BRS | చిగురుమామిడి, ఏప్రిల్ 27 : యావత్ తెలంగాణ ప్రజలు ఏ విధంగా తీసుకున్నారో ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న ఎల్కతుర్తి బీఆర్ఎస్ మహాసభకు నియోజకవర్గం నుండి భారీగా గులాబీ శ్రేణులు అంచనాలకు మించి తరలివచ్చారు. నియోజకవర్గంలోని హుస్నాబాద్, చిగురుమామిడి, సైదాపూర్, కోహెడ, అక్కన్నపేట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలలో 50వేలపైగా గులాబీ శ్రేణులు ఉత్సాహంగా ప్రత్యేక వాహనాలు, ద్విచక్ర వాహనాలపై తరలివచ్చారు.
కేసీఆర్ ప్రసంగ వేదిక ముందు వరుసలో హుస్నాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు కూర్చునేందుకు సమావేశానికి ముందే వాహనాలలో వేదిక వద్దకు చేరుకున్నారు. కరీంనగర్ నుండి హుస్నాబాద్ రహదారి, సిద్దిపేట నుండి హనుమకొండ రహదారి పై వాహనాలు సభకు తరలి రావడంతో రోడ్లన్నీ గులాబీ సైన్యంతో నిండిపోయాయి. అంచనాలకు నుంచి కార్యకర్తలు కేసీఆర్ సభకు రావడంతో నాయకుల్లో నూతన ఉత్సాహం నింపింది.
అన్ని గ్రామాల్లో జండావిష్కరణలు
బీఆర్ఎస్ రజతోత్సవం వేడుకలలో భాగంగా మండలంలోని 17 గ్రామాల్లో పార్టీ జెండాలను గ్రామ శాఖ అధ్యక్షులు ఎగరవేసి జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం వాహనాలలో ఎల్కతుర్తి మహాసభకు తరలివచ్చారు. చాలా గ్రామాల్లో వాహనాలతో పాటు ఆటోలలో సభకు చేరుకున్నారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, మాజీ ఎంపీపీలు కొత్తవినీత, ఆకవరం భవాని, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, మండలంలోని నాయకులు పాల్గొన్నారు.
కొండాపూర్ లో బైక్ ర్యాలీ
ఉద్యమ నేత, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మహాసభకు మండలంలోని కొండాపూర్ గ్రామం నుండి పెద్దపల్లి అరుణ్ కుమార్, గ్రామ శాఖ ఆధ్వర్యంలో 100 మందికి పైగా యువకులు బైక్ ర్యాలీ నిర్వహించి సభా వేదిక వద్దకు చేరుకున్నారు. జై కేసీఆర్, జై సతీష్ కుమార్ అంటూ నినాదాలు చేశారు. గులాబీ శ్రేణులకు దారి పొడుగునా గ్రామస్తులు స్వాగతం పలికారు.
నియోజకవర్గంపై వోడితల ప్రత్యేక దృష్టి
హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి వద్ద నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవసభకు హుస్నాబాద్ నియోజకవర్గము నుండి అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం ఇంచార్జ్ వోడితల సతీష్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. నెల రోజుల నుండి నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు.
సభా వేదిక నిర్వహించే ఎల్కతుర్తి మండలం నుండి 15 వేలు, సమీపంలోని బీమదేవరపల్లి మండలం నుండి 12 వేలు, సైదాపూర్ మండలం నుండి 10వేల వరకు కార్యకర్తలు వచ్చే విధంగా ఆయా మండలాల నాయకులకు సూచించారు. అంచనాలకు నుంచి నియోజకవర్గం నుండి కార్యకర్తలు తరలి రావడంతో నాయకులలో నూతన ఉత్సాహం నింపింది.
కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు : వోడితల సతీష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే
బీఆర్ఎస్ రజతోత్సవ సభను హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తిలో నిర్వహించడం సంతోషకరం అవకాశాన్ని కల్పించిన అధినేత కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు. సభా వేదికకు సహకరించిన రైతులకు, సభను దిగ్విజయంగా విజయవంతంకు సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రతీ ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు.