Karthika Deepotsavam | సారంగాపూర్, నవంబర్ 5: సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లోని ఆయా ఆలయల్లో కార్తీక పూర్ణిమా సందర్భంగా బుధవారం ఆలయల్లో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంబట్ల శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయం, రేచపల్లి శ్రీ జగన్నాథ స్వామి ఆలయం, సారంగాపూర్ సీతారామచంద్ర స్వామి ఆలయం, బీర్పూర్ మండలంలోని శ్రీలక్ష్మినర్సింహ స్వామి ఆలయం హనుమాన్ ఆలయం, తుంగూర్ గ్రామంలోని వేణు గోపాల స్వామి, కొల్వాయి రామాలయం తదితర ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలను వెలిగించారు.
శ్రీదుబ్బ రాజేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి ఆలయల్లో రాత్రి వైభవంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆయా ఆలయ ఆవరణలో లింగాకారంలో ఏర్పాటు చేసిన దీపాలను వెలిగించి దీపోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీక మాసం విశిష్టత, తదితర వివరాలను అర్చకులు భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయ అధికారులు, కమిటి సభ్యులు, ఆర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.