విద్యానగర్, మార్చి 10 : ప్రజలు ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, దృష్టి లోపాలను దూరం చేసుకోవాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. పట్టణంలోని 8వ డివిజన్ అల్గునూర్, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ‘కంటి వెలుగు’ శిబిరాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ‘కంటి వెలుగు’ శిబిరాలకు వచ్చే వారిలో వయో వృద్ధులకు ముందుగా పరీక్షలు చేయాలని వైద్యులకు సూచించారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న శిబిరంలో విద్యార్థులు, సిబ్బంది కూడా పరీక్షలు చేసుకోవాలని తెలిపారు. చుట్టు పక్కలవారికి శిబిరం ఏర్పాటు గురించి తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, డీఎంహెచ్వో జువేరియా, తహసీల్దార్లు కనకయ్య, సుధాకర్, అల్గునూర్ కార్పొరేటర్ సల్ల శారద రవీందర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.