ACP Madhavi | వీణవంక, అక్టోబర్ 23: పోలీస్ స్టేషన్‌లోని పలు అంశాలు, విధుల పట్ల విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని హుజురాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. పోలీసు అమరుల సంస్మరణ వారోత్సవాలల్లో భాగంగా మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో కేరళ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు పలు అంశాలపై గురువారం అవగాహన కల్పించారు.
క్రైం సీన్, బ్లూకోట్ వినియోగం, గంజాయి, మద్యం సేవించిన వారిని గుర్తించడం, వేలిముద్రల ద్వారా నేరస్థుల గుర్తింపు, డయల్ 100 వినియోగం, పలు అంశాలపై విద్యార్థులకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. బాలికలకు గుడ్‌టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించారు. విద్యార్థులు పోలీస్ వ్యవస్థ, వారి విధుల గురించి అవగాహన కలిగి ఉండాలనే ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే రౌడీషీటర్లను పిలిచి నేరాలకు దూరంగా ఉండాలని కౌన్సిలింగ్ చేసినట్లు ఈ సందర్భంగా ఏసీపీ మాధవి అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, ఏఎస్ఐ వెంకట్ రెడ్డి, పోలీసు సిబ్బంది, కేరళ ఇంగ్లీష్ మీడియం హెచ్ఎం మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.