నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతు పెరుగుతున్నది. సబ్బండవర్గాల ప్రజానీకం ఆశీర్వాదాలు అందిస్తున్నది. ‘మా ఓటు బీఆర్ఎస్కే’ అంటూ పలు చోట్ల తీర్మానాలు చేస్తున్నది. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఐదు నియోజకవర్గాలు, రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు రెండు నియోజకవర్గాల్లో నిర్వహించిన బహిరంగ సభలకు జనం వేలాదిగా తరలివచ్చారు. జనాన్ని చూస్తే విజయోత్సవ సభలను తలపించగా, ప్రజాస్పందనకు ప్రతిపక్షాలు బేజారవుతున్నాయి. ఎన్నికల గడువు సమీపిస్తున్నా అభ్యర్థుల కోసం ఇంకా వెదుకుతూనే ఉన్నాయి. గులాబీ పార్టీ అభ్యర్థులు మాత్రం ఇప్పటికే నియోజకవర్గాలను చుట్టడమే కాదు, సకల జనులతో మమేకమవుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా, తమదైన శైలిలో ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నారు. మరోవైపు తమను ఆశీర్వదిస్తే భవిష్యత్‌లో చేపట్టబోయే అభివృద్ధి పనుల గురించి వివరిస్తుండగా, కాంగ్రెస్, బీజేపీని నమ్మితే జరిగే నష్టాలను బహిరంగ సభల ద్వారా అమాత్యులు కేటీఆర్, హరీశ్‌రావు అర్థమయ్యేలా వివరిస్తున్న తీరు ప్రజలను ఆలోచింపజేస్తున్నది. మొత్తంగా బీఆర్ఎస్కు ఆదరణ మరింత పెరుగడం, సభలు సక్సెస్ కావడంతో శ్రేణుల్లో నయాజోష్ కనిపిస్తున్నది.
కరీంనగర్, అక్టోబర్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అభ్యర్థులు జోరు పెంచారు. అప్పుడే ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాలను ఒక దఫా చుట్టి వచ్చారు. సమయం దొరికినప్పుడల్లా బహిరంగ సభలు నిర్వహిస్తూనే.. మరోవైపు ప్రజలకు చేరువవుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకు భిన్నంగా ఆది నుంచీ స్థానికంగా అందుబాటులో ఉంటూ, నిత్యం ప్రజల మధ్యే గడుపుతున్నారు. రాబోయే ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి నేటి వరకు అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తూనే, మరోవైపు గడపగడపకూ వెళ్తున్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో ఊరారా చేసిన అభివృద్ధిని చెబుతూ, ప్రజా ఆశీర్వాదం కోరుతున్నారు.
ఎన్నికల వేళ బీఆర్ఎస్ బలం.. బలగం పెరుగుతున్నది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పార్టీ అభ్యర్థులకు ఊరూరా సంపూర్ణ మద్దతు లభిస్తుండడం, ఎక్కడ మీటింగ్ పెట్టినా ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తుండడంతో పార్టీలో నయాజోష్ కనిపిస్తున్నది. తాజాగా అమాత్యులు కేటీఆర్, హరీశ్ రావు ఉమ్మడి కరీంనగర్లో నిర్వహించిన ఏడు బహిరంగ సభలు గ్రాండ్ సక్సెస్ కావడం, జనం బ్రహ్మరథం పట్టడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఏ పబ్లిక్ మీటింగ్ చూసినా జనంతో విజయోత్సవ సభలను తలపించగా, పార్టీలో సమరోత్సాహం వెల్లివిరిసింది. ప్రజా స్పందన చూస్తున్న ప్రతిపక్షాల్లో వణుకు మొదలుకాగా, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ జైత్రయాత్ర ఖాయమనే ధీమా కనిపిస్తున్నది.
మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే గ్రామగ్రామాన తిరిగిన ఆయన, రెండో దఫా ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పటికే దాదాపు 13 ఎత్తిపోతల పథకాలను వినియోగంలోకి తెచ్చారు. వందశాతానికి పైగా సాగు విస్తీర్ణం పెంచడంలో విజయం సాధించిన ఆయన, తాజాగా నియోజకవర్గానికి వ్యవసాయ కళాశాల సాధించారు. తాజాగా మంత్రి కేటీఆర్ నిర్వహించిన సభ పూర్తి స్థాయిలో విజయవంతమైంది. ఈ సందర్భంగా కొప్పుల గురించి మంత్రి కేటీఆర్ వివరించిన తీరు అందరినీ ఆకట్టుకోగా, మంచి విజయాన్ని అందించేందుకు సబ్బండవర్గాల ఆశీస్సులు అందిస్తున్నాయి.
కరీంనగర్ నియోజకవర్గంలో మంత్రి, ప్రస్తుత అభ్యర్థి గంగుల కమలాకర్ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గాన్ని పూర్తిగా కలియతిరిగారు. కార్పొరేషన్ పరిధిలో కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తూనే, మరోవైపు కొత్త పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా నియోజకవర్గంలో వేలాది కోట్లతో జరిగిన అభివృద్ధి పనులు ప్రజలకు కండ్ల ముందు కనిపిస్తున్నాయి. దీంతో గంగులకు సంపూర్ణ మద్దతు లభిస్తున్నది. అభివృద్ధితోపాటు ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు చేపడుతున్న అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు అనుహ్య స్పందన వస్తున్నది. ఈసారి తిరిగి గెలిపించేందుకు ప్రజలు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే పలు సంఘాలు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి.
కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల స్పీడ్ పెంచారు. తన తండ్రి, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుతో కలిసి ఇప్పటికే అన్ని గ్రామాల్లో పర్యటించారు. చేసిన అభివృద్ధి పనులు చెప్పడమేకాదు, భవిష్యత్‌లో తాను చేపట్టబోయే పనుల గురించి చెబుతున్నారు. యువకుడిగా, విద్యావంతుడిగా, డాక్టర్‌గా తనను గెలిపిస్తే కలిగే ప్రయోజనాలను వివరిస్తూ తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. తాజాగా (ఈ నెల 6న) మంత్రి హరీశ్‌రావు కోరుట్లలో పర్యటించి, బహిరంగ సభా వేదికగా సంజయ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. యువకుడిగా, వైద్యుడిగా మంచి పేరు తెచ్చుకున్న కల్వకుంట్ల సంజయ్‌ను గెలిపించేందుకు ప్రజలు కలిసి కదులుతున్నారు.
మంత్రి కేటీఆర్ ఈ నెల ఒకటిన రామగుండం, పెద్దపల్లి, మూడో తేదీన జగిత్యాల, ధర్మపురి, సిరిసిల్లలో.. మంత్రి హరీశ్‌రావు ఈ నెల 6న కోరుట్ల, ఇల్లంతకుంటలో నిర్వహించిన బహిరంగ సభలకు జనం నీరాజనం పలికారు. ఆయాచోట్ల నియోజకవర్గాల నుంచి స్వచ్ఛందంగా కదిలారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకపోయినా.. ఎన్నికల సభలను తలపించేలా వేలాదిగా తరలివచ్చారు. ఆయాచోట్ల ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తమ ప్రసంగాలతో ఉర్రూతలూగించారు. ఓవైపు గడిచిన పదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం, స్థానిక పరిస్థితులను వివరిస్తూనే, మరోవైపు కాంగ్రెస్, బీజేపీ హామీలు, మాయమాటలు, నమ్మితే తెలంగాణకు జరిగే నష్టాల గురించి ప్రతి సభలోనూ పూస గుచ్చినట్లు వివరిస్తూ ప్రజలను చైతన్య వంతుల్ని చేశారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న కరెంట్, తాగు, సాగునీటి కష్టాలను అర్థమయ్యేలా వివరించారు. నిజానికి ఆనాడు అధికారంలో ఉండి ఏమీ చేయని ఆ పార్టీలు, ఇప్పుడు అంధకారం కోసం తండ్లాడడమే తప్ప చేసేది ఏమీ ఉండదని ఎద్దేవా చేస్తూనే, అలాగే కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కరెంటు కష్టాలను వివరించారు. ప్రతి చోటా అమాత్యుల ప్రసంగాలను ఆసక్తిగా వినడమే కాదు, కేరింతలతో జైకొట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చిన ప్రతి సందర్భంలోనూ చేతులు పైకెత్తి మద్దతు ప్రకటించారు.
హుస్నాబాద్ నియోజకవర్గం అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఊరువాడా అన్న తేడా లేకుండా కలియ తిరుగుతున్నారు. నియోజకవర్గంలో మొదటి దఫా ప్రచారాన్ని పూర్తి చేశారు. గతంలోనూ ఒకప్పుడు కరువుకు కేరాఫ్‌గా నిలిచిన హుస్నాబాద్, ఇప్పుడు ఎలా మారిందో..? ఎలా అభివృద్ధి జరిగిందో కండ్లకు కట్టినట్లుగా ప్రజలకు వివరిస్తున్నారు. దీంతోపాటు సతీశ్‌కుమార్‌కు సబ్బండ వర్గాలు అండగా నిలుస్తూ ఆశీర్వాదాలు అందిస్తున్నాయి. మద్దతు తెలుపుతూ పలు సంఘాలు ఏకగ్రీవ తీర్మానాలు చేయగా, ఈ సారి గెలుపుఖాయమనే ధీమా వ్యక్తమవుతున్నది.
చొప్పదండి నియోజకవర్గ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన సైతం అన్ని గ్రామాలను కలియ తిరిగారు నిత్యం ప్రజల్లో ఉంటూ వారితో మమేకమవుతూనే ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో సమకూరిన సాగునీరు, తద్వారా పెరిగిన సాగు, వాటి ద్వారా రైతులు పొందుతున్న లబ్ధివంటి అంశాలను వివరిస్తూ ముందుకుసాగుతున్నారు. జరిగిన అభివృద్ధిని కండ్లారా చూస్తున్న ప్రజలు, సుంకె రవిశంకర్‌ను గెలిపించేందుకు రెడీ అయిపోయారు.
జగిత్యాల ఎమ్మెల్యే, అభ్యర్థి డాక్టర్ మాకునూరు సంజయ్‌కుమార్, ఇప్పటికే అన్ని గ్రామాల్లో కలియతిరిగారు. గ్రామాల వారీగా కుల సంఘాలతో సమావేశాలు పెడుతూ, చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూనే, మరోవైపు రాబోయే ఐదేండ్లలో తాను చేసే అభివృద్ధి గురించి చెబుతున్నారు. జగిత్యాల మాస్టర్ ప్లాన్ విషయంలో రైతుల భూములు పోకుండా చూసే విషయంలో మంత్రి కేటీఆర్ ద్వారా హామీ తీసుకోవడంలో ఆయన సక్సెస్ సాధించారు. దీంతోపాటు పెద్ద మొత్తంలో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభించడంతోపాటు సంజయ్ స్వయంగా వైద్య వృత్తి ద్వారా అందిస్తున్న సేవలు బాగా కలిసి వస్తున్నాయి. ఇటీవల జగిత్యాలలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్న సభకు జనం తండోప తండాలుగా తరలివచ్చారు. ఇక్కడ మంత్రి కేటీఆర్ ప్రతి అంశాన్ని విడమరిచి చెప్పారు. సంజయ్‌కుమార్‌ను గెలిపిస్తే భవిష్యతో ఎలా ఉంటుందన్న విషయాన్ని విప్పి చెప్పిన తీరు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నది. భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు.
మంథని నియోజకవర్గ అభ్యర్థి, ప్రస్తుత పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్పుట్ట మధు విస్తృతంగా పర్యటిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆయన పాదయాత్ర నిర్వహించారు. 11 రోజులపాటు తొమ్మిది మండలాల్లో 311 కిలోమీటర్లు నడిచారు. ఈ పాదయాత్రకు అడుగడుగునా అనుహ్య స్పందన వచ్చింది. గత ఎన్నికల్లో ఓటమి పాలైనా, ఇప్పుడు జడ్పీ చైర్మన్‌గా నియోజకవర్గ అభివృద్ధి కోసమే పాటుపడుతున్నారు. ప్రభుత్వాన్ని ఒప్పించి, పలు జీవోలు తెచ్చి ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఏమాత్రం పట్టించుకోకపోయినా, పుట్ట మధు మాత్రం తన అంకితభావాన్ని చూపుతూ వచ్చారు. ఏనాడూ అభివృద్ధి పనుల విషయంలో రాజీ పడలేదు. ప్రస్తుతం మంథని నియోజకవర్గం మొత్తం బీఆర్ఎస్ గెలుపు వైపు అడుగులు వేస్తున్నది.
సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రస్తుత అభ్యర్థి, మంత్రి కేటీఆర్ తిరుగులేని శక్తిగా ఎదిగారు. గత ఎన్నికల సమయంలో 89,009 ఓట్ల మెజార్టీతో రికార్డు సృష్టించారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఇతర పార్టీల నుంచి ఎవరూ పోటీచేసినా డిపాజిట్ దక్కితే చాలన్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. అయినా మంత్రి కేటీఆర్, తనదైన శైలిలో ప్రచారం చేస్తూనే ఉన్నారు. నిజానికి అందరికంటే ముందుగానే కేటీఆర్ తంగళ్లపల్లి సభలో తన ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఇప్పటికే చేసిన అభివృద్ధి పనులతోపాటు ఇంకా నియోజకవర్గానికి అవసరమైన అనేక అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తూ, ప్రజల మన్ననలు పొందుతున్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని కండ్లారా చూస్తున్న ప్రజలు మరోసారి కేటీఆరే రావాలని కోరుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో సంపూర్ణ ఆశీర్వాదాలు అందించేందుకు సిద్ధమయ్యారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి మనోహర్‌రెడ్డి తన దైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే గ్రామగ్రామాన తిరిగిన ఆయన, అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి సభ గ్రాండ్‌సక్సెస్ అయింది. జనం భారీగా తరలి రావడంతోపాటు సభలో మంచి స్పందన కనిపించింది. తిరిగి మిగిలిన ప్రాంతాల్లోనూ బహిరంగ సభలు పెట్టేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, ఇటీవల మంత్రి కేటీఆర్ నియోజకవర్గంపై వరాలు జల్లుకురిపించడంతో ప్రజల్లో మంచి స్పందన రాగా, బీఆర్ఎస్ను గెలిపించేందుకు ప్రజలు అడుగులు వేస్తున్నారు.
మానకొండూర్ నియోజకవర్గ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రచారంలో ముందున్నారు. పొద్దుపొడువక ముందే గ్రామాల్లో ఉండి సంక్షేమ పథకాల ఫలాలను నేరుగా ప్రజలకు అందిస్తున్న ఆయన, ఇప్పుడే కూడా అదే పంథాలో ముందుకు సాగుతున్నారు. అందరికంటే ముందుగానే శంకరపట్నం మండలంలో యువగర్జన నిర్వహించి.. ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే దాదాపు అన్ని మండలాల్లో బహిరంగ సభలు నిర్వహించారు. తాజాగా ఇల్లంతకుంట మండలంలో జరిగిన సభకు ముఖ్య అతిథిగా హరీశ్‌రావు వచ్చారు. రసమయి గురించి చెప్పిన మాటలు, అభివృద్ధిలో సాధించిన విజయాల గురించి వివరించిన తీరు ప్రజలను ఆకట్టుకోగా, మరోసారిపట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ప్రచారంలో ముందున్నారు. ప్రతి పథకం కింద ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ ఫలాలను ఆయనే నేరుగా లబ్ధిదారులకు ఇండ్లకు వెళ్లి పంపిణీ చేస్తున్నారు. ఇదే సమయంలో, ఒక ఎమ్మెల్సీగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే, భవిష్యత్‌లో హుజూరాబాద్ ఎలా అభివృద్ధి చేస్తారో..? చెబుతున్నారు. ఇక్కడ దళిత బంధు గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ లబ్ధిదారులంతా ఒక్కతాటిపై బీఆర్ఎస్ను గెలిపించడానికి సిద్ధమయ్యారు. మరోవైపు బీఆర్ఎస్ గడ్డగా ముద్రపడిన నియోజకర్గం ఈ సారి అదే బాటలో పయనించేందుకు సిద్ధమైంది.
రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి కోరుకుంటి చందర్ ప్రచారంలో జోరు పెంచారు. ఇక్కడ బీజేపీలో కీలక నేత కౌశిక్‌హరి బీఆర్ఎస్లో చేరడంతోపాటు ఇతర పార్టీల్లోని పలువురు కార్పొరేటర్లు కారెక్కడంతో పార్టీకి మంచి ఊపు వచ్చింది. దీనికితోడు సింగరేణిలో ఇండ్ల పట్టాల సమస్య పరిష్కరించడంలో చందర్ పెద్ద విజయం సాధించారు. కార్మికుల దశాబ్దాల కల నెరవేర్చి దేవుడయ్యారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు ఏకతాటిపైకి వచ్చి కోరుకంటి విజయం కోసం విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ఇక్కడ కూడా తాజాగా కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్న సభ గ్రాండ్ సక్సెస్ అయింది. అంతేకాదు, చందర్‌ను గెలుపు ద్వారా భవిష్యత్‌లో రామగుండాన్ని దత్తత తీసుకుంటానని స్వయంగా అమాత్యుడు ప్రకటించడంతో ప్రజల్లో బీఆర్ఎస్కు మరింత ఆదరణ పెరిగింది.
వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎమ్మెల్యేగా తొలిసారి ఈ నియోజవర్గం నుంచి పోటీచేస్తున్నా, ఆయన సొంత నియోజకవర్గం కావడంతో పూర్తి పట్టు ఉన్నది. అలాగే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెలే చెన్నమనేని రమేశ్‌బాబుతో కలిసి ప్రచార జోరు పెంచారు. తాను గెలిస్తే భవిష్యత్‌లో నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉంటుందో..? వివరిస్తున్నారు. ఇప్పటికే ఊరూరా రెండో దఫా ప్రచారాన్ని ప్రారంభించారు. పార్టీ శ్రేణులంతా ఒక్కతాటిపైకి వచ్చి చల్మెడ విజయం కోసం సన్నద్ధమవుతుండగా, బీఆర్ఎస్ గడ్డగా ముద్ర పడిన ఈ ప్రాంత ప్రజలు చల్మెడను గెలిపించేందుకు కలిసికట్టుగా ముందుకు కదులుతున్నారు.