఎస్కు పట్టం కట్టాలి.
అలుగునూరులో గెలిచేదెవరో చెప్పగలరా..?
రసమయి: తప్పకుండా మరోసారి బీఆర్ఎస్ గులాబీ జెండా రెపరెపలాడుతుంది. ఏ ఇంటికి పోయినా మనస్పూర్తిగా చెప్తున్నారు. అల్గునూర్లో ప్రతీ కులసంఘానికి భవనం ఇచ్చినం. సమస్య ఉంటే పరిష్కరించినం. అవ్వలు ముందుండి ఆశీర్వదిస్తున్నరు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో అత్యధిక మెజార్టీతో కాల్వ మల్లేశం గెలుస్తున్నడు.