Godavarikhani | కోల్ సిటీ, జనవరి 18 : రామగుండం నగర పాలక సంస్థ 2026 నూతన పాలకవర్గానికి త్వరలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో గోదావరిఖనికి చెందిన ఓ విద్యార్థి యువజన నాయకుడు కారెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పారిశ్రామిక ప్రాంతంలో సామాజిక కార్యకర్తగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతూనే ప్రత్యక్షంగా ప్రజా సమస్యలపై అధికార యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్న సదరు వ్యక్తి త్వరలోనే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ సమక్షంలో ఆ పార్టీలో చేరాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఈ విషయమై స్థానిక ముఖ్య నాయకుల దృష్టికి కూడా తీసుకవెళ్లినట్లు తెలుస్తోంది. విద్యార్థి సంఘం నుంచి వామపక్ష భావజాలం కలిగిన సదరు యువజన నాయకుడు గతంలో విద్యార్థి ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించాడు. ఆ తర్వాత రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు రాజీలేని పోరాటాలకు కేంద్ర బిందువుగా ఉన్నాడు. చాలా కాలంగా సామాజిక కార్యకర్తగా రామగుండం నగర పాలక సంస్థలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించడమే గాక ఎన్నో పోరాటాలు చేయడంతోపాటు కార్మికుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్లి పరిష్కరించడంలో చొరవ చూపుతున్నాడు.
సింగరేణి ప్రభావిత ప్రాంతమైన సైవింక్లయిన్ ఏరియాలో ప్రజా సమస్యలను ఎండగడుతున్నాడు. సంఘటిత, అసంఘటిత కార్మికులకు అండగా ఉంటూ ప్రజాక్షేత్రంలో తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నాడు. దళిత సామాజిక వర్గానికి చెందిన సదరు యువజన నాయకుడు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలో కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు పర్యాయాలు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సామాజిక కార్యకర్తగా ఎప్పటికప్పుడు తన గళం వినిపించడమే గాక ఇటీవల పారిశ్రామిక ప్రాంతంలో అర్ధరాత్రి 46 దారి మైసమ్మ గుళ్లను కూల్చివేసిన సంఘటనకు కారకులైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తానోక్కడే రాష్ట్ర హైకోర్టులో కేసు వేసి పోరాడుతున్నాడు. గతంలోనూ రామగుండం కార్పొరేషన్లో పలు అవినీతి అక్రమాలపై సీడీఎంఏ, విజిలెన్స్ కు ఫిర్యాదులు చేసి రాజీపడకుండా పోరాడేవాడు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిశ్చయించుకున్నట్లు వినికిడి.