కలెక్టరేట్, ఫిబ్రవరి 19 : కాంగ్రెస్ ప్రభుత్వంపై(Congress )తెలంగాణ ఉద్యమకారులు పోరుబాట పట్టారు. ఇచ్చిన హామీలు అటకెక్కించి, తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పాలకులను ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. ఏడాదికాలంగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసినా ఫలితం లేకపోవటంతో, విడతల వారీగా ఆందోళనలు చేసేందుకు ఉద్యుక్తమవుతున్నారు. ఎన్నికల ముందు తమ డిమాండ్లు మేనిఫెస్టోలో పొందుపరిచి, గెలిచిన అనంతరం అమలులో నిర్లక్ష్యం వహిస్తుండటాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు.
ముందుగా తమకిచ్చిన హామీలను పాలకుల దృష్టికి తీసుకెళ్లి, అనంతరం ఉద్యమ దీక్షలు చేపట్టేందుకు కార్యచరణ రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉద్యమకారులకిచ్చిన హామీల అమలు గుర్తు చేస్తూ పోస్టుకార్డు ఉద్యమం ప్రారంభించారు. అనంతరం శాంతియుత ప్రదర్శనలు, యాగాలు, హోమాల ద్వారా తమ నిరసనలు తెలుపనున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కనకం కుమారస్వామి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ ప్రధాన ద్వారం పక్కన గల పోస్టు బాక్సులో వందమందికి పైగా ఉద్యమకారులు తరలివచ్చి ఇచ్చిన హామీలు గుర్తు చేస్తూ రేవంత్‌రెడ్డికి పోస్టుకార్డులు పంపారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారులకు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు సత్వరమే అమలు చేయాలని డిమాండ్ చేశారు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలంతో పాటు రూ.25వేల పెన్షన్ వెంటనే మంజూరీ చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదంటూనే 15 నెలల కింద తమకిచ్చిన మాట మర్చిపోయిందంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం సత్వరమే స్పందించకపోతే వరుస ఆందోళనల కార్యచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులు కారుపాకల మున్న, గాలి రమేశ్ యాదవ్, గరిగే కోటేశ్వర్, అంకూష్, మల్లేశం, తాటిపల్లి శంకర్, మొగిలితో పాటు ఉద్యమకారులు పాల్గొన్నారు.