సిరిసిల్ల రూరల్/కలెక్టరేట్,ఆగస్టు 8: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో బీసీ వృత్తిదారులకు రూ.లక్ష సాయం సందర్భంగా కేటీఆర్ హాస్యచతురతో కూడిన ప్రసంగం లబ్ధిదారులను కట్టిపడేసింది. తనదైన శైలిలో అటు ప్రతిపక్షాలపై సైటర్లు వేస్తూ.. ప్రభుత్వ పథకాలను సోదాహరణంగా వివరించి ఆకట్టుకున్నారు. కేటీఆర్ పంచులు, విసుర్లకు అంతా పగలబడి నవ్వారు. కరతాల ధ్వనులతో ప్రతిస్పందించారు. రైతుబంధుపై ఆవునూరుకు చెందిన నర్సయ్య అన్న మాటలను గుర్తు చేస్తూ రైతుకు ఎంత పొలం ఉంటే అంతే రైతుబంధు వస్తుందని, ఎక్కువ ఉన్న వారికి ఎక్కువనే వస్తుందని వివరించారు. ఎక్కువ భూమి ఉన్నోళ్లకు రావద్దని అనడం సరికాదన్నారు.