చొప్పదండి, జూలై 16 : పంటలకు నాలుగు రోజుల్లోగా సాగునీరివ్వాలని, లేదంటే రైతులతో కలిసి భారీ ఎత్తున ధర్నా చేస్తామని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హెచ్చరించారు. కాలం సరిగా లేకపోతే కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఎస్సారెస్పీని నింపి సాగునీరందించే అవకాశముందని చెప్పారు. కానీ, బీఆర్ఎస్పై ఉన్న కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులకు సాగునీరు అందించేందుకు కృషి చేయాలన్నారు. స్వరాష్ట్రంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో కళకళలాడిన ప్రాజెక్టులు, చెరువులు, కాంగ్రెస్ పాలనలో మైదానాలుగా మారడంపై బుధవారం ఆయన వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కొత్తపల్లి కెనాల్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి క్రికెట్ ఆడారు. అనంతరం చొప్పదండి నియోజకవర్గంలో సాగునీటి సమస్యలపై కరీంనగర్లో కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా ఆయాచోట్ల మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ప్రాజెక్టులను నింపి ప్రతి ఎకరాకూ సాగునీరందించారని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లిచ్చే అవకాశమున్నా వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. ఓ వైపు నీరు వృథాగా పోతున్నా, పంటలు ఎండిపోతున్నా సాగునీరు అందించాలన్న సోయి లేకుండా పోయిందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు కళ్లు తెరిచి రైతులకు సాగునీరు అందించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, గడ్డం చుక్కారెడ్డి, బీఆర్ఎస్ చొప్పదండి మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మాచర్ల వినయ్ కుమార్, సదాశివరెడ్డి, కోడూరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.