‘ఎత్తిపోయరు.. ఎగువన నింపరు’ అన్నట్టున్నది కాంగ్రెస్ సర్కారు తీరు! ‘చెర్ల నీళ్లు చెరువెనుకాల పడ్డట్టు’ ఇప్పుడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాలను సముద్రంపాలు చేయడం అలాగే ఉన్నది. అల్పపీడన ప్రభావంతో వచ్చిన వర్షపు నీటిని ఒడిసి పట్టి ప్రాజెక్టులను నింపుకునే అవకాశమున్నా.. ఏమాత్రం ఆలోచన లేకుండా వదిలేయడం ప్రభుత్వ ప్రణాళికాలోపానికి అద్దం పడుతున్నది. నిజానికి వర్షాలు వెనక్కి తగ్గి ఎస్సారెస్పీకి ఇన్‌ఫ్లో తగ్గితే.. పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారే ప్రమాదమున్నది.
నీటిని ఒడిసి పట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత కరువైంది. అల్పపీడన ప్రభావంతో పడుతున్న వర్షపు నీటిని రాష్ట ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎత్తిపోసుకోవడంలో ప్రణాళికాలోపం కనిపిస్తున్నది. దీనికి నిలువెత్తు నిదర్శనమే మధ్యమానేరు-అన్నపూర్ణ జలాశయం నుంచి కొండపోచమ్మ సాగర్‌కు అంతంతే కొనసాగుతున్న ఎత్తిపోతలు! ఓ వైపు రోజుకు దాదాపు 25 టీఎంసీలకు పైగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీరు సముద్రం పాలవుతున్నా.. దిగువన ప్రాజెక్టులను నింపడంలోనూ.. అలాగే కొండపోచమ్మసాగర్ వరకు ఎత్తిపోయడంలోనూ ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడుతున్నది. ఒకవేళ శ్రీరాంసాగర్‌కు ఇన్‌ఫ్లో ఆగితే.. ప్రభుత్వం అలసత్వం వల్ల ఎత్తిపోతలు లేక రెంటికీ చెడ్డ రేవడిలా పరిస్థితి మారుతుంది.
కరీంనగర్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నాలుగైదు రోజుల క్రితం వరకు గోదావరికి ఎగువన వర్షాలు లేకపోవడం.. తద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు అంచనాలకు అనుగుణంగా వరద రాకపోవడంతో కాళేశ్వరం జలాలను కొండపోచమ్మ సాగర్‌కు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోసిన విషయం తెలిసిందే. ఎల్లంపల్లి-మధ్యమానేరు-అన్నపూర్ణ రిజర్వాయర్-రంగనాయకసాగర్ ద్వారా పైన ఉన్న మల్లన్నసాగర్, కొండపోమ్మసాగర్ ప్రాజెక్టులకు కొద్ది రోజులుగా ఎత్తిపోస్తున్నారు.
ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడనం వల్ల గోదావరికి భారీ వరద రావడంతో తద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. శ్రీరాంసాగర్‌లో సిల్ట్ పేరుకుపోయిన తర్వాత ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, మంగళవారం సాయంత్రం ఆరు గంటలవరకు 70 టీఎంసీల నీరున్నది. కాగా 2,42,616 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 41 గేట్లు ఎత్తి 2,59,928 క్యూసెక్కులను గోదావరిలోకి వదిలిపెడుతున్నారు. నిజానికి ఎస్సారెస్పీ దిగువన ఉన్న శ్రీరాజరాజేశ్వర జలాశయం (మధ్యమానేరు) పూర్తి సామర్థ్యం 27.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 21 టీంఎసీల నీరు మాత్రమే ఉంది.
ఎస్సారెస్పీ నుంచి గడిచిన 24 గంటలుగా వరదకాలువ ద్వారా 12 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 7 టీఎంసీల నీరు అవసరమున్నది. అలాగే, మధ్యమానేరు దిగువన ఉన్న ఎల్ఎండీ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా, అందులో 16 టీఎంసీలు మాత్రమే ఉన్నది. ఈ ప్రాజెక్టు నిండాలంటే.. దాదాపు ఇంకా 8 టీఎంసీలు కావాలి. దీంతోపాటు మధ్యమానేరు నుంచి మూడు టీఎంసీల సామర్థ్యమున్న మల్కాపూర్ రిజర్వాయర్‌కు నీరు ఎత్తిపోసి అక్కడి నుంచి చెరువులను నింపొచ్చు.
నిజానికి ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీరు సముద్రం పాలవుతున్నది. ఈ విషయంలో ప్రభుత్వ ప్రణాళికాలోపం స్పష్టంగా కనిపిస్తున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ముందుగా మధ్యమానేరుకు వరదకాలువ ద్వారా ఇవ్వొచ్చు. వరదకాలువ నుంచి 22 వేల క్యూసెక్కుల నీటిని మధ్యమానేరుకు విడుదల చేసే అవకాశం ఉన్నా ప్రస్తుతం 12 వేలకు మించి ఇవ్వడం లేదు. ఇదిలా ఉంటే వచ్చిన నీటిని వచ్చినట్టుగా మధ్యమానేరు నుంచి అన్నపూర్ణకు అక్కడి నుంచి రంగనాయకసాగర్- మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌కు ఎత్తిపోసుకోవచ్చు.
పుష్కలమైన నీరు న్నా.. ఎత్తిపోతల్లో మాత్రం ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది. నిజానికి అన్నపూర్ణ రిజర్వాయర్ వద్ద 4 పంపులున్నాయి. ఒక్కో పంపు నుంచి 3200 క్యూసెక్కులు ఎత్తిపోవచ్చు. అంటే నాలుగు పంపుల ద్వారా 12,800 క్యూసెక్యుల నీటిని ఎత్తిపోసే అవకాశమున్నది. కానీ, కొద్దిరోజులుగా అన్నపూర్ణ జలాశయం వద్ద కేవలం రెండు పంపులు మాత్రమే నడుపుతూ 6,200 క్యూసెక్కులను మాత్రమే ఎత్తిపోస్తున్నారు. ఇదే పద్ధతి రంగనాయకసాగర్ వద్ద కొనసాగుతున్నది. నీరు ఉన్నప్పుడు ఎక్కువ మోటర్లు నడిపి తద్వారా ఎక్కువ నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఈ దిశగా దృష్టిపెట్టడం లేదు. ఇలాగైతే మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ నిండేదెలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
మల్లన్నసాగర్ పూర్తి సామర్థ్యం 50 టీంఎసీలు కాగా ప్రస్తుతం 11.65 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గడిచిన వారం రోజుల్లో రంగనాయకసాగర్ నుంచి కేవలం 3.05 టీఎంసీలను మాత్రమే మల్లన్నసాగర్‌కు ఎత్తిపోశారు. ఈ లెక్కన ప్రస్తుత పరిస్థితి అంటే.. దాదాపు 39 టీఎంసీల నీరు ఈ ప్రాజెక్టు నిండేందుకే కావాలి. అలాగే, కొండపోచమ్మసాగర్ పూర్తిసామర్థ్యం 15 టీఎంసీలు కాగా, కొద్దిరోజులుగా ఈ ప్రాజెక్టుకు కేవలం 1.5 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోశారు. నిజానికి మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టులను పూర్థిస్థాయిలో నింపుకోవడమేకాదు, ఈ ప్రాజెక్టుల ద్వారా దుబ్బాక, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లోని 95 చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు నింపుకొని లక్షా 25 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి ఆస్కారమున్నది.
దీపం ఉన్నప్పుడే ఇంటిని చక్కబెట్టుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందన్న విమర్శలు వస్తున్నాయి. అన్నపూర్ణ జలాశయం నుంచి నాలుగు మోటర్లు ఆన్‌చేసి నీటిని పూర్తిస్థాయిలో కొండపోచమ్మ సాగర్‌కు ఎత్తిపోవడంలో ప్రణాళికాలోపం స్పష్టంగా కనిపిస్తున్నది. దీని వల్ల శ్రీరాంసాగర్ జలాలు గోదావరి పాలవుతున్నాయి. నిజానికి శ్రీరాంసాగర్ జలాలను ఒడిసి పట్టుకునే అంశంపై ప్రభుత్వం శ్రద్ధపెడితే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నందిమేడారం- గాయత్రీ పంపుహౌస్, మధ్యమానేరు వరకు ఎత్తిపోసుకునే ఇబ్బందులు ప్రస్తుతం తప్పుతాయి. అంతేకాదు, ఎస్సారెస్సీ నుంచి మధ్యమానేరు, లోయర్‌మానేరు ప్రాజెక్టులకు బై గ్రావీటి ద్వారా కావాల్సిన నీరు తీసుకోవడానికి ఆస్కారం ఉన్నది. మధ్యమానేరు ప్రాజెక్టుకు కావాల్సినంత నీరు తీసుకోవడానికి వరదకాలువను పూర్తిగా వినియోగించుకోచ్చు. వరదకాలువ ద్వారా రోజుకు 22 వేల క్యూసెక్కుల నీటిని ఎస్సారెస్సీ నుంచి తీసుకోవడానికి అవకాశం ఉన్నది. అంటే దాదాపు రోజుకు రెండు టీఎంసీల నీరు తీసుకోవచ్చు.
అలాగే, ఎస్సారెస్పీ కాకతీయ కెనాల్ ద్వారా రోజుకు 9 వేల క్యూసెక్కుల నీటిని నేరుగా లోయర్మానేరుడ్యాంకు సరఫరా చేయవచ్చు. తద్వారా ఎల్ఎండీ దిగువన అంటే బీలో ఎల్ఎండీ పరిధిలోని దాదాపు 900 చెరువులు కుంటలు నింపుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అల్పపీడన ప్రభావంతో అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే లక్షలాది మంది రైతులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్సారెస్సీ నుంచి సాధ్యమైనంత మేరకు గ్రావిటీ ద్వారా నీటిని వాడుకునే వెసలు బాటు దొరికినట్లు అయ్యేది. గ్రావిటీ ద్వారా రావాల్సిన నీటిని తీసుకోవడంలోనూ అస్పష్ట విధానం కొనసాగుతుండగా.. మరోవైపు ఎత్తిపోతలు అలాగే కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం అన్నపూర్ణ జలాశయం నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు కేవలం రెండు మోటర్ల ద్వారా 6,200 క్యూసెక్కులను మాత్రమే ఎత్తిపోస్తున్నారు. ఇలా అయితే 50 టీఎంసీల మల్లన్నసాగర్ నిండేది ఎలా..? అలాగే 15 టీఎంసీల సామర్థ్యమున్న కొండపోచమ్మ ఎప్పుడు నిండాలె.. తిరిగి అక్కడి నుంచి మూడు జిల్లాల చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు ఎప్పుడు నిండాలన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే ఎస్సారెస్పీ నీటిని గ్రావిటీ ద్వారా మధ్యమానేరు, దిగుమానేరు ఇస్తూ.. వాటి పరిధిలోని చెరువులు, కుంటలు నింపే విషయంలో ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవరించడంతో పాటు ఇదే సమయంలో మధ్యమానేరు-అన్నపూర్ణ జలాశయం నంచి కొండపోచమ్మ వరకు వీలైనంత ఎక్కవ నీటిని ఎత్తిపోసుకునేందుకు అన్ని మోటర్లను నడుపాలన్న డిమాండ్ వస్తున్నది. నిజానికి వర్షాలు వెనక్కి తగ్గి శ్రీరాంసాగర్‌కు వచ్చే ఇన్‌ఫ్లో తగ్గితే.. ప్రస్తుతం ఉన్న అన్ని అవకాశాలను కోల్పోయే పరిస్థితులు తలెత్తడమేకాదు, దీని వల్ల ఈ ఆయకట్టు రైతుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారే ప్రమాదమున్నది.