పెద్దపల్లి, జనవరి 12 : ఎలాగైనా అధికారం రావాలనే కాంక్షతో అనేక అబద్ధాలు చెప్పి.. ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం పూర్తిగా శిథిలమైతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్లో బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష ఆధ్వర్యంలో నిర్వహించిన స్వయం ఉపాధి, ఇన్సూరెన్స్, ఆర్థికంగా ఎదగడంపై అవగాహన సదస్సు, ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిరుద్యోగ యువత, పేదలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా స్వయం ఉపాధి పొంది, ఆర్ధికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిపై కేసు పెట్టాలన్నారు. ప్రశ్నించే గొంతులను నొకుతూ అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ఫార్ములా ఈ-కార్ రేస్ వల్ల రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చేవని, చేయని తప్పుకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలని చూశారని తెలిపారు.
ఫార్మలా ఈ -కార్ రేసు, మొబిలిటీ వ్యాలీ రద్దు చేయకుంటే, తెలంగాణ ఎలక్ట్రిక్ వాహనాల మారెట్‌కు కేంద్రంగా మారేదని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడినందుకు సీఎం రేవంత్ రెడ్డిపై 420, 406 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భువనగిరిలో బీఆర్ఎస్ ఆఫీసుపై దాడి జరిగితే పోలీసులు పట్టించుకోకుండా నిందితుడిని సీఐ కుర్చీలో కూర్చోబెట్టి రాచ మర్యాదలు చేశారని, ఓటుకు నోటు కేసులో జైలు శిక్ష అనుభవించి, అనేక కేసులు ఉన్న రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఇలాగే ఉంటుందని తెలిపారు. అధ్వాన్నంగా ఉన్న గురుకులాలను తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పదేళ్లలో ప్రపంచస్థాయిలో నిలబెడితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఏడాదిలోనే నాశనం చేసిందని ధ్వజమెత్తారు. 54 మంది విద్యార్థులు చనిపోతే ఒక కుటుంబాన్ని కూడా సీఎం పరామర్శించలేదని, గురుకులాలను భ్రష్టు పట్టించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కారు కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. కార్యక్రమంలో ఉష, హనుమయ్య, అరుణ క్వీన్, కందికంటి విజయ్, గుంటికాడి రాణి పాల్గొన్నారు.