Vemulawada | వేములవాడ రూరల్, ఏప్రిల్ 7 : వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి నిర్మల్ పాఠశాలలో జరుగుతున్న ఎస్ఎస్సీ స్పాట్ మూల్యాంకన భత్యాలు, ఇతర పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఉపాధ్యాయసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. టీటీ జేఏసీ, యూఎస్పీసీ, జాక్టో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో సుమారు 60 ఉపాధ్యాయ సంఘాల తరఫున మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్సీ స్పాట్ సెంటర్ (నిర్మల పాఠశాల నాంపల్లిలో) నిరసన చేపట్టి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ 2025 మార్చి లో నిర్వహించిన పదో తరగతి స్పాట్ రెమ్యూనరేషన్ వెంటనే చెల్లింపులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 2024 లో నిర్వహించిన కుల గణన రెమ్యూనరేషన్ చెల్లింపులు ఇప్పటికీ చేపట్టలేదని, 7 సంవత్సరాల నుండి SSC స్పాట్ రెమ్యూనరేషన్ పెంచలేదని, ఇంటర్‌కు మాత్రం రెండు సార్లు పెంచారని వాపోయారు. కనీసం 50 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం నిర్వహిస్తున్న SSC స్పాట్ రెమ్యూనరేషన్ వెంటనే చెల్లింపులు జరపాలన్నారు. అనంతరం SSC క్యాంప్ అధికారి కి ప్రాతినిధ్య పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు ఎడ్ల కిషన్, బోయనగారి నారాయణ, గుండమనేని మహేందర్ రావు, జంగిటి రాజు, అవురం సుధాకర్ రెడ్డి, వంగ తిరుపతి, వికృతి అంజయ్య, రేవోజు సదానందం, మొగిలి లక్ష్మణ్, మండల, జిల్లా, రాష్ట్ర బాధ్యులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.