హనుమకొండ చౌరస్తా : చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో కార్తిక పౌర్ణమి ( Karthika Pournami ) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవరం లక్ష వత్తులతో లక్ష దీపోత్సవం నిర్వహించారు.
తెల్లవారుజాము నుంచి రుద్రేశ్వరస్వామికి మంగళవాయిద్యసేవ, ఉత్తిష్టగణపతికి హరిద్రాకుంకుమా విలేపన అభిషేకం, రుద్రేవ్వరస్వామికి అఘోరపశుపత ఏకాదశ రుద్రాభిషేకం, 108 లీటర్ల పుట్టతేనేతో మధుక్షీరాభిషేకం, వేయ్యిమంది భక్తులకు, నమక, చమకాదులతో, రుద్ర అధ్యయములతో సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు.

సుమారు 30వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. నాగపుట్టల వద్ద ఉసిరిక, తులసీ, మారేడు, వృక్షాల కింద మహిళలు ముగ్గులు వేసి తమ కోరికలు నెరవేర్చాలని దీపాలు వెలిగించారు.
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అందించిన ఉచిత మట్టి ప్రమిదలు, వత్తులు, నువ్వుల నూనెతో లక్ష దీపోత్సవాన్ని నిర్వహించారు. నగరపాలక సంస్థ మేయర్ గుండు సుధారాణి( Mayor Sudharani) , ఆర్యవైశ్య మహాసభ నాయకులు గట్టు మహేష్‌బాబు, కొమ్మ పూజ నిర్వహించి లక్ష దీపోత్సవాన్ని ప్రారంభించారు. ‘
స్వామివారిని దర్శించుకున్నవారిలో హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, మాజీ జడ్పీ ఛైర్మన్ సాంబారి సమ్మారావు, హనుమకొండ, వరంగల్ ప్రధాన కోర్టు జడ్జీలు, సీఎంఆర్ జనరల్ మేనేజర్ కృష్ణమూర్తి, ప్రముఖ ఇంజినీర్ రమేశ్, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనివాస్ గుప్తా, హనుమకొండ సీఐ మచ్చ శివకుమార్ స్వామివారిని దర్శించుకని అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి అనిల్‌కుమార్ వేడుకలను పర్యవేక్షించారు.