దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో దళితబంధుకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర సర్కారు, ముందుగా చెప్పినట్టుగానే పథకాన్ని అంచలంచెలుగా అమలు చేస్తున్నది. అందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. హుజూరాబాద్ నియోజకవర్గంలో పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, 1,784 కోట్లతో 18,021 కుటుంబాలకు లబ్ధి చేకూర్చారు. ఇదే సమయంలో నియోజకవర్గాల్లో దశలవారీగా అమలు చేస్తున్నారు. ముందుగా ఒక్కో నియోజకవర్గానికి వంద మందికి లబ్ధి కల్పించారు. ఉమ్మడి జిల్లాలోని మిగిలిన పన్నెండు నియోజకవర్గాల్లో వంద లక్ష్యం పూర్తి కాగా, మిగిలిన వారికి దశల వారీగా లబ్ధి కల్పించేందుకు కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇటు మరింత పారదర్శకతతోపాటు లబ్ధిదారుల సూచనల మేరకు దళితబంధు యాప్‌ను తెచ్చారు.
– కరీంనగర్, జనవరి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / కరీంనగర్, నమస్తే తెలంగాణ
తరతరాల దోపిడీ నుంచి, సామాజిక వివక్ష నుంచి దళిత సమాజం శాశ్వతంగా విముక్తి పొందే మహోద్యమానికి శ్రీకారం చుడుతున్న. కరీంనగర్ మొదట్నుంచీ రాష్ట్ర సాధనలో ముందున్నది. అందుకే ఈ జిల్లా నుంచే దళితబంధును ప్రారంభిస్తున్న. ఈ పథకం దళితులందరికీ అమలు చేస్తం. ఎవరికీ ఎలాంటి అనుమానాలు వద్దు. అందరూ ఒకటే ఉపాధి మార్గం ఎంచుకోవద్దు. ఊరంతా ట్రాక్టర్లే కొంటే గిరాకీ ఉంటదా..? మీరే ఆలోచించి అడుగులు వేయాలి. దళిత కుటుంబాలన్నీ అభివృద్ధిలోకి రావాలె.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశించినట్టే.. పథకం అమలు విజయవంతంగా కొనసాగుతున్నది. పైలెట్ ప్రాజెక్టు హుజూరాబాద్ నియోజకవర్గంలో 18,021 కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలన్న లక్ష్యం నెరవేరింది. మరోవైపు నియోజకవర్గానికి వంద యూనిట్ల చొప్పున గ్రౌండింగ్ చేయగా, మిగతా వారికి దశలవారీగా అందించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. నిన్నా మొన్నటి వరకు కూలి పని కోసం ఎదురుచూసిన దళితబిడ్డలు ఇప్పుడు కాలరెగరేసి ధీమాగా బతుకుతున్నారు. సొంతంగా వ్యాపారాలు నిర్వహిస్తూ దళితబంధు విజయగాథలను ఆవిష్కరిస్తున్నారు. తమ కాళ్లపై తాము నిలబడడమే కాదు, మరో నలుగురికి ఉపాధి చూపుతూ సగౌరవంగా బతుకుతున్నారు.
దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు. 2021 ఆగస్టు 16న హుజూరాబాద్ మండలం శాలపల్లి- ఇందిరానగర్ వేదికగా సీఎం కేసీఆర్ స్వయంగా ఈ పథకాన్ని ఆవిష్కరించారు. పథకం కింద ఇచ్చిన మొత్తాన్ని తిరిగి చెల్లించే అవసరం లేకుండా ప్రతి దళిత కుటుంబానికీ సాయం అందిస్తున్నారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో 9.90 లక్షలు జమ చేయగా, మిగతా 10 వేలను దళిత నిధి పేరిట డిపాజిట్ చేశారు. పథకం ప్రారంభించినప్పటి నుంచి గతేడాది డిసెంబర్ 13 వరకు నియోజకవర్గంలోని కరీంనగర్ జిల్లా పరిధిలోని నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీలు, హన్మకొండ జిల్లా పరిధిలోని కమలాపూర్ మండలంలో మొత్తం 18,021 దళిత కుటుంబాలను గుర్తించి ఒక్కొక్కరికి 9.90 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం 1,784.79 కోట్లు ఖర్చుచేసింది. అంతే కాకుండా, నియోజకవర్గానికి వంద యూనిట్ల చొప్పున ఉమ్మడి జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో ఇప్పటికే గ్రౌండింగ్ చేసింది. దాదాపు 2 వేల కోట్లతో సుమారు 20 వేల కుటుంబాలకు లబ్ధి కల్పించింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో రిటేల్, సర్వీసు అండ్ సప్లయ్ సెక్టార్లలో మొదటి విడుత కింద 5 లక్షలు ఇచ్చిన వారికి రెండో విడుతలో 4.90 లక్షలు ఇచ్చేందుకు దళితబంధు యాప్ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా ఉన్న 5,934 మంది లబ్ధిదారుల్లో 3 వేల పైచిలుకు మందికి ఇప్పటికే వారు కోరుకున్న పాత, కొత్త యూనిట్లను గ్రౌండింగ్ కాగా, మిగతా వారివి ప్రగతిలో ఉన్నాయి.
నా జీవితాన్ని నిలబెట్టిండు
నా భర్త శంకర్ చిన్న పాన్‌షాప్ వద్ద చెప్పులు కుడుతుండె. మాకు ఇద్దరు కొడుకులు. పెద్దోడు పదో తరగతి. చిన్నోడు మానసిక దివ్యాంగుడు. నా భర్తకు ఐదేండ్ల కింద కిడ్నీలు పాడయినయ్. జగిత్యాల, మెట్పల్లి సర్కారు దవఖాన్లల్ల మందులు వాడినా తక్కువ కాలె. మూణ్నెళ్లకే చనిపోయిండు. ఉండడానికి ఇల్లు లేదు. బతుకుదెరువు లేదు. ఈ బతుకెందుకని బాధపడ్డ. ఇద్దరు కొడుకుల కోసమైనా బతకాలని బీడీలు చుట్టుకుంట ఎల్లదీసిన. ఓరోజు సార్లందరు మా ఇంటికొచ్చిన్రు. భర్త చనిపోయిన వివరాలడిగిన్రు. అన్నీ చెప్పిన. దళితబంధు కింద రూ.10 లక్షలు ఇస్తం ఏం పనిజేత్తవని అడిగిన్రు. గన్ని పైసలు నాకెందుకని? మళ్ల ఎట్ల కట్టాలె.. నాకొద్దని చెప్పిన. మళ్ల కట్టాల్సిన పని లేదు. కేసీఆర్ సార్ ఇస్తుండని అన్నరు. చెప్పుల దుకాణం పెట్టుకుంటవా..? అని అడిగిన్రు. సరేనన్న. మొదటి విడుతగా రూ.నాలుగు లక్షలు ఇచ్చిన్రు. మిగతా పైసలు ఇస్తమని చెప్పిన్రు. ఇక్కన్నే ఓ రూం కిరాయికి తీసుకుని షాపు పెట్టిన. ఆరు నెలలయితంది. గిరాకీ మంచిగైతంది. నా జీవితాన్ని నిలబెట్టిన కేసీఆర్, కేటీఆర్ సార్లకు దండంబెట్టుకుంటున్న. జీవితాంతం రుణపడి ఉంట. నా జీవితానికి దళితబందు బతుకునిచ్చింది.
– రాచర్ల రాధ, రుద్రంగి
నెలకు రూ.50వేలు సంపాదిస్తూ.. ఐదుగురికి ఉపాధి కల్పిస్తూ..
ఈమె పేరు సిద్ధంకి సునీత. ఊరు జమ్మికుంట. తల్లింద్రులు లలిత, రాజయ్య గతంలోనే మృతిచెందారు. సునీత పీజీ, బీఈడీ చేసింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా చెప్పేది. వచ్చే జీతం సరిపోయేది కాదు. ఎలా బతుకుడు? ఏం చేసుడు? అనే సమయంలో వెలుగు రేఖలా.. దళిత బంధు వచ్చింది. సొంత కాళ్ల మీద నిలబడాలి. మరికొందరికి ఉపాధి కల్పించాలన్నదే తన కల. దళిత బంధుకు దరఖాస్తు చేసుకుంది. భగవతి లేడీస్ ఎంపోరియం, బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసుకున్నది. సంవత్సరం నుంచి మంచిగా నడుస్తున్నది. ముగ్గురు మహిళలకు తన షాపులో ఉపాధి కల్పిస్తున్నది. అన్నీ పోను నెలకు రూ.50వేల దాకా సంపాదిస్తున్నాని గర్వంగా చెబుతున్నది. దళిత బంధుతోనే నా ఎదుగుల మొదలైందని, సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటానని చెబుతున్నది.
– జమ్మికుంట, జనవరి 21
నాడు వంట మాస్టర్.. నేడు బిర్యానీ సెంటర్ ఓనర్
ఈ చిత్రంలో కనిపిస్తున్న దంపతులు చిలువేరి కుమార్ నాగమణి. ఊరు ఇల్లందకుంట మండలం మల్యాల. వీరికి ఇద్దరు పిల్లలు. కుమార్ జమ్మికుంటలోని ఓ హోటల్లో వంట మాస్టర్‌గా పనిచేసుకుంటూ చాలీచాలని జీతంతో కుటుంబానికి నెట్టుకొచ్చేవాడు. సొంతంగా ఫుడ్ బిజినెస్ పెడదామంటే నెలాఖరుకు వచ్చేసరికి చేతిలో చిల్లిగవ్వ ఉండకపోయేది. ఇక నాగమణి ఊళ్లో కూలీ పనులకు వెళ్లేది. ఇద్దరు చేసిన కష్టమంతా బట్ట, పొట్ట, పిల్లల చదువులకే సరిపోయేది. అప్పోసొప్పో చేసి బిజినెస్ మొదలు పెడదామని అనుకున్నా పుట్టలేదు. చేసేదేమీ లేక జీవితాన్ని నెట్టుకురాసాగాడు. వీరికి సీఎం కేసీఆర్ తెచ్చిన దళిత బంధు వరంలా మారింది. దళిత బంధు కింద ఫాస్ట్ పుడ్ బిర్యానీ సెంటర్ యూనిట్ ఎంపిక చేసుకున్నారు. వచ్చిన డబ్బులతో ఇల్లందకుంట మండల కేంద్రంలో వ్యాపారాన్ని ప్రారంభించారు. నేను వంట మాస్టర్‌గా పనిచేసినపుడు రోజుకు కేవలం రూ. 500 కూలీ వచ్చేదని, కానీ ఇప్పుడు నా భార్య నాగమణితో కలిసి బిర్యానీ సెంటర్ నడుపుతూ రోజువారీగా ఖర్చులన్నీ పోను రూ. 2వేల దాకా సంపాదిస్తున్నానని కుమార్ సంతోషంగా చెబుతున్నాడు. తనకు జీవితాన్ని ఇచ్చిన కేసీఆర్‌కు రుణపడి ఉంటానని అంటున్నాడు. – ఇల్లందకుంట, జనవరి 21
విజయవంతంగా వ్యాపారాలు
దళితబంధు రాకతో దళితులు ఉపాధి మార్గంలో పయనిస్తున్నారు. అధికారుల సూచనతో మంచి ఆదాయాన్నిచ్చే యూనిట్లను ఎంచుకొన్నారు. అనుభవం లేని వారు శిక్షణ తీసుకొని మరీ ముందడుగు వేశారు. దాంతో వేలాది మంది లబ్ధిదారులు ధీమాగా ఉపాధివైపు అడుగులు వేశారు. గతంలో కూలీలు, డ్రైవర్లుగా ఉన్న వాళ్లు ఇప్పుడు వాహనాలు, దుకాణాలకు ఓనర్లుగా మారారు. విద్యావంతులైన యువకులు కంప్యూటర్ సెంటర్లు, మెడికల్ షాపులు, మీ సేవ కేంద్రాలు, ఫొటో స్టూడియోలు పెట్టుకున్నారు. ఇంకొందరు సెంట్రింగ్, ఎలక్ట్రికల్, సిమెంట్, ఐరన్ అండ్ హార్డ్ వేర్, ఫుట్‌వేర్, ఫర్టిలైజర్, ఆటో మొబైల్, బట్టల షాపులు, బేకరీలు, సూపర్ మార్కెట్లు, డెయిరీలు ఇలా ఎన్నో రకాల వ్యాపారాలు నడిపిస్తున్నారు. కొందరు గ్రూపుగా ఏర్పడి కూడా వ్యాపారాలను పెట్టుకున్నారు. కొందరైతే జట్టుగా కలిసి ఆర్టీసీ బస్సులు, జేసీబీలు, పెట్రోలు బంకులు, రైసుమిల్లులు, బ్రిక్స్, టైల్స్ పరిశ్రమలు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూర్చుకుంటున్నారు. ఎవరిని చూసినా సగటున రెండు వేలకుపైగానే సంపాదించుకుంటున్నారు. వేలాది మంది సొంతంగా ఉపాధి పొందడంతోపాటు మరో నలుగురికి పని కల్పిస్తూ గౌరవంగా బతుకుతున్నారు. ఇప్పుడు దళితబంధుతో జీవితాల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తుండగా, ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దళితబంధు రాకతో తమ బతుకులు, కుటుంబాలు గాడిన పడుతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జీవితాంతం తమ కుటుంబాలు రుణపడి ఉంటాయని కృతజ్ఞతలు చెబుతున్నారు.
దళిత బంధే దిక్కయింది
చిత్రంలో కనిపిస్తున్నది మద్దునాల వెంకటేశ్. ఊరు ధర్మారం మండలం ఖిలావనపర్తి. ఇతనికి భార్య విజయలక్ష్మి, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు డిగ్రీ, చిన్న కూతురు ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. మొన్నటిదాకా ఉన్న కొద్దిపాటి ప్రభుత్వ అసైన్డ్ భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇద్దరు కూతుళ్లను చదివించేందుకు ఆర్థిక స్థోమత లేక సతమతమయ్యేవాడు. ఏదైనా బిజినెస్ చేద్దామని అనుకున్నా చేతిలో చిల్లిగవ్వలేక ఆశ చంపుకొని ఉన్నంతలో జీవితాన్ని నెట్టుకొస్తూ ఉండేవాడు. కానీ వెంకటేశ్‌కు సీఎం కేసీఆర్ తెచ్చిన ‘దళిత బంధు’ పెద్ద దిక్కయింది. రూ.10 లక్షలు మంజూరుకాగా, గత మే నెలలో గ్రామంలోని మెయిన్ రోడ్డు పక్కన ఒక షెట్టర్‌ను అద్దెకు తీసుకొని సిమెంట్, ఐరన్ దుకాణం ఏర్పాటు చేసుకున్నాడు. మంచి సెంటర్ కావడంతో గిరాకీ పెరిగింది. నెలనెలా ఖర్చులు, షెట్టర్ కిరాయి పోను రూ.15 వేల దాకా సంపాదిస్తున్నాడు. ఎవరేమి అన్నా దళితబంధుతోనే నా జీవితం నిలబడ్డది. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా. – ధర్మారం, జనవరి 21
పారదర్శకత కోసం యాప్
దళితబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సబ్‌ప్లాన్ కింద ప్రకటించిన నేపథ్యంలో ప్రతి ఏటా నిధులు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సబ్‌ప్లాన్ కింద కేటాయించే ప్రతి పైసా దళితుల కోసమే ఖర్చు చేస్తారు. గత ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఏప్రిల్, మే నెలల్లోనూ గడిచిన ఏడాది కింద ఎంపికైన లబ్ధిదారులకు గ్రౌండింగ్ చేయడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పించినట్లు హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టు పూర్తి కాగా, ఇతర నియోజకవర్గాల్లో ఒక్కోదానికి కేటాయించిన వంద యూనిట్లు కూడా నూటికి నూరు శాతం గ్రౌండింగ్ అయ్యాయి. హుజూరాబాద్‌లో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టులో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని దరఖాస్తులు, గ్రౌండింగ్ డేటా వివరాల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేపట్టింది. కొత్తగా మార్గదర్శకాలు తయారు చేస్తున్నది. అందులో భాగంగా ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో ఆన్లైన్లోనే దరఖాస్తులు స్వీకరించేందుకు సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నది. అందులో భాగంగా దళితబంధు అమలు తీరును పరిశీలించేందుకు ఒక యాప్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నది. దళితబంధు పేరిట ఇప్పటికే ఈ యాప్‌ను ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో వినియోగిస్తున్నారు. ఇందులో క్లస్టర్ అధికారులు లబ్ధిదారుల వివరాలను పూర్తి స్థాయిలో అప్లోడ్ చేస్తున్నారు. పేరు నమోదు చేయగానే వారికి సంబంధించిన పూర్తి వివరాలు, లబ్ధిదారులు యూనిట్ల వినియోగించుకుంటున్న తీరు కళ్ల ముందు ప్రత్యక్షమయ్యేలా ఈ యాప్‌ను రూపొందించారు. అంతే కాకుండా, మొదటి విడుతలో 5 లక్షల ఆర్థిక సహాయం మాత్రమే అందిన లబ్ధిదారులకు మిగతా మొత్తాన్ని గ్రౌండింగ్ చేసేందుకు అధికారులు ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు. మొదటి విడతలో 50 శాతం మాత్రమే అందిన లబ్ధిదారులు ఇకపై రెండో విడత కోసం ఎవరి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.
రోజుకు రూ.4వేలు సంపాదిస్తున్నాం..
నేను పదిహేనేండ్లపాటు ఫైనాన్స్‌లో ప్యాసింజర్ ఆటో కొనుక్కొని కిరాయిలు కొట్టుకుంటూ బతికిన. పొద్దంతా నడిపినా డిజీల్ ఖర్చులు పోను రూ.200 కూడా మిగిలకపోయేది. దాంట్లో కుటుంబాన్ని ఏం పోషిస్తం. బండి కిస్తీలు ఏం కడతాం. నెల తిరక్కముందే ఫైనాన్స్వాళ్లు ఇంటికి వచ్చేటోళ్లు. ఏం చేయాలో అర్థంకాకపోయేది. ఎవరో ఒకరి దగ్గరికిపోయి అప్పు తెచ్చి కట్టేది. అన్నేండ్లలో సంపాదించేమీ లేదు కానీ అప్పుడు మాత్రం తడిసిమోపెడైనయి. ఇట్లా అయితే బతుకుడు కష్టమని ఏదైనా చేయాలని అనుకున్నా. కానీ ఏ అవకాశం దొరకలేదు. అప్పుడే సీఎం కేసీఆర్ దళిత బంధు స్కీం తెచ్చి ధైర్యాన్ని ఇచ్చిండు. ఎనిమిది నెలల కింద పథకం కింద మా అన్నదమ్ములిద్దరం కలిసి టిప్పర్ కొనుక్కున్నం. ప్రతి రోజూ కంకర, మట్టి కొడుతున్నం. గిరాకీ మంచిగ ఉన్నది. ఖర్చులు పోను రోజుకు రూ.4వేల దాకా దొరుకుతన్నయి. ఇప్పుడు మాకు ఏ బాధాలేదు. ఇంటిల్లిపాది సంతోషంగా ఉన్నాం.
– ఎర్ర కుమార్, హుజూరాబాద్ (హుజూరాబాద్‌రూరల్)
పేరు నిలబెట్టుకుంటం..
నాతోపాటు డప్పుల లింగయ్య, సుద్దమల్ల విజయ్‌కుమార్ కలిసి అక్కపల్లిలో ఎకరం స్థలంలో చిన్న రైసుమిల్లు ఏర్పాటు చేసుకుంటున్నం. సర్కారు ఇచ్చిన దళితబంధు పైసలు పోను మిగిలిన డబ్బులు బ్యాంకు లోను తీసుకున్నం. షెడ్డు నిర్మాణం పూర్తయింది. మిషన్లు వచ్చినయ్. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దయవల్లనే మేం రైసు మిల్లు పెట్టుకుంటున్నం. చిన్నజీవితాలకు వెలుగునిచ్చిన వారికి జీవితాంతం రుణపడి ఉంటం. వచ్చిన పైసలతో వ్యాపారం చేసి పేరు నిలబెట్టుకుంటం.
– సుద్దమల్ల రాజేశ్వరి, పదిర,
ఎల్లారెడ్డిపేట మండలం, రాజన్న సిరిసిల్ల
కూలీ కొడుకు.. ఫ్యాబ్రిక్స్ ఓనర్
ఇతడి పేరు తలగంప రాజు. అమ్మనాన్న పేర్లు వనజ-సమ్మయ్య. మున్సిపల్ పరిధిలోని ధర్మారం. రాజు పీజీ చేయగా, తమ్ముడు శశి డిగ్రీ దాకా చదువుతున్నాడు. తల్లిదండ్రులిద్దరూ కొడుకులను కష్టం చేసి బాగానే చదివించారు. అయితే కూలీతో ఎన్నేళ్లు పోషించుడు. బతుకుడెట్లా అని వనజ, సమ్మయ్య నిత్యం బాధపడుతుండేవాళ్లు. పిల్లలు కూడా కూలీలుగానే బతుకుడా..? వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడుడెట్లా..? అని ఆలోచించుకునేవాళ్లు. ఏం చేద్దామన్నా. లక్షలు కావాలే. ఎవలిస్తరు అనుకునేటోళ్లు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ దళిత బంధు ప్రవేశపెట్టిండు. దళిత బంధు లబ్ధిదారుగా తల్లి వనజ ఎంపికైంది. పెద్ద కొడుకు ఆలోచనతో పట్టణంలో గాయత్రి ఫ్యాబ్రిక్స్ పెట్టింది. సదరు ప్యాబ్రిక్స్ను రాజు నడిపిస్తున్నాడు. ఫ్యాబ్రిక్స్ ఒక్కటే కాకుండా మరో పోర్షన్‌కు కిరాయికి తీసుకుని డిజైన్ బోటిక్‌ను ఏర్పాటు చేశాడు. ఫ్యాబ్రిక్స్‌లో ఇద్దరు, బోటిక్‌లో ముగ్గురు వ్యక్తులకు ఉపాధి కల్పిస్తున్నాడు. తన రూంల కిరాయి పోనూ, ఐదుగురికి జీతంపోను నెలకు రూ.30వేలకు పైగా సంపాదిస్తున్నాడు. తల్లిదండ్రులను కూలీకి బంద్ చేయించాడు. గౌరవంగా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
– జమ్మికుంట, జనవరి 21
దళితులకు అండగా నిలుస్తున్నది..
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న దళిత కుటుంబాలకు మెరుగైన, నిలకడైన ఆదాయం లభించడం కోసం, అందుకయ్యే పెట్టుబడి అంతా ప్రభుత్వమే సమకూరుస్తున్నది. వంద శాతం గ్రాంట్ రూపంలో అందజేస్తున్న ఈ డబ్బులను లబ్ధిదారు ఖాతాలో నేరుగా జమచేస్తున్నాం. తీసుకున్న సొమ్ము తిరిగి ప్రభుత్వానికి చెల్లించనవసరం లేదు. మంత్రి కేటీఆర్ మార్గదర్శనం మేరకు లాభదాయకమైన యూనిట్లను లబ్ధిదారులకు గ్రౌండింగ్ చేశాం. వ్యాపార రంగంలో రాణించేలా అవగాహన కల్పించాం. వచ్చిన ఆదాయంతో తమ జీవన అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. మిగిలింది పొదుపు చేసుకుంటున్నారు. దళితబంధు ప్రయోజనాన్ని దళితులందరికీ దశల వారీగా ప్రభుత్వం అందజేయనున్నది. షెడ్యూల్ కులాలను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదిగేందుకు దళితబంధు ఎంతగానో ఉపయోగ పడుతుంది.
– అనురాగ్ జయంతి, కలెక్టర్, రాజన్న సిరిసిల్ల
నాడు ఆటో డ్రైవర్.. నేడు మినీ ట్రక్కు ఓనర్
ఇతని పేరు శనిగరం కుమార్. ఊరు హుజూరాబాద్ మండలం చెల్పూర్. ఇతనికి ఇద్దరు కొడుకులు. ఇటీవలే పెద్ద కొడుకుకు పెండ్లి జరిపించాడు. కుమార్‌కు ఇళ్లు జాగ తప్ప ఇతరాత్ర ఆస్తులేమీ లేవు. కుటుంబ పోషణకు ఆటో నడుపుకుంటూ జీవితం వెళ్లదీసేటోడు. ఆ ఆటో పాతది కావడం..రోజంతా గిరగిర తిరిగి సంపాదించినదంతా బండి రిపేరుకే పోయేది. కొత్త ఆటో కొనాలని ఆశ పడ్డా చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో పాత దానితోనే కాలం బతుకు బండి గెంటించుకుంటూ రాసాగాడు. అప్పుసొప్పో తెచ్చి కొందామంటే ఇచ్చేవాళ్లు జామీను అడగడంతో కుమార్‌కు ధైర్యం సరిపోక ఆశ చంపుకున్నాడు. చేసేదేమీ లేక ఆశ చంపుకొని అవస్థలు పడుతున్న కుమార్‌కు కేసీఆర్ రూపంలో అదృష్టం కలిసివచ్చింది. దళితబంధుతో బతుకుదారి దొరికింది. పథకం కింద వచ్చిన రూ.10 లక్షలతో మినీ ట్రక్కు(బొలేరో) కొన్నాడు. దాదాపుగా 10 నెలల క్రితం అతను తీసుకోగా నెలకు రూ.24వేల ఆదాయం వస్తున్నట్లు తెలిపాడు. నిత్యం ఏదో గిరాకీ దొరుకుతుందని, సీజన్లో ధాన్యం కిరాయిలతో దండిగా ఆదాయం వచ్చిందని కుమార్ అంటున్నడు. ఖర్చులు పోను రోజుకు కొంచెం అటుఇటుగా రూ.800 మిగులుతున్నాయని, నా జీవితంలో ట్రక్కు కొనకపోదునని, కేసీఆర్ సారు దయతో బండికి ఓనరయ్యానని సంబురపడుతూ చెబుతున్నాడు.
– హుజూరాబాద్, జనవరి 21
బిడ్డ పెళ్లి ఘనంగా చేస్తాం..
ఇక్కడ కనిపిస్తున్న దంపతులు కొత్తూరి రాధ- మొగిలి. ఊరు హుజూరాబాద్ మండలం కనుకులగిద్ద. వీరికి ముగ్గురు కుమార్తెలు. ఇల్లు జాగ తప్ప ఇతరత్రా ఆస్తిపాస్తుల్లేవు. అప్పుసొప్పో చేసి ఇద్దరు బిడ్డల పెండ్లి చేశారు. మరో బిడ్డ పెళ్లి ఎలా చేయాలనుకునే సమయంలోనే దళితబంధు పథకం రావడంతో డెయిరీ యూనిట్‌ను ఎంపిక చేసుకున్నారు. మొదటి విడుత రూ.5.50 లక్షలు రాగా, రూ.4లక్షలతో నాలుగు బర్రెలు, రూ.1.50 లక్షలతో రేకుల షెడ్డు, ఇతరత్రా సౌకర్యాలకు వెచ్చించారు. నాలుగు గేదెలతో అన్ని ఖర్చులు పోను నెలకు రూ.15వేల ఆదాయం సంపాదిస్తున్నారు. పైసలు కూడబెట్టి చిన్న బిడ్డ పెళ్లి ఘనంగా చేస్తామని చెబుతున్నారు. – హుజూరాబాద్, జనవరి 21
వైద్యశాలలో కొత్త పరికరాలు కొన్న
నా పేరు ఎర్ర రాజేందర్. నేను డెంటిస్టును. మాది జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్. మా నాన్న సాధారణ ట్రాక్టర్ డ్రైవర్. ఎంతో కష్టపడి ఖమ్మంలోని మమతా దంత వైద్య కళాశాలలో బీడీఎస్ చదివించాడు. 2009లో హుస్నాబాద్‌లోని శ్రీ సాయి దంత వైద్యశాలలో, 2010లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కిరణ్ హాస్పిటల్లో పనిచేశా. 2011లో రూ.లక్షన్నరతో పాత దవాఖాన సామగ్రిని కొనుగోలు చేసి జమ్మికుంట పట్టణంలో దంత వైద్యశాలను ప్రారంభించా. అప్పట్లో నెలకు రూ.50వేల ఆదాయం మాత్రమే వచ్చేది. పాత పరికరాలతో కొంత ఇబ్బందిగా ఉండేది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన దళిత బంధు కింద మొదట విడుతగా రూ.5 లక్షలకు తోడు మరో రూ. 1.5లక్షలు కలుపుకొని ఆధునిక పరికరాలు కొనుగోలు చేశా. ఇప్పుడు దవాఖానలో ఎక్స్‌రే మిషన్ కూడా ఉంది. అప్పటితో పోల్చితే ఇప్పుడు ఆదాయం పెరిగింది. ఒక అసిస్టెంట్‌ను కూడా పెట్టుకున్నా. రెండో విడత డబ్బులతో అడ్వాన్స్ టెక్నాలజీ కలిగిన పరికరాలను కొనుగోలు చేస్తా. సీఎం కేసీఆర్‌కు చాలా థాంక్స్.
– ఎర్ర రాజేందర్, దంత వైద్యుడు, బిజిగిరిషరీఫ్(జమ్మికుంటరూరల్)
ఫొటోగ్రాఫర్ స్టూడియో ఓనరైండు..
ఈ చిత్రంలో కనిపిస్తున్నది కల్యాణం రాజు. ఊరు వీణవంక మండల కేంద్రం. 18 ఏండ్లుగా ఫొటో స్టూడియోలో పనిచేశాడు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. చాలీచాలని జీతంతో అష్టకష్టాలు పడ్డాడు. వేరే పనికి వెళ్లలేక, కుటుంబాన్ని పోషించలేక ఉన్నంతలో బతుకీడ్చిన రాజుకు దళిత బంధు దారి చూపింది. ఫొటోగ్రఫీలో ఎంతో అనుభవం ఉండడంతో ఫొటో స్టూడియో యూనిట్‌ను ఎంపిక చేసుకున్నాడు. మండల కేంద్రంలోనే స్టూడియో ఏర్పాటు చేసుకున్నాడు. అధునాతన కెమెరా, ప్రింటర్ తీసుకున్నాడు. స్థానికులు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా తక్కువ సమయంలో ఫొటోలు, ప్రింట్లను తీసి అందిస్తూ రోజూవారీగా బాగానే సంపాదిస్తున్నాడు. ఫొటోగ్రాఫర్ నుంచి స్టూడియోకు ఓనరైండు. ఖర్చులన్నీ పోను నెలకు రూ.10వేల దాకా సంపాదిస్తున్నాడు. – వీణవంక, జనవరి 21
అశోక్‌కుమార్ జీవితం నిలబడ్డది..
ఇతని పేరు గాజుల అశోక్‌కుమార్. ఊరు వీణవంక మండలం బ్రాహ్మణపల్లి. డిగ్రీ దాకా చదువుకున్నా. ప్రభుత్వం ఉద్యోగం కోసం చాలా కష్టపడ్డాడు. నౌకరి రాకపోవడంతో నాలుగేండ్ల క్రితం హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ మారుతి షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా జాయిన్ అయ్యాడు. నెలకు రూ.10వేలు జీతం, పైగా కంపనీ టార్గెట్. జీతం సరిపోక.. టార్గెట్ రీచ్కాక.. నానా ఇబ్బందులు పడ్డాడు. ఇదే సమయంలో వివాహం చేసుకున్నాడు. కుటుంబ పోషణ భారమైంది. తనలో తాను కుమిలిపోయాడు. ఏదైనా బతుకుదెరువు దొరక్క పోతుందా..? అనే ఆశతో కాలం గడిపేవాడు. ఇదే సమయంలో దళిత బంధు పథకం వస్తోందని పేపర్లో చదివాడు. పథకాన్ని తొలుత హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేయడంతో ప్రైవేట్ ఉద్యోగం మానేసి కుటుంబంతో సహా స్వగ్రామానికి వచ్చాడు. తనకు సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా అనుభవం ఉండడంతో సూపర్ మార్కెట్‌ను ఎంచుకున్నాడు. మండల కేంద్రంలో ప్రజలకు అవసరమున్న మార్కెట్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. తాను ఉపాధి పొందుతూ.. మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నాడు. నెలకు రూ.15వేల దాకా సంపాదిస్తూ దర్జాగా బతుకుతున్నాడు.
– వీణవంక, జనవరి 21