వస్త్ర పరిశ్రమకు కేంద్ర బిందువైన సిరిసిల్ల విపణిలో జెండాలకు బ్రాండ్ ఇమేజ్ ఖ్యాతి గడిస్తున్నది. జాతీయ పతాకం నుంచి మొదలు పార్టీల జెండాలు, కండువాల తయారీలో నేతన్నల నైపుణ్యం దశదిశలా వ్యాప్తి చెందుతున్నది. వివిధ రకాల వస్త్ర ఉత్పత్తులతో జాతీయస్థాయిలో అన్ని వర్గాలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నది మరమగ్గాల పరిశ్రమ. దానికి అనుబంధంగా వివిధ ధార్మిక కార్యక్రమాలకు కండువాలు, ఎన్నికల జెండాలు, టోపీలు, టీషర్టుల తయారీకి దేశవ్యాప్తంగా వస్తున్న ఆర్డర్లతో అదనపు ఉపాధి లభిస్తున్నది. నాణ్యమైన వస్త్రాలతో సరసమైన ధరలకే సరఫరా చేస్తున్నందున ప్రాంతీయ పార్టీలే కాకుండా, జాతీయ పార్టీల చూపు ఇటువైపు మళ్లింది.
– రాజన్న సిరిసిల్ల. సెప్టెంబర్ 24 (నమస్తేతెలంగాణ)
కార్మిక క్షేత్రానికి ముందే ఎన్నికల పండగొచ్చింది. ఏ ఇంట్లో చూసినా పార్టీల జెండాలు, కండువాలు, టోపీల తయారీతో మహిళలు బిజీ అయ్యారు. చేతినిండా పని, పనికి తగ్గ కూలీ రావడంతో బీడీలు పక్కన బెట్టారు. వెయ్యి బీడీలు చుడితే రోజుకు రూ.230లు మాత్రమే రాగా, అదే జెండాలు, బ్యానర్లు, టోపీలు కుడితే రోజుకు రూ.500కు పైగా కూలీ గిట్టుబాటవుతున్నది. చేసుకున్నంత పని దొరకడంతో మహిళలంతా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు.
– రాజన్న సిరిసిల్ల. సెప్టెంబర్ 24 (నమస్తేతెలంగాణ)

8వేల మందికి ఉపాధి
మరమగ్గాల వస్త్ర పరిశ్రమతోపాటు ప్రింటింగ్ సిరిసిల్లకు పెట్టింది పేరు. ఒకప్పుడు పట్టణంలో వందకు పైగా చీరెల ప్రింటింగ్ ఇండస్ట్రీలు ఉండేవి. ఇక్కడ తయారైన చీరెలు దేశ వ్యాప్తంగా సరఫరా అయ్యేవి. కాలక్రమేణా సాంకేతిక విప్లవంతో ప్రింటింగ్ పరిశ్రమ కనుమరుగైంది. వస్త్ర బ్యానర్ల స్థానంలో ప్లెక్సీలు రావడంతో చేతి వృత్తులను దెబ్బతీసింది. ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధం విధించడంతో తిరిగి ప్రింటింగ్ పరిశ్రమ పునర్జీవం పోసుకున్నది. పండుగలు, గుడుల నిర్మాణాలు, విగ్రహ ప్రతిష్ఠాపన, యజ్ఞయాగాదులకు జెండాలు, కండువాలు, ఓంకార తోరణాలు ఇక్కడ తయారు చేయడం ప్రారంభించారు. ఒకరిద్దరితో మొదలైన ఈ ప్రింటింగ్ పరిశ్రమ నేడు దాదాపు ఇరవై వరకు నడుస్తున్నాయి. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 8 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.
దేశవ్యాప్తంగా ఆర్డర్లు ఇక్కడికే …
ఏ ఎన్నికలు వచ్చినా.. పార్టీలు ఏవైనా జెండా మాత్రం సిరిసిల్లలోనే తయారవుతున్నది. ప్రతి ఇంటిపైనా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. జాతీయ పతాకాలు ఇంటింటికీ ఉచితంగా పంపిణీ చేసింది. ఈ జాతీయ పతాకాలు ఇక్కడే తయారయ్యాయి. ఇక్కడి నేతన్నల నైపుణ్యం గుర్తించిన దేశంలోని పదిహేను రాష్ర్టాలు ఆర్డర్లు ఇచ్చాయి. వాటి తయారీతో రెండు నెలల పాటు మహిళలకు చేతి నిండా పని దొరికింది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 5 రాష్ర్టాల నుంచి ప్రాంతీయ పార్టీలతోపాటు జాతీయ పార్టీలకు సంబంధించి జెండాలు, కండువాలు, టోపీలు, బ్యానర్లు ఆర్డర్లు పెద్ద ఎత్తున వచ్చినట్లు ఉత్పత్తిదారులు తెలిపారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల విలువైన వరకు ఆర్డర్లు వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రా, మహారాష్ట్ర, ఛత్తీస్ ఒడిశాలకు చెందిన పార్టీల నుంచి ఆర్డర్లు వచ్చాయి. మరికొన్ని రాష్ర్టాల నుంచి ఆర్డర్లు వచ్చే అవకాశం ఉన్నందున పార్టీల జెండాల శాంపిళ్లు తయారీతో పాటు బీఆర్ పార్టీ జెండాల తయారీ జరుగుతున్నది. జెండాలే కాదు టీ షర్టులు, గణేశ్ నిమజ్జనం, దసరా ఉత్సవాలకు యువకులు ఊరేగింపులో వేసుకునే కాషాయ యూనిఫాంలు తయారు చేస్తున్నారు. ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి తయారు చేస్తూనే ఉంటారు. ఎన్నికలప్పుడు మాత్రం రూ.కోట్లలో ఆర్డర్లు వస్తుంటాయి.
నిరంతరాయంగా పని
నేను ఆలయాలకు సంబంధించి ఓంకార తోరణాలు, ధ్వజాలు, బ్యానర్లు, కాషాయ కండువాలు తయారు చేస్తుంటా. తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్ర, రాయలసీమల నుంచి ఆర్డర్లు వస్తుంటాయి. గణేశ్ నిమజ్జనం, దేవీ నవరాత్రులు, యజ్ఞయాగాలు వంటి కార్యక్రమాలకు టోపీలు, ఓంకార తోరణాలు, ఓం జెండాల తయారీ ఆర్డర్లు చాలా వస్తుంటాయి. కుట్టేందుకు దాదాపు వంద మంది మహిళలకు పని కల్పిస్తున్నా. బీడీల కన్నా ఈ పనితో గిట్టుబాటు కూలీ వస్తుంది. ఈ పని మామూలు రోజుల్లో కొంత తక్కువగా ఉంటుంది. హనుమాన్ జయంతి, అయ్యప్ప మాలధారణలకు పెద్ద ఎత్తున తయారు చేస్తుంటాం.
– జీ ద్యావనపల్లి శ్రీహరి, ఉత్పత్తి దారుడు
చదువుకుంటూనే జెండాలు కుడుతున్న
మాది నేత కుటుంబం. మా అమ్మ బీడీలు చుడుతుంది. నాన్న సాంచాల పనిజేస్తడు. నేను డిగ్రీ చదువుకుంటూనే కాలేజీ నుంచి వచ్చిన తరువాత పార్ట్ జెండాలు కుడుతుంటా. వెయ్యి జెండాలు కుడితే రూ.250 వస్తయ్. సెలవు రోజు రెండువేలకు పైగా కుడితే రూ.500ల దాకా సంపాదిస్తా. ఎలక్షన్లప్పుడు మంచిగ పని ఉంటది. మామూలు రోజుల్లో స్కూలు బ్యానర్లు, ఆలయాలకు సంబంధించి జెండాలు, పల్స్ ప్రతి ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన బ్యానర్ల పని ఎప్పుడూ ఉంటుంది. మాకు ఈ జెండాల పని చాలా మంచిగున్నది.
– బూర అఖిల, డిగ్రీ విద్యార్థిని
ఇతర రాష్ర్టాల నుంచి ఆర్డర్లు వస్తున్నయ్..
నేను పదిహేను సంవత్సరాల నుంచి ప్రింటింగ్ పనిచేస్తున్నా. తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి అన్ని పార్టీలకు సంబంధించిన జెండాలు, టీషర్టులు, టోపీలు, బ్యానర్లు తయారీకి ఆర్డర్లు వస్తాయి. నా వద్ద రెండు వందల మంది మహిళలు పనిచేస్తున్నారు. ఏడాది పొడవునా ఏదో రూపకంగా ఆర్డర్లు వస్తుంటాయి. మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకుంటున్నాం. ఆయన సలహా మేరకు ఢిల్లీలో మాదిరిగా ఉలన్ కండువాలు తయారు చేసే మిషన్ కొనుగోలు చేసిన. మిషన్ గంటకు నలభై మీటర్ల ఉలన్ వస్ర్తాలు తయారవుతాయి. కండువా ధర రూ.40 ఉంటుంది. సరసమైన ధరలకే జెండాలు తయారు చేసి ఇస్తున్నాం.
– వెల్ది చక్రపాణి, జెండాల తయారీదారుడు