వస్త్రపరిశ్రమలో చేనేత, మరమగ్గాల పరిశ్రమలున్నాయి. వీటిని గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వం వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. నాడు అప్పు పుట్టక మైక్రోఫైనాన్స్ ఉచ్చులో పడి ఆత్మహత్యలు చేసుకున్న చేనేత, మరమగ్గాల కార్మికులకు రూ.లక్ష రుణమాఫీ చేసి అండగా నిలిచింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మరమగ్గాల కార్మికులపై వివక్ష చూపుతున్నది. చేనేత కార్మికులకే రుణమాఫీ ప్రకటించి, మర నేతన్నలను విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో వస్త్రపరిశ్రమ నిర్వీర్యమై పోయింది. అప్పటి ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులు ఎక్కువ శాతం చేనేత రంగానికే ఖర్చుచేసింది. దీంతో పవర్‌లూం పరిశ్రమకు న్యాయం జరగలేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం టెక్స్టైల్స్ రంగంపై ప్రత్యేక చొరవ చూపింది. చేనేత, మరమగ్గాల పరిశ్రమలు ఏర్పాటు చేసింది. రెండింటికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, బడ్జెట్లో రూ.1200 కోట్లు కేటాయించింది. ఇది గత ఉమ్మడి ప్రభుత్వాలకు తెలంగాణ ప్రభుత్వానికున్న తేడా అని చెప్పవచ్చు. తెలంగాణ ప్రభుత్వం చేయూత నిస్తూ మరమగ్గాల పరిశ్రమకు జీవం పోసింది. ఉపాధిలేక అప్పుల ఊబిలో చిక్కుకున్న కార్మికుల బాధలను చూసిన కేసీఆర్ ప్రభుత్వం మొదటిసారి రాష్ట్రంలోని కార్మికులందరికీ రూ.లక్ష రుణమాఫీ కింద రూ.16 కోట్లు మాఫీ చేసింది. అప్పుడు ఉమ్మడి జిల్లాకు రూ.3కోట్లు మాఫీ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా సహకార బ్యాంకుల్లో తీసుకున్న చేనేత, మరమగ్గాల కార్మికులకు రుణాలు మాఫీ కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 1500 మందికి లబ్ధిచేకూరింది. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలోని చేనేత, మరమగ్గాల కార్మికులు రుణమాఫీ పొందారు. ఒక్క చేనేత కార్మికులకే కాదు, మరమగ్గాల కార్మికులకూ రుణమాఫీ చేసి అండగా నిలిచారు. ఆయన చేసిన రుణమాఫీతో మైక్రో, శేర్ముల్లా ఫైనాన్స్‌ల ఉచ్చులో నుంచి బయటపడ్డారు. ఆర్థిక ఇబ్బందులకు దూరమయ్యారు.
కేసీఆర్ ప్రభుత్వం మారిన తర్వాత నేతన్న పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతున్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం కేవలం చేనేత (చేతిమగ్గాల) కార్మికులకే రూ. లక్ష రుణమాఫీ ప్రకటించింది. అందులో మరమగ్గాల కార్మికులను చేర్చలేదు. తెలంగాణలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధికంగా సిరిసిల్లలో మరమగ్గాలు (పవర్‌లూం)లున్నాయి. వేలాది మంది కార్మికులు అందులో ఉపాధి పొందుతున్నారు. అలాంటి మరమగ్గాల కార్మికులను ప్రభుత్వం కనికరించలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చేనేత కార్మికులకు దాదాపు రూ. 9కోట్ల వరకు రుణమాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే అందులో మరమగ్గాల కార్మికులకు మరో రూ. 5కోట్లు కేటాయించి మాఫీ చేయడానికి ఏమొచ్చిందని కార్మికుల కుటుంబాలు మండిపడుతున్నాయి. కేసీఆర్ ప్ర భుత్వం మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత, మరమగ్గాల కార్మికులు ఇరువురికి రుణమాఫీ ఎందుకు చేయడం లేదంటూ ప్రశ్నిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రుణాలు తీసుకున్న కార్మికులు రెండువేలలోపు ఉంటారని అధికారులు చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మైక్రో, శేర్ముల్లా ఫైనాన్స్‌ల ఉనికే లేకుండా చేసింది. పద్మశాలీ ట్రస్టును ఏర్పాటు చేసి రుణాలు అందజేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్లీ మైక్రోఫైనాన్స్‌లు పుట్టుకొచ్చాయి. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. తమ సంక్షేమం కోసం ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించాలని మరమగ్గాల కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మరమగ్గాల కార్మికులకు అన్యాయం చేస్తున్నది. టెక్స్టైల్స్ రంగం అంటే కేవలం చేనేత మగ్గాలే కాదు, ఈరోజుల్లో దేశవ్యాప్తంగా అత్యధిక ఉపాధి కల్పించేంది మరమగ్గాల పరిశ్రమ. అలాంటి పరిశ్రమంలో పనిచేస్తున్న కార్మికులకు రుణమాఫీ వర్తింప చేయాలి. కేసీఆర్ ప్రభుత్వం చేనేత, మరమగ్గాల కార్మికులకు ఇరువురికి రూ. లక్ష రుణమాఫీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మరమగ్గాల కార్మికులపై పక్షపాతం చూపడం సరికాదు. ఇప్పటికే అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటున్న మరమగ్గాల కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వెంటనే రుణమాఫీ ప్రకటించాలి.