Additional Collector | కోల్ సిటీ , మే 31: రామగుండం కార్పొరేషన్ లో ఈనెల 2 నుంచి చేపట్టబోయే వంద రోజుల ప్రణాళిక పకడ్బందీగా జరగాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే.అరుణ శ్రీ సూచించారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో శనివారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు. వంద రోజుల ప్రణాళికపై దిశా నిర్దేశం చేశారు. వర్షాకాలంలో వరదలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో నిర్దేశించిన పారిశుధ్య అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
ప్రతీ ఇంటి నుంచి తప్పనిసరిగా చెత్త సేకరించడం, ప్రజా మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచడం, ప్రతీ శుక్రవారం డ్రైడే చేపట్టం, చెత్త నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి శుభ్రం చేయించడం, నాలాల్లో పూడికతీత, మొక్కలు నాటడం, శిథిలావస్థలో ఉన్న కట్టడాల తొలగింపు, పైపుల ద్వారా సురక్షిత మంచినీటి సరఫరా జరిగేలా చూడటం తదితర అంశాలకు ఈ ప్రణాళికలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆదాయ వనరుల పెంపుపై కూడా నడుం బిగించాలన్నారు.
అర్హులకు కొత్త మహిళా స్వశక్తి సంఘాలను ఏర్పాటు, బ్యాంకు లింకేజీ మంజూరు, వీధి వ్యాపారులకు రుణాలు, పెండింగ్ జోన్ల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలన్నారు. కళాజాత ప్రదర్శన, ర్యాలీలు చేపట్టాలన్నారు. మంచి మార్పుకు సమష్టి కృషి చేయాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎస్ఈ శివానంద్, ఈఈ రామన్, డీఈలు హన్మంతరావు, షాబాజ్, జమీల్, ఆర్ ఆంజనేయులు, టీపీఓ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, మెప్మా డీఎంసీ మౌనిక, సీఓలు, వివిధ విభాగాల అధికారులు, వార్డు ఆఫీసర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.