Dharmaram | ధర్మారం, జూన్ 7: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామానికి చెందిన మేకల సౌమ్య అనే విద్యార్థిని బాసరలో ట్రిపుల్ ఐటీ లో సీటు సాధించగా ఆమెను గ్రామ సర్పంచ్ మోతే కనకయ్య ఆధ్వర్యంలో సన్మానించారు. ధర్మారం మోడల్ స్కూల్ లో 2025- 26 విద్యా సంవత్సరంలో టెన్త్ చదివిన సౌమ్య 600 మార్కుల గాను 562 మార్కులు సాధించింది. సదరు విద్యార్థికి ట్రిపుల్ ఐటీ లో సీటు వచ్చింది. దీంతో ఆదివారం విద్యార్థిని సౌమ్యను ఆ గ్రామంలో సర్పంచ్ మోతె కనకయ్య ఆధ్వర్యంలో స్థానికుడు మోతె వెంకటేష్, వార్డు సభ్యులు తోడేటి సాగర్ శాలువాతో సన్మానం చేసి అభినందించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కనకయ్య మాట్లాడుతూ విద్యార్థిని సౌమ్య ప్రాథమిక విద్యాభ్యాసాన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, ఉన్నత విద్యను ధర్మారం మోడల్ స్కూల్లో చదివి టెన్త్ లో 562 మార్కులు సాధించడం హర్షనీయమని అన్నారు. సౌమ్య తండ్రి ఉపాధి కోసం గల్ఫ్ దేశంలో ఉండటం, తల్లి గ్రామంలో కూలీగా పనిచేస్తుందని వారి శ్రమను గుర్తించి రేయింబవళ్ళు కష్టపడి చదివి బాసర ట్రిపుల్ ఐటీ లో సీటు సాధించడం ఆనందదాయకంగా ఉందని ఆయన కొనియాడారు. విద్యార్థిని సౌమ్య స్ఫూర్తితో గ్రామంలోని మిగతా విద్యార్థులు టెన్త్ లో టాప్ మార్కులు సాధించి బాసరలో సీటు సాధించేందుకు ప్రయత్నించాలని సర్పంచ్ కనకయ్య సూచించారు.