కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు అనుబంధంగా ఉన్న నర్సింగ్ పాఠశాల సమస్యలకు కేరాఫ్‌లా మారింది. నర్సింగ్ సిబ్బందికి క్వార్టర్లల కోసం కేటాయించిన ఓ పురాతన భవనంలో దీనిని నిర్వహిస్తుండగా ఇప్పటి వరకు సొంత భవనానికి కూడా నోచుకోలేదు. పైగా శిథిలావస్థకు చేరుకున్న భవనంలో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పాములు, తేళ్లు, ఇతర విష కీటకాలతో నిత్యం సావాసం చేస్తున్నారు. ర్యాంకులు సాధించడంలో, ఉద్యోగాలు పొందడంలో గొప్ప పేరున్న ఈ పాఠశాల పరిస్థితిని చూస్తే ప్రతి ఒక్కరూ చలించిపోవాల్సిందే.
కరీంనగర్ విద్యానగర్, ఆగస్టు 2 : కరీంనగర్ నర్సింగ్ పాఠశాలకు ‘పేరుగొప్ప ఊరు దిబ్బ’ అనే సామెత సరిగ్గా సరిపోతుంది. 2013లో అప్పటి ప్రభుత్వం స్థానిక ప్రభుత్వ దవాఖానకు అనుబంధంగా ఏర్పాటు చేసింది. అందులో ఇంటర్‌కు సమానంగా ఉత్తీర్ణులైన విద్యార్థులకు మెరిట్ ఆధారంగా మూడేళ్ల జీఎన్ఎం కోర్సులో చేరేందుకు అనుమతి ఉంటుంది. 42 సీట్లలో ఇద్దరు ఇన్‌సర్వీస్ సిబ్బందికి కేటాయిస్తారు. ఇలా మూడేళ్లలో 126 మంది నర్సింగ్ విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు 10 బ్యాచ్‌లకు పైగా విద్యార్థులు విద్యను అభ్యసించగా, ప్రతి సంవత్సరం వందశాతం ఉత్తీర్ణత సాధించడమే కాకుండా ఎక్కువ శాతం డిస్టింక్షన్లు తెచ్చుకుంటున్నారు.
2024లో 50 మంది విద్యార్థులు స్టాఫ్ నర్స్‌లుగా ఉద్యోగం సాధిస్తున్నారు. క్రమశిక్షణ, విలువలతో కలిగిన విద్యను బోధించడంలో ఈ పాఠశాలకు రాష్ట్రంలోనే మంచి పే రుంది. రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం, కరీంనగర్, బోధన్, నిజామాబాద్‌లో 6 నర్సింగ్ పాఠశాలలు ఉండగా, అందులో ఒక్క కరీంనగర్‌కు తప్ప మిగతా అన్నింటికీ సొంత భవనాలు ఉన్నాయి. ఇతర పాఠశాలల మాదిరిగా ల్యాబ్‌లు, స్కూల్ బస్సులు, పర్మినెంట్ టీచింగ్ స్టాఫ్, ఆఫీస్ సిబ్బందిని ఇప్పటి వరకు సమకూర్చలేదు.
కేవలం దవాఖానలో నర్సింగ్ విద్యార్థులు సేవలందిస్తున్నారనే భానవతో మొదటి నుంచి సూపరింటెండెంట్లు పాఠశాల అవసరాలను తీర్చుతున్నారు. వీరికి కావాల్సిన తరగతి గదులు, వసతి గృహం కోసం దవాఖాన ఆవరణలోనే నర్సింగ్ స్టాఫ్‌కు కేటాయించిన పాత భవనాలను కేటాయించారు. ఆ భవనాలు శిథిలావస్థకు చేరుకోగా గత ప్రభుత్వం మరమ్మతుల కోసం 20 లక్షలు ఖర్చు పెట్టింది. అయినా, భవన రూపురేఖలు యధావిధిగా ఉండి వర్షం కురిసినప్పుడల్లా పెచ్చులూడుతున్నాయి. భవనంలోని గదులు బీటలు వారుతున్నాయి. పిచ్చి మొక్కలు, చెత్తా చెదారం ఎక్కువగా ఉండడంతో రోజూ పాఠశాల ఆవరణలో పాములు, తేళ్లు, విష పురుగులు స్వైర విహారం చేస్తున్నాయి.
తరగతి గదుల పరిస్థితి ఇలా ఉంటే ఇక హాస్టల్లోనూ సమస్యలు తిష్ట వేశాయి. గదులు సరిపోక నర్సింగ్ సిబ్బందికి కేటాయించిన ఫ్యామిలీ పోర్షన్లలో కాలం వెళ్లదీస్తున్నారు. హాస్టల్లో పడుకునేందుకు సరైన బెడ్స్ లేక పోవడంతో వర్షాకాలంలో నీరు చేరి విద్యార్థులకు కంటిమీద కునుకు లేకుండా పోతున్నది. అంతే కాకుండా, హాస్టల్‌కు సంబంధించిన డ్రైనేజీ లేక పోవడంతో విద్యార్థులు వాడిన వ్యర్థపు నీరు బయటికి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. అసలు ఈ హాస్టల్‌కు డ్రైనేజీతో లింకే లేకుండా పోయింది. భవనంతో పాటు వసతి గృహం ల్యాబ్‌లు సమకూర్చలే దు.
అంతేకాకుండా పాఠశాల ప్రారంభం నుంచి పర్మినెం ట్ ట్యూటర్స్‌ను కూడా నియమించ లేదు. డిప్యూటేషన్లపైనే కాలం గడుపుతున్నారు. హాస్టల్ నుంచి క్లాసుకు వెళ్లాలన్నా, క్లినికల్స్ కోసం దవాఖానకు వెళ్లాలన్నా విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. దారి బురదమయంగా మా రింది. సరైన వసతి గృహం, తరగతి గదులు లేక విద్యార్థులు విశ్రాంతి తీసుకునేందుకు సైతం వీలు లే కుండా పోయింది. రాష్ట్రంలోనే అత్యధిక మార్కులు, ఉ ద్యోగాలు సాధిస్తున్నట్టు రికార్డుల్లోకి ఎక్కిన ఈ పాఠశాల లో ఇన్ని సమస్యలు ఉంటాయంటే ఎవరూ నమ్మలేని పరిస్థితి.
హాస్టల్ పరిసరాల్లో పూర్తిగా గడ్డి పెరగడంతో హాస్టల్ చుట్టూ రోజూ పాములు, తేళ్లు, ఇతర విష పురుగులు కనిపిస్తున్నాయి. విద్యార్థులు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. పంది కొక్కులు మట్టిని తోడడంతో కుంగిపోయి గోతులు కనిపిస్తున్నాయి. బట్టలు శుభ్రం చేసుకునేందుకు వాష్ ఏరియా కూడా లేదు. డ్రైనేజీ సరిగా లేకపోవడంతో తీవ్ర దుర్గంధం వస్తుంది. అనారోగ్యం బారిన పడుతున్నాం.
– సాయి అంజలి, నర్సింగ్ విద్యార్థిని
స్లాబ్ పెచ్చులూడుతున్నాయి. రోజూ వర్షాలు పడుతుండడంతో స్లాబ్ పైన నీరు నిల్వ ఉండి లీక్ అవుతున్నది. రూంలో ఉంటే వర్షానికి కూలుతుందేమోనని భయం వేస్తుంది. ఒకే రూంలో పది మందికి పైగా ఉండడంతో వాష్ రూంలకు ఇబ్బందిగా ఉంది. బెడ్స్ లేక కింద పడుకుంటే విష పురుగుల భయం వెంటాడుతున్నది. తరగతి గదులు, వసతి గృహం సరిగ్గా లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. వానకాలం వచ్చిందంటే పాఠశాలతో పాటు వసతి గృహం ముందు రోడ్డు బురదమయంగా మారుతుంది.
– సౌమ్య, నర్సింగ్ విద్యార్థిని
నేను ఈ మధ్యనే బాధ్యతలు స్వీకరించా. ఇక్కడ అందరం డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నాం. విద్యార్థులకు కావాల్సిన తరగతి గదులు, వసతి గృహం, బస్సు, ల్యాబ్, కార్యాలయ సిబ్బంది వంటి కనీస అవసరాల కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్లా. ఇప్పటికే దవాఖాన సూపరింటెండెంట్ డిప్యుటేషన్‌పై సిబ్బందిని కేటాయించారు. వసతి గృహం కోసం 25 బెడ్స్ ఇచ్చారు. సూపరింటెండెంట్ పరిధిలో ఉన్న సౌకర్యాలను ఎప్పటికప్పుడు కల్పిస్తున్నారు. ఏ అవసరం ఉన్నా మాతో సమన్వయం చేస్తూ సహకరిస్తున్నారు.
– ప్రభావతి, నర్సింగ్ పాఠశాల ప్రిన్సిపాల్
నర్సింగ్ పాఠశాలల్లో చాలా సమస్యలు ఉన్నాయని నా దృష్టికి వచ్చింది. డైట్ విషయంలో కాంట్రాక్టర్‌ను పిలిపించి మాట్లాడాం. విద్యార్థులకు పూర్తి స్థాయిలో మెనూతో నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశాలు జారీ చేశాం. పాఠశాలలో ట్యూటర్స్, సిబ్బంది కొరత ఉందని తెలుపగానే వెంటనే డిప్యూట్ చేశా. వసతి గృహంలో బెడ్స్ లేకపోవడంతో ప్రస్తుతం 25 బెడ్లను సమకూర్చాం. రూంలు మరమ్మతులు అయ్యాక పూర్తిస్థాయిలో పంపిస్తా. మౌలిక వసతులను పూర్తి స్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకుంటాం. నర్సింగ్ పాఠశాల వసతి గృహంలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని ఇప్పటికే ప్లంబింగ్, ఎలక్ట్రిసిటీ, శాసానిటేషన్ సిబ్బందిని ఆదేశించా.
-డాక్టర్ గుండా వీరారెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్