కలెక్టరేట్, డిసెంబర్ 26 : స్వయం ఉపాధి పథకాల ద్వారా మైనార్టీ యువత ఆర్థికంగా ఎదిగేలా చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు పంపిణీ చేసేందుకు కార్యాచరణ రూపొందించి, ఇందుకనుగుణంగా జిల్లాల వారీగా యూనిట్ల కేటాయింపు చేసింది. ఔత్సాహిక యువత దరఖాస్తులు చేసుకునేందుకు జనవరి 5 వరకు గడువు విధించింది. జిల్లాకు 50 యూనిట్లు కేటాయించగా, రెండు కేటగిరీల్లో రుణాలు మంజూరు చేసేందుకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు ప్రణాళిక కూడా సిద్ధం చేశారు.
మొదటి కేటగిరీలో రూ.లక్ష రుణం అందించనుండగా 80 శాతం సబ్సిడీ, రెండో కేటగిరీలో రూ.2 లక్షల వరకు రుణం మంజూరు చేయనుండగా, 70శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మిగతా మొత్తం బ్యాంకుల ద్వారా రుణంగా ఇప్పించనున్నారు. లబ్ధిదారులను ఎంపిక చేసిన అనంతరం ఎంచుకున్న యూనిట్‌కు అవసరమైన మొత్తాన్ని ప్రభుత్వం బ్యాంకులో జమచేయనుంది. లబ్ధిదారుడికి తాను ఎంపిక చేసుకున్న యూనిట్ అందిన అనంతరం బ్యాంకు నుంచి నేరుగా సంబంధిత యూనిట్ తయారీ సంస్థకు డబ్బులు అందజేయనున్నట్లు ఎంఎఫ్సీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
తెల్లరేషన్ కార్డు ఉండి, ఏడాదికి 2 లక్షల లోపు ఆదాయం మాత్రమే ఉండి, 22 నుంచి 55 ఏళ్ల లోపు ఉన్న ముస్లిం, సిక్కు, పార్శీ, జైన, బౌద్ధ మతానికి చెందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ శాఖ జిల్లా అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను tsobmms.cgg.gov.in, tsmfc.in అనే వెబ్సైట్లో పంపించాల్సి ఉంటుందన్నారు. రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ సోషల్ మీడియాలో కూడా ఆయా మతాలకు చెందిన వారు విస్తృత ప్రచారం చేస్తుండగా, యువతీ,యువకులు ఇంటర్నెట్ సెంటర్ల ఎదుట బారులు తీరుతున్నారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.