Chigurumamidi | చిగురుమామిడి, ఏప్రిల్ 24 : జస్టిస్ గోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పుతోనైనా సీఎం, కాంగ్రెస్ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని, అభివృద్ధి దిశగా దృష్టి సారించాలని, ఇప్పటికైనా దుష్ర్పచారాన్ని ఆపాలని బీఆర్ఎస్ చిగురుమామిడి మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల నాయకులు ఎండీ సర్వర్ పాషా, బోయిని శ్రీనివాస్ తో కలిసి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. 80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలో లేకుండా చేయాలనే కుట్రలను హైకోర్టు తీర్పు పటాపంచలు చేసిందన్నారు. కేసీఆర్, హరీష్ రావుపై బురదజల్లే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీరు విడుదల చేయకుండా రైతుల పంటలు ఎండబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను తుంగలో తొక్కిన ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తామని మాయమాటలు చెప్పి ఇప్పుడు కార్మికులను రోడ్డున పడేసిందని మండిపడ్డారు.
శంకర్ గౌడ్ మృతికి బీఆర్ఎస్ నాయకులు నివాళి..
ఆర్టీసీ సమ్మెలో సమస్యల పరిష్కరించాలని గురువారం ఆత్మహత్యాయత్నం చేసిన నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమన్నారు. మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద శంకర్ గౌడ్ చిత్రపటానికి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, మండల నాయకులు ఎండీ సర్వర్ పాషా, బోయిని శ్రీనివాస్, ఆర్టీసీ సిబ్బంది పన్యాల రాజిరెడ్డి, బుర్ర సమ్మయ్య, బోయిని అంజయ్య, పలు పార్టీల నాయకులు లంబాడి పల్లి తిరుపతి, పెసరి మొగిలి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.