విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, పాఠశాల విద్యను విస్మరిస్తున్నది. నిధులు ఇవ్వకుండా చిన్నచూపు చూస్తున్నది. కేసీఆర్ పాలనలో పాఠశాలల నిర్వహణ పద్దు ఏటా రెండు విడుతలుగా మంజూరు కాగా, కాంగ్రెస్ పాలనలో వాటికి బ్రేక్‌పడింది. ఈ విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచినా దిక్కే లేకుండా పోగా, ఫలితంగా స్కూళ్ల మెయింటనెన్స్ అధ్వానంగా మారింది.
రికార్డులు,రిజిస్టర్ల కొనుగోలు, బ్లాక్ బోర్డుల ఏర్పాటు, ప్రయోగశాలలకు అవసరమైన సామగ్రి సేకరణతోపాటు సామూహిక కార్యక్రమాల నిర్వహణ కష్టమైపోగా, సంబంధిత ఖర్చులు హెచ్ఎంలు, టీచర్లే భరించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇప్పటికైనా స్పందించి స్కూల్ గ్రాంట్స్‌ను పంద్రాగస్టువరకైనా ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తున్నది.
జగిత్యాల, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిర్వహణ నిధులను పాఠశాలలకు ప్రభుత్వం కొన్నేళ్లుగా కేటాయిస్తూ వస్తున్నది. 1 నుంచి 30 మంది విద్యార్థులున్న స్కూళ్లకు 10వేలు, 30 నుంచి 100 మంది ఉంటే 25వేలు, 101 నుంచి 250 వరకు ఉంటే 50వేలు, 250 నుంచి వెయ్యి వరకు ఉంటే 75వేలు మంజూరు చేస్తారు. వెయ్యి మందికిపైనే ఉంటే ఆ పాఠశాల నిర్వహణకు లక్ష కేటాయిస్తారు. ఏటా రెండు దఫాల్లో మంజూరు చేస్తారు.
ఈ నిధులతోనే స్కూల్లో బ్లాక్ బోర్డుల ఏర్పాటు, పెయింటింగ్, టీచర్ల హాజరు రిజిస్టర్ల కొనుగోలు, వార్షిక ప్రణాళిక, టీచింగ్ డైరీ, మంచినీటి సౌకర్యం, ప్రయోగశాలలకు అవసరమైన సామగ్రి, పరీక్షల ప్రణాళిక ప్రశ్నప్రతాలు, జవాబు పత్రాల కొనుగోలు, పాఠశాలల్లో సామూహిక కార్యక్రమాలు, క్రీడలకు సున్నం, ఫస్ట్ అయిడ్ బాక్స్, స్వతంత్ర, గణతంత్ర దినోత్సవాలు, రాష్ట్ర అవతరణ దినోత్సవ నిర్వహణ తదితర కార్యక్రమాలకు హెచ్ఎంలు వినియోగిస్తారు. అలాగే పాఠశాలలకు సంబంధించిన విద్యుత్ బిల్లులు సైతం వీటి నుంచే చెల్లిస్తూ వస్తున్నారు.
నిర్వహణ నిధులను విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికే విద్యాశాఖ మంజూరు చేయాల్సి ఉంటుంది. జూన్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవంతో పాటు బడిబాట కార్యక్రమాలను హెచ్ఎంలు చేపట్టాల్సి వస్తున్నది. అయితే ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు పూర్తయి, అడ్మిషన్ల ప్రక్రియ కూడా ముగింపు దశకు వచ్చింది. ఇప్పటికే చాలా సిలబస్‌తో పాటు రెండు యూనిట్ టెస్ట్‌లను సైతం నిర్వహించారు. అయినా ఇంత వరకు స్కూల్గ్రాంట్ల కింద నిధులు మంజూరు చేయకపోవడంతో హెచ్ఎంలు ఇబ్బందులు పడుతున్నారు. గత విద్యా సంవత్సరం ప్రారంభంలో జూన్‌లోనే స్కూల్ గ్రాంట్స్‌ను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
ఆ తర్వాత రెండో దశ డిసెంబర్లో ఇవ్వాల్సి ఉండగా ఎన్నికల నేపథ్యంలో ఆలస్యమైంది. విద్యా సంవత్సరం ముగింపు దశకు వచ్చిన సమయంలో అంటే మార్చిలో విడుదల చేసి, వాటిని ఆగమేఘాల మీద ఖర్చు చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో హెచ్ఎంలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు నిధులు ఇవ్వకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేషనరీ కొనుగోలు చేయడం, బడిబాట లాంటి ఖర్చులు భరించడం, చాక్ పీసులు, డస్టర్ల కొనుగోలు సైతం ఇబ్బందికరంగానే ఉందంటున్నారు. విధిలేని పరిస్థితిలో ఉపాధ్యాయులే సొంతంగా జేబులో నుంచి డబ్బులు వేసుకొని నిర్వహించాల్సిన పరిస్థితి వస్తున్నదని చెబుతున్నారు. అందరు ఉపాధ్యాయుల వ్యక్తిత్వం ఒకేలా ఉండదని, కొన్నిసార్లు టీచర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారని, విసుక్కుంటున్నారని హెచ్ఎంలు బాధపడుతున్నారు.
చదువులు, పాఠశాలల నిర్వహణకే కాదు గత ప్రభుత్వం ప్రతి పాఠశాలలోను క్రీడలను ప్రోత్సహించేందుకు నిధులు కేటాయిస్తూ వచ్చింది. ప్రాథమిక పాఠశాలకు 10వేలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు 10వేల చొప్పున ప్రతి విద్యా సంవత్సరం ఆరంభంలోనే కేటాయిస్తూ వచ్చింది. 2013లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యాహక్కు చట్టం నేపథ్యంలో 8వ తరగతి వరకు విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేయడం నిలిపివేశారు. కేవలం 9,10వ తరగతి విద్యార్థుల నుంచి తలా ఒక్కరూపాయి ఆటల ఫీజును వసూలు చేశారు. దీంతో చాలా ఏండ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆటలు అటకెక్కాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ దాదాపు మూతపడింది.
అయితే గత ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు క్రీడలు అత్యంత ముఖ్యమైనవిగా భావించి, క్రీడా సామగ్రి కొనుగోలుకు నిధులు కేటాయించడంతో పాటు, ప్రతి ఏడాది నిర్వహణ కోసం 5 నుంచి 10వేలను కేటాయించింది. అయితే ఈ విద్యా సంవత్సరంలో ఇంత వరకు క్రీడలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం మంజూరు చేయలేదు. చేస్తుందా..? లేదా..? అన్న విషయంపై స్పష్టత లేదంటున్నారు ఉపాధ్యాయులు. ఆగస్టులో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు మండల, డివిజన్, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించాల్సి ఉంది. అయితే ఇంత వరకు నిధులే లేకపోవడంతో క్రీడోపాధ్యాయులు, పిల్లలను ఆటలకు ఇంత వరకు కనీసం సన్నద్ధం చేయించలేకపోయారు.
స్కూల్ గ్రాంట్స్ మంజూరులో ఆలస్యం, జాడలేని క్రీడా నిధులతో పాటు ఇతర సమస్యలపై మాట్లాడేందుకు హెచ్ఎంలు, టీచర్లు భయపడుతున్నారు. నిధులు మంజూరు అయ్యాయా..? లేదా..? అన్న వివరాలు చెప్పేందుకు తర్జనభర్జన పడుతూ, ‘మేము చెప్పలేం సార్. మా పేరు రాయకండి సార్. రాస్తే మాకు ఇబ్బందులు వస్తాయి సార్’ అంటూ తప్పించుకుంటున్నారు.
స్కూల్ గ్రాంట్స్‌తోపాటు ఇతర సమస్యలున్నాయని, విద్యుత్ బిల్లులు మాఫీ చేస్తామంటున్నారని అవి అవుతాయా..? కావా..? అర్థం కావడం లేదని, ఇప్పటి నుంచి మాఫీ చేస్తారా..? గతం లో ఉన్న బకాయిలు సైతం మాఫీ అవుతా యా..? తెలియడం లేదని అంటున్నారు. ఒక్కొక్క పాఠశాలకు 30వేల నుంచి 40 వేల విద్యుత్ బకాయి ఉందని, వాటిపై సైతం స్పష్టత రావాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఏ విషయం గురించైనా అభిప్రాయాలు చెబితే, స్కూల్ ఫొటోలు ఆ పత్రికల్లో ప్రచురితమైతే సంబంధిత స్కూల్ ఉపాధ్యాయులకు ఇబ్బందులు వస్తున్నాయని, తమను వదిలిపెట్టాలని వారు చెబుతున్నారు.