నాటి పాలనలో చినుకుపడితే వణికిపోయిన కరీంనగరం, ఇవాళ భారీ వర్షాలు ముంచెత్తినా సురక్షితంగా బయటపడింది. ఎడతెరిపిలేని వానలతో వరద పోటెత్తినా వెంటనే తేరుకున్నది. వర్షపు నీరు ఏరులై పారినా డ్రైనేజీల గుండా సాఫీగా వెళ్లిపోయింది. గంటల వ్యవధిలోనే క్లియర్ అయింది. మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక దృష్టి, అధికార యంత్రాంగం అప్రమత్తతతో దశాబ్దాల నాటి ముంపు సమస్య పరిష్కారమైంది. నాటి అనుభవాల దృష్ట్యా పక్కా ప్రణాళికతో లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీల నిర్మాణం, విస్తరణతోనే రికార్డుస్థాయి వర్షం పడ్డా ప్రమాదం తప్పిందనే సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వానకాలం వస్తే భయపడిన నగర ప్రజానీకం, ఇప్పుడు వరద సమస్య పరిష్కారం కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నది. మంత్రి గంగులతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నది.
– కార్పొరేషన్, జూలై 28
కార్పొరేషన్, జూలై 28: వారం పది రోజులుగా కురిసిన కుండపోత వర్షాలకు పెద్దపెద్ద పట్టణాలు, నగరాలు చిగురుటాకులా వణికాయి. రికార్డు స్థాయి వానలతో అతలాకుతలమయ్యాయి. చా లాచోట్ల రోడ్లన్నీ వాగుల్లా మారి రోజులపాటు జనజీవనం స్తంభించింది. కానీ, కరీంనగర్‌ను సేఫ్‌గా బయటపడింది. భారీ వర్షాలతో వరద ముంచెత్తినా తక్కువ నష్టం జరిగింది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత మంత్రి గంగుల కమలాకర్ ముందుచూపుతో వ్యవహరించడం, క్షేత్రస్థాయిలో పర్యటించడం, అధికారులతో నిరంతర సమీక్షలు చేయ డం, గత అనుభవాలతో వరద ముప్పు లేకుండా పక్కా ప్రణాళికలు చేసి అమలు చేయడంతో ము ప్పు తప్పిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. గత ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రధాన మురుగు కాలువను విస్తరించి అభివృద్ధి చేయడం, లోతట్టు ప్రాంతాల్లో వరద నిల్వ ఉండకుండా ఆ యా ప్రాంతాలకు అనుగుణంగా డ్రైనేజీలు నిర్మించడంతో భారీ వర్షాలు పడ్డా ఎక్కడా సమస్య రాలేదు. అక్కడక్కడా రోడ్లపై వరద నిలిచినా గంటల వ్యవధిలోనే డ్రైనేజీల్లోకి వెళ్లిపోయింది. విలీన గ్రామాలు, శివారు ప్రాంతాల్లోనూ పెద్దగా నష్టం జరగలేదు. త్వరలోనే సీఎం అస్యూరెన్స్ నిధులు 132 కోట్లతో చేపట్టే పనులన్నీ పూర్తయితే నగరంలో ఎక్కడా వరద సమస్యకు చెక్ పడుతుంది.
భారీ వానలు పడినా సమస్య తలెత్తలే..
గతంలో కరీంనగర్లో చిన్న వర్షం కురిసినా చాలా కాలనీలు అతలాకుతలమయ్యేవి. జ్యోతినగర్, ముకరంపుర, విద్యానగర్, సంతోష్‌నగర్, శ్రీహరినగర్, భగత్‌నగర్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యేవి. రోడ్లు, ఇండ్లల్లోకి వరద చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేది. ముఖ్యంగా జ్యోతినగర్‌లోని హనుమాన్ ఆలయం వెనుక ప్రాంతం, సంతోష్‌నగర్, శ్రీహరినగర్, విద్యానగర్, భాగ్యనగర్, సాయినగర్, అశోక్‌నగర్, మంగళివాడ, ఇందిరానగర్, ఆదర్శనగర్, కిసాన్‌నగర్‌లో వరదనీరు చేరేది. కానీ, వారం పది రోజులుగా ఎడతెరిపిలేకుండా వానలు పడుతున్నా నగరంలో పెద్దగా సమస్య తలెత్తలేదు. ఈ నెల 25న 4 సెం.మీ., 26న 3.5, 27న 14.2 సెం.మీ. వర్షం కురిసినా.. రెండు మూడు ప్రాంతాల్లో తప్ప ఎక్కడా కూడా వరద కష్టాలు తలెత్తలేదు. జ్యోతినగర్, సంతోష్‌నగర్, విద్యానగర్, భాగ్యనగర్ తదితర ప్రాంతాల్లో ఎక్కడ కూడా రోడ్ల మీద నీరు నిల్వలేదు. వచ్చిన వరద నిమిషాల్లోనే క్లియర్ అయింది.
పక్కా ప్రణాళికతో డ్రైనేజీల అభివృద్ధ్ది
గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ నగరంలో పర్యటించి వరద చేరే ప్రాంతాలను గుర్తించారు. సమస్యల పరిష్కారానికి పకడ్బందీ ప్రణాళికలు రూపొందించారు. ఇంజినీరింగ్ అధికారులతో పలుసార్లు సమీక్షలు, పరిశీలన చేసి పక్కా ప్రణాళికతో డ్రైనేజీ పనులు చేపట్టారు. రాంనగర్, పీటీసీ నుంచి, ఎస్సారార్ కాలేజీ నుంచి కింద ఉన్న మానేరు వాగు వరకు వర్షాలకు వచ్చే వరదనీటిని అంచనా వేసి ప్రధాన వరద మురుగుకాలువను అభివృద్ధి చేశారు. అలాగే స్మార్ట్‌సిటీ పనుల్లో భాగంగా రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీలు నిర్మించడంతోపాటు వాటిపైనే ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేశారు. అయితే రోడ్లపై పా రే వరద ప్రవాహానికి ఎక్కడా ఇబ్బంది లేకుండా లెవల్ తీసుకొని నిర్మించడంతో సమస్య తప్పింది.
150 కోట్లతో ప్రధాన డ్రైనేజీల అభివృద్ధి
నగరంలోని రెండు ప్రధాన వరద మురుగు కాలువలను ఎంతటి భారీ వర్షం వచ్చినా వరద సులువుగా వెళ్లేలా 150 కోట్లతో విస్తరించారు. రాంనగర్, శ్రీహరినగర్, పీటీసీ నుంచి సంతోష్‌నగర్, భాగ్యనగర్, జ్యోతినగర్, ముకరంపుర వరకు ఉన్న ప్రధాన కాల్వలను సైతం అభివృద్ధి చేశారు. అటు సాయినగర్, అశోక్‌నగర్, బొమ్మ వెంకన్న ఇంటి నుంచి కింది వరకు కూడ కాలువలను అభివృద్ధి చేశారు. అలాగే అలకపురి నుంచి హైదరాబాద్ రోడ్డు మీదుగా మానేరు వాగు వరకు ప్రత్యే క కాలువను నిర్మించారు. వీటితోపాటు అన్ని డివిజన్లలోనూ చిన్న చిన్న మురగుకాలువలను విస్తరించి, భవిష్యత్తులో ఎంతటి వరద వచ్చినా సమస్య తలెత్తకుండా అభివృద్ధి చేశారు.
నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం
కరీంనగరాన్ని రాష్ట్రంలోనే రెండో నగరంగా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. భవిష్యత్తులో ఎంత భారీ వర్షం పడినా వరద సమస్య లేకుండా అభివృద్ధ్ది పనులు చేపడుతున్నాం. అందుకోసం ముందుగానే ముంపుప్రాంతాలను గుర్తించి, పరిష్కారానికి చర్యలు తీసుకున్నాం. సీఎం అస్యూరెన్స్ నిధుల నుంచి జ్యోతినగర్, విద్యానగర్, భాగ్యనగర్, రాంనగర్, గణేశ్‌నగర్, ఇందిరానగర్, బొమ్మ వెంకన్న ఇంటి ప్రాంతంలో మురుగుకాలువలను విస్తరించాం. దీంతోపాటు 132 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనుల్లోనూ భవిష్యత్తులో ఎక్కడ కూడా వరద ముప్పు రాకుండా పక్కా ప్రణాళికతో మురుగుకాల్వలను విస్తరిస్తాం. ఇవి పూర్తయితే భవిష్యత్తులో ఎంత వర్షం పడ్డా ఇబ్బంది ఉండదు.
– మంత్రి గంగుల కమలాకర్
గణేశ్‌నగర్ బైపాస్ కాల్వపై ప్రత్యేక దృష్టి
నగరంలో అత్యధికంగా వరద సమస్యలు జ్యోతినగర్, గణేశ్‌నగర్ ప్రాంతాల్లో నిర్మించే వరద ము రుగు కాలువ విస్తరణపై ప్రత్యేక దృష్టిపెట్టారు. జ్యోతినగర్‌లోని డ్రైనేజీని నాలుగు ఫీట్ల మేరకు విస్తరించారు. అస్యవ్యస్తంగా ఉన్న గణేశ్‌నగర్ బైపాస్‌లోని ప్రధాన కాలువలను లక్ష్మీనగర్ వరకు వెడల్పు చేశారు. దీంతో ఈ ప్రాంతంలో వరద నీటి సమస్య పరిష్కారం కావడంతోపాటు అద్భుతమైన రోడ్డు అందుబాటులోకి వచ్చింది.
గతంలో వాన కాలం వస్తే మస్తు భయపడేది. వరదనీరు ముంచెత్తుందదని ఆందోళనకు గురయ్యేది. చిన్న వాన పడ్డ ఇండ్లలోకి నీరు వచ్చేది. ఈ సారి కూడా భారీ వర్షాలు వస్తున్నాయంటే భయపడ్డాం. కానీ, ఇక్కడ పెద్ద పెద్ద మురుగుకాలువలు నిర్మించారు. దీంతో వరదనీరు ఆగకుండా సాఫీగా వెళ్లిపోయింది. ఇది మేం న మ్మలేకపోతున్నాం. ఇంత మంచిగా చేసిన మంత్రి గంగులకు నా కృతజ్ఞతలు.
– రాచకట్ల శ్రీధర్, జ్యోతినగర్
ఎక్కడా చుక్కనీరు నిల్వలేదు..
గతంలో చిన్న వర్షం కురిసిన ఇండ్లలోకి నీరు వచ్చేది. ఒక్కోసారి బురదతో కంపు వాసన వచ్చేది. కాలనీవాసులందరం అష్టకష్టాలు పడేది. వానకాలం మొత్తం మా పరిస్థితి ఇలాగే ఉండేది. ఎప్పుడు వానొస్తుందోనని భయపడేది. కానీ, ఇప్పుడు ఇంత పెద్ద వానపడ్డ రోడ్లపై ఎక్కడా కూడ చుక్క నీరు నిల్వలేదు. ఇది చాలా గొప్ప విషయం. ఇదంతా మంత్రి గంగుల సార్‌తోనే సాధ్యమైంది. ఇలాంటి మంచి పనులు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు.
– సింగిరాల సురేందర్, జ్యోతినగర్