Chigurumamidi | చిగురుమామిడి, ఫిబ్రవరి 6 : విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని మండల విద్యాధికారిని పావని అన్నారు. చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇటీవల 8వ తరగతి విద్యార్థులు మద్యం సేవించి బ్యాగులలో మద్యం సీసాలను తీసుకురావడం పట్ల ఎంఈఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపవద్దన్నారు. తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి పర్మిషన్ తీసుకుంటేనే విద్యార్థులను పంపించాలని ఉపాధ్యాయులకు ఎంఈఓ సూచించారు.
విద్యార్థుల ఆలోచన విధానాలను ఉపాధ్యాయులు రోజువారీగా గమనించాలన్నారు. సమాజంలోని మార్పుల దృష్ట్యా విద్యార్థుల ఆలోచన మారుతుందన్నారు. విద్యార్థులు విద్య పై ప్రత్యేక దృష్టి సారించాలని, పదవ తరగతిలో 100శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలన్నారు. అనంతరం పాఠశాలలోని మధ్యాహ్న భోజనం పనితీరు, విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. వీరి వెంట ప్రధానోపాధ్యాయురాలు జయప్రద, ఉపాధ్యాయులు ఉన్నారు.