Veernapally | వీర్నపల్లి , ఆగస్టు20: పాఠశాలల సమయానికి అనుగుణంగా బస్సులు నడపాలని వీర్నపల్లి మండల కేంద్రంలో బుధవారం విద్యార్థులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. వీర్నపల్లి-ఎల్లారెడ్డిపేట ప్రధాన రహదారిపై బైఠాయించిన విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ నాయకులు మద్దతు తెలిపారు. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నందున మరో బస్సు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
పాఠశాలల ప్రారంభం, ముగిసే సమయానికి బస్సులు రాకపోవడంతో వర్షంలో ఇబ్బందులు పడుతున్నామని మండిపడ్డారు. ఎల్లారెడ్డిపేట ఎస్ఐ రాహుల్ రెడ్డి సంఘటన స్థలానికి ఆర్టీసీ అధికారులతో ఫోన్ లో మాట్లాడించారు. సమస్య పరిష్కరిస్తామని వారు హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.