కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 2: జిల్లాలోని రైతులకు సాగునీరు విడుదల చేయాలని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావును చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చేత్తులెత్తి వేడుకున్నారు. బీఆర్ఎస్పై ఉన్న అక్కసును రైతులపై చూపించవద్దని, సాగునీరందించిన తర్వాతనే మంత్రులు జిల్లాకు రావాలని కోరారు. లేదంటే వారి పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలో సాగునీరు అందక రైతులు అష్టకష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వర్షాలు ఎప్పుడు వస్తాయోనని జిల్లా ప్రజలు ఎదురుచూసే వారని.. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పాలనలో అవే పరిస్థితులు వచ్చాయన్నారు. ఓ వైపు గోదావరిలో కాళేశ్వరం వద్ద ప్రతి రోజు లక్షల క్యూసెక్కుల వరద వృథాగా పోతుందని పేర్కొన్నారు. కన్నెపల్లి పంపుహౌస్‌ల ద్వారా అన్ని విధాలుగా కాళేశ్వరం నీటి ఎత్తిపోసే అవకాశం ఉన్నా.. కాంగ్రెస్ చేతగానితనంతో రైతులకు సాగునీరు అందకుండా పోతుందని ఆవేదన చెందారు.
సాగునీరు లేక రైతులు నార్లకు బిందెలు, ట్యాంకర్లతో నీరు పోసుకుంటున్నా.. మంత్రులు, కాంగ్రెస్ నాయకులకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రైతుల పంటలు ఎండిపోయిన తర్వాత సాగునీరు అందిస్తారా? అని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల కోసమే రేషన్‌కార్డులు ఇస్తున్నారని దుయ్యబట్టారు. రైతుల పక్షాన తాము దండం పెడుతామని, అవసరమైతే కాళ్లు మొక్కుమన్నా మొక్కుతామని.. వారికి మాత్రం సాగునీరు అందించాలని వేడుకున్నారు. రైతులను గోస పెట్టకుండా.. సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, చొప్పదండి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.