Koppula Eshwar | ధర్మారం, మే 24 : రాష్ట్ర ప్రభుత్వం ఈ యాసంగి సీజన్లో రైతులు పండించిన వరి, మక్క ఇతర ధాన్యం కొనుగోలులో పూర్తిగా విఫలమైందని రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని కరీంనగర్-రాయపట్నం రహదారిపై ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై నిరసిస్తూ రైతులకు మద్దతు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. వరి ధాన్యం రోడ్డుమీద పోసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోయాయి. ఈ ఆందోళన కార్యక్రమానికి హాజరైన ఈశ్వర్ మాట్లాడుతూ గతంలో మాజీ సీఎం కేసీఆర్ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేశామని ఆయన గుర్తు చేశారు. తాను సైతం ధర్మపురి నియోజకవర్గంలో తిరిగి కొనుగోలు కేంద్రాలలో పర్యటించి రైతులకు వారికి అన్ని విధాలుగా అండగా నిలబడి ధాన్యం కొనుగోలు చేయించామని అన్నారు. కానీ ఈ సారి మాత్రం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో పూర్తిగా విఫలమైనట్లు ఆయన ధ్వజమెత్తారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 15 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి కాగా ఇప్పటివరకు సగం ధాన్యం కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. జగిత్యాల జిల్లాకు ఇన్చార్జిగా ఉన్న మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో పూర్తిగా వైఫల్యం చెందినట్లు ఈశ్వర్ ఆరోపించారు. క్వింటాల్ ధాన్యం తూకంలో 7-8 కిలోల తరుగు తీయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆయన ఆరోపించారు. ఒక్కో లారీ లోడ్ కు రైతులు సుమారు రూ. 8 వేలు నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు. గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతీ చిన్నదానికి రైతులను పక్కదారి పట్టించి లక్ష్మణ్ కుమార్ ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ధాన్యం కటింగ్ వచ్చిన సొమ్ము ఏమవుతుందని ఆ రోజు లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారని అదే ఇప్పుడు కటింగ్ అవుతున్న సొమ్ము లక్ష్మణ్ కుమార్ జేబులోకి వెళుతుందా.. అని ఈశ్వర్ ప్రశ్నించారు.
రైతులకు జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో తీవ్రమైన జాప్యం జరిగి రైతులకు నష్టం వాటిలోతున్నది వాస్తవమే కానీ జగిత్యాల జిల్లాలో మాత్రం కటింగ్ పేరా విపరీతమైన దోపిడీ జరుగుతుందని ఆ విషయం కొనుగోలు కేంద్రాలకు లక్ష్మణ్ కుమార్ వచ్చి పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని ఆయన వివరించారు. ఇంట్లో ఉండి అంతా బాగానే ఉందని ప్రకటించే లక్ష్మణ్ కుమార్ కు దాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి అవగాహన లేదని ఆయన ఎద్దేవా చేశారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు జరుగుతున్న విషయాన్ని తాను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని కేంద్రాలకు వచ్చే దమ్ము ధైర్యం లక్ష్మణ్ కుమార్ కు ఉందా అని ఈశ్వర్ సవాల్ విసిరారు. మాటిమాటికి ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుడిలో తడి బట్టలతో స్నానం చేస్తానని ప్రకటించే లక్ష్మణ్ కుమార్ ఒక్కసారి కొనుగోలు కేంద్రాలకు వచ్చి రైతులకు జరుగుతున్న నష్టం తెలుసుకోవాలని ఆయన సూచించారు. కేవలం కాన్వాయ్ ముందు నాలుగు కార్లు, వెనుక నాలుగు కార్లతో లక్ష్మణ్ కుమార్ ఒకవైపు, అతడిని అనుసరిస్తున్న కార్యకర్తలు మాత్రమే ఆనందంగా ఉన్నారని, రైతులు మాత్రం ఆనందంగా లేరని ఆయన పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చేయని వాగ్దానం లేదని, ఆడని అబద్ధం లేదని అబద్దానికి కేరాఫ్ లక్ష్మణ్ కుమార్ అని ఈశ్వర్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో సెటిల్మెంట్లు చేయడం ముఖ్యం కాదని ఇక్కడే రైతుల కష్టాలు తీర్చడంలో శ్రద్ధ వహించాలని ఆయన లక్ష్మణ్ కుమార్ కు హితవు పలికారు. వర్షాలు వస్తే కేంద్రాలలో కొనుగోలు చేయకుండా ఉన్న ధాన్యం తడిసి రైతులకు తీవ్ర నష్టం వాటి అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు . ఇప్పటికే ఎంతోమంది రైతులు దాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ధాన్యాన్ని ఆగ్రహంతో కాల్చి వేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలలో రైతులు తెచ్చిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేసి చిత్తశుద్ధిని చాటాలని లేనిపక్షంలో రైతుల పక్షాన ఉండి ధాన్యం కొనుగోలు చేసేదాకా పోరాటం చేస్తామని ఈశ్వర్ స్పష్టం చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరైన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సూచించారు. గ్రామాలలో ఏమి అభివృద్ధి చేశావని నీ కార్యకర్తలతో రీల్స్ చేయిస్తున్నవని ఆయన ప్రశ్నించారు. గ్రామాలలో చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతో ప్రజల మధ్య నుంచి లక్ష్మణ్ కుమార్ తప్పించుకొని తిరుగుతున్నాడని ఈశ్వర్ ఆరోపించారు. ఇకనైనా లక్ష్మణ్ కుమార్ అబద్ధపు మాటలు మాయ మాటలు చెప్పడం మానుకోవాలని ఈశ్వర్ హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, వైస్ చైర్మన్ సామంతుల రాజమల్లయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్లు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, గుర్రం మోహన్ రెడ్డి, పార్టీ తాజా మాజీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, వివిధ గ్రామాల సర్పంచులు మోతే కనకయ్య, మంద శ్రీనివాస్, ధర్మారం మాజీ ఉపసర్పంచ్ ఆవుల లత, పార్టీ నాయకులు పూస్కురు రామారావు, పాకాల రాజయ్య, తుమ్మల రాంబాబు, మిట్ట తిరుపతి, నాడెం శ్రీనివాస్, నేరెళ్ల చిన్న లచ్చయ్య, కూరపాటి శ్రీనివాస్, ఎగ్గేల స్వామి, దొనికేని తిరుపతి, ఆవుల శ్రీనివాస్, ఆవుల వేణు, రెడపాక శ్రీనివాస్, దేవి రాజేందర్, ఆవుల సత్యం, బద్దం రవీందర్ రెడ్డి, దేవి రాజారాం, గంధం తిరుపతి, నార ప్రేమ్ సాగర్, సంకసాని సతీష్ రెడ్డి ,గుజ్జేటి కనకలక్ష్మి, దేవి రేణుక ,మార్క సంధ్య , సంధినేని కొమురయ్య, జనగామ అంజయ్య, పంజాల శ్రీనివాస్, బొడ్డు రాములు, సత్తయ్య, ఎండి రహీం, బొడ్డు రమేష్, బొలిశెట్టి సుధాకర్, బరుపటి చిలుకయ్య, గాండ్ల నరసయ్య, బండి సురేష్, పల్లె అభిలాష్
తదితరులు పాల్గొన్నారు.