Chigurumamidi | చిగురుమామిడి, ఫిబ్రవరి 15 : మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని మండలంలోని శివాలయాలు శివనామస్మరణలతో మార్మోగాయి. మండలంలోని చిగురుమామిడి, రామంచ, ముల్కనూరు, రేకొండ, సుందరగిరి, ఇందుర్తి గ్రామాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుండి భక్తులు శివాలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రుద్రాభిషేకాలు, బిల్వదళార్చనలు, పంచామృతాభిషేకాలు, శివ కళ్యాణం, అభిషేకాలు, అఖండ దీపారాధనలు, అర్చనలతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. ఆలయాలను నిర్వాహకులు విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా అలంకరించారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని శివాలయాల్లో రాత్రి జాగారణ ఉండే భక్తులకు ప్రత్యేక పూజలు, భజన కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేశారు.