సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ): “మీరు విద్యుత్ బిల్లు చెల్లించలేదు.. వెంటనే చెల్లించండి. లేదంటే కనెక్షన్ కట్ అవుతుంది. ఈ నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోండి.” అంటూ ఓ రిటైర్డ్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు మెసేజ్ పంపి అతడి ఖాతాల్లోంచి రూ.4.8 లక్షలు కొట్టేశారు. ఈ ఘటన బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బోయిన్‌పల్లికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి ఫోన్‌కు విద్యుత్ శాఖ పంపినట్లు సైబర్ నేరగాళ్లు ఓ మెసేజ్ పంపారు. దీంతో బాధితుడు ఆ నంబర్‌కు ఫోన్ చేయగా శుభం అగర్వాల్ అనే వ్యక్తి మాట్లాడి విద్యుత్ కనెక్షన్ కట్ కాకుండా ఉండాలంటే మొదట రూ.12 పంపాలని సూచిస్తూ ఓ లింక్ పంపాడు.
ఆ లింక్ క్లిక్ చేసిన రిటైర్డ్ ఉద్యోగి డెబిట్ కార్డు వివరాలు నింపి బిల్లు చెల్లించాడు. వెంటనే అవతలి వ్యక్తి ఫోన్ చేసి సార్ పేమెంట్ రాలేదు. మరో కార్డు ఉంటే ట్రై చేయమని చెప్పగా.. తన వద్ద ఉన్న ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో చెల్లింపు చేశాడు. అయితే ఈ క్రెడిట్ కార్డు వివరాలు తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు కార్డులోని లిమిట్ మేరకు రూ.4.80 లక్షలు కాజేశారు. మోసాన్ని గ్రహించిన రిటైర్డ్ ఉద్యోగి వెంటనే 1930కు ఫోన్ చేసి ఆపై మల్కాజిగిరి క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.