కథలాపూర్, ఫిబ్రవరి 24: ‘పార్లమెంట్ ఎన్నికల కోడ్ సాకుతో కాంగ్రెస్ సర్కారు ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టద్దు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లో అమలు చేయాలి’ అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మిగిలిన హామీల అమలు కోసం ఎన్నికల కోడ్ రాకముందే జీవోలు జారీ చేయాలని చెప్పారు. యాసంగి ధాన్యానికి క్వింటాల్‌కు 500 బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బీఆర్ఎస్పై విషం చిమ్ముతున్నాడని ధ్వజమెత్తారు. కరీంనగర్ అభివృద్ధికి ఐదు కొత్తలు తేలేని అసమర్థుడు బీఆర్ఎస్ మునిగిపోయే నావ అంటూ తలాతోక లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
బీఆర్ఎస్ మునిగిపోయే పడవ కాదని, తుఫాన్లను తట్టుకొని దూసుకొచ్చే పడవ అని అభివర్ణించారు. ఇప్పటికైనా అబద్ధాలు మాట్లాడడం మానుకొని ఐదేండ్లలో చేసిన పనులేంటో చెప్పాలని నిలదీశారు. కథలాపూర్ మండలం తాండ్రియాల్లో శనివారం బీఆర్ఎస్ ముఖ్య నేతలు చల్మెడ లక్ష్మీనరసింహా రావు ,లోకబాపురెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. అడ్డగోలు హామీలిచ్చి కాంగ్రెస్ అబద్ధాల పునాదులపై అధికారం దక్కించుకున్నదని దుయ్యబట్టారు. అప్పుడు ప్రగల్భాలు పలికి ఇప్పుడు గ్యారెంటీల అమలు చేసేందుకు కిందామీద పడుతున్నదన్నారు. ఒక్క గ్యారెంటీలోని మహాలక్ష్మీ పథకం కింద ఫ్రీ బస్సు జర్నీ కల్పించిందని, కానీ, అందులోనే మరో రెండు హామీలున్నాయనే విషయాన్ని విస్మరిస్తున్నదని దుయ్యబట్టారు.
వడ్లకు మద్దతు ధర రాకుంటేనే 500 బోనస్ ఇస్తామని, ఆ పార్టీ కిసాన్ సెల్ చైర్మన్ కోదండరెడ్డి చెప్పడం విడ్డూరమన్నారు. తెలంగాణలో ఎన్నో ఏండ్ల సం ది కేసీఆర్ సర్కారు మద్దతు ధర ఇస్తున్నదని, కానీ బోనస్ నుంచి తప్పించుకొనేందుకే ఇప్పుడు ఇట్లా మాట్లాడడం శోచనీయమన్నారు. మేడిగడ్డ బరాజ్ కు పగుళ్లు వచ్చాయనే ప్రచారంలో ఈ యాసంగిలో గోదావరి నీళ్లను ఇతర ప్రాజెక్టులోకి ఎత్తిపోయకపోవడంతో రైతులు పంటల సాగుకు తగ్గించారని, అయినా వేసిన పంటలు సైతం ఎండిపోతున్నాయన్నారు. వచ్చే వానకాలంలో గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున మేడిగడ్డ బరాజ్‌ను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేరొన్నారు. సమావేశంలో జడ్పీటీసీ నాగం భూమయ్య, ఎంపీపీ జవ్వాజి రేవతి, వైస్ ఎంపీపీ గండ్ర కిరణ్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ దాసరి గంగాధర్, సీనియర్ నేతలు చీటి విద్యాసాగర్‌రావు, కల్లెడ శంకర్, వర్ధినేని నాగేశ్వర్రావు పాల్గొన్నారు.