సిరిసిల్ల మరమగ్గం ఆగిపోయింది. నాలుగు నెలలుగా పనిలేక మూగబోయింది. గత బీఆర్ఎస్ సర్కారు పాలనలో కార్మికులకు చేతినిండా పని, పనికి తగ్గ కూలీతో పదేండ్లుగా బతుకుచూపిన వస్త్ర పరిశ్రమ కాంగ్రెస్ సర్కారు పట్టింపులేమితో సంక్షోభంలో కూరుకుపోయింది. వేలాది మందికి బతుకునిచ్చిన బతుకమ్మపై కక్షగట్టి, ఆర్డర్లు ఇవ్వకపోవడంతో ఉపాధి లేకుండా పోగా, నేతన్నల జీవితాల్లో మళ్లీ అంధకారం అలుముకుంటున్నది.
ఇప్పటికే రెండు వేల సాంచాలు తుక్కుకింద అమ్మేసినా, ఆదుకోమంటూ అర్థించినా, ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో 2014 నాటికి ముందున్న పరిస్థితే పునరావృతమవుతున్నది. ఓ వైపు కొన్ని కుటుంబాలు ఉపాధి కోసం మళ్లీ భీవండి, ముంబాయి, సూరత్‌కు వలస వెళ్లాల్సిన పరిస్థితి రాగా, మరోవైపు మనసు చెదిరి, బతుకు భారమైన నేతన్నల ఆత్మహత్యలతో సిరిశాల మళ్లీ ఉరిశాలగా మారుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, కార్మిక క్షేత్రానికి మళ్లీ పూర్వవైభవం తేవాలని డిమాండ్ వినిపిస్తున్నది.
రాజన్నసిరిసిల్ల, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాక ముందు ఉమ్మడి ప్రభుత్వంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయింది. ఉపాధి కరు వై, బతుకు భారమై, కుటుంబాలను పోషించలేక సుమా రు 700మంది కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డా రు. సాంచాలలో చావుకేకలు, ఆకలి చావులతో ఉరిసిల్లగా మారిన సమయంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. అన్నమో రామచంద్రా..? అంటూ అర్థించినా, పెద్ద దిక్క ను కోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబాలను ఆదుకున్న పాపాన పోలేదు.
‘చావులు పరిష్కారం కాదు.. నేతన్నలు ఆత్మహత్య చేసుకోకండి’ అంటూ గోడలపై పోలీసులు రాసిన రాతలను ఆనాడు తెలంగాణ ఉద్యమంలో భాగంగా సిరిసిల్లకు వచ్చిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చూసి చలించి పోయారు. అప్పులు పుట్టక మైక్రో ఫైనాన్స్‌ల ఉచ్చులో చిక్కుకుని విలవిల లాడుతున్న నేతన్నలకు నేనున్నానంటూ ముందుకొచ్చారు. రూ.50 లక్షలు పోగు చేసి సిరిసిల్ల పద్మశాలీ ట్రస్టుకు అందజేసి, కార్మికులకు వడ్డీ లేకుండా ఇవ్వాలని ట్రస్టు నేతలకు సూ చించారు.
తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని విధాలుగా ఆదుకుంటానని ఇచ్చిన మాటకు కట్టుబడి బతుకమ్మ చీరెల తయారీ ఆర్డర్లు ఇచ్చి అండగా నిలిచారు. బతుక మ్మ చీరెలకు వినియోగించే నూలుకు పది శాతం సబ్సిడీ కార్మికులకు చెందేలా చేశారు. ప్రతి సంవత్సరం కోటి చీరెల తయారీతో ఏడేండ్ల కాలంలో సుమారు ఆరున్నర కోట్ల చీరెలు సిరిసిల్లలో తయారయ్యాయి. సిరిసిల్లలో 30వేల సాంచాలుండగా, అందులో 20వేల సాంచాలపై బతుకమ్మ చీరెలు రూపుదిద్దుకున్నాయి.
తద్వారా వేలాది మందికి ఉపాధి లభించింది. ఒక్క సిరిసిల్ల కార్మికులే కాకుండా ఒడిశా, మహారాష్ట్ర, సూరత్, ముంబాయి, షోలాపూర్, భీవండీ, తెలంగాణలోని వరంగల్, జనగామ, సూర్యాపేటతోపాటు ఇతరజిల్లాల నుంచి కార్మికులు సిరిసిల్లకు వలస వచ్చి ఉపాధి పొందారు. ఒక్కో కార్మికుడు నెలకు రూ.25 వేల దాకా సంపాదించారు. దీనితోపాటు నూలు సబ్సిడీతో ఒక్కో కార్మికుడు ఏడాదికి రూ.30వేల నుంచి రూ.50 వేల లబ్ధిపొందారు.
ఆడబిడ్డకు పండుగ చీరల్లేవు
గత కేసీఆర్ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా బతుకమ్మ చీరను అందిస్తూ రాగా, ఈ యేడు కాంగ్రెస్ సర్కారు ఆ ఆనందం లేకుండా చేసింది. బతుకమ్మ చీరల పంపిణీని రద్దు చేసింది. గత ప్రభుత్వం నేతన్నల కోసం అమలు చేసిన పథకాలన్నింటినీ పక్కనపెట్టి నేతన్నలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్డర్లు ఇచ్చి ఉపాధి కల్పించాలంటూ ఆందోళనలు చేస్తున్నా నేతన్నల పట్ల సవతి ప్రేమ చూపిస్తున్నది.
గతంలో కన్నా మెరుగైన ఉపాధి కల్పిస్తామంటూ ఎన్నికల సమయంలో హామీలిచ్చిన మంత్రులు మొహం చాటేశారు. ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వక పోవడం వల్ల ఇప్పటికే రెండు వేల సాంచాలు తుక్కు కింద ఇనుప సామగ్రికి అమ్మేశారు. వస్త్ర పరిశ్రమ సంక్షోభం ఇతర వ్యాపార రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. వేలాది మందికి పనిలేక పోవడంతో వ్యాపార, వాణిజ్యం మందగించింది. పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతున్నది. ప్రభుత్వం స్పందించక పోతే సంక్షోభం ముదిరి పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉన్నది.
బువ్వ పెట్టింది బతుకమ్మ చీరెలే
పదేండ్ల కింద సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయి, కార్మికుల ఆత్మహత్యలు, ఆకలిచావులతో ఉరిసిల్ల అయ్యింది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ చీరెలే మా నేతన్నలకు బువ్వ పెట్టాయి. ఏడేళ్ల కాలంలో ప్రతి సంవత్సరం కోటి చీరెల తయారీతో నేతన్నలు చేతి నిండా పని, పనికి తగ్గ వేతనం పొందారు. పదిశాతం యారన్ సబ్సిడీ నేరుగా నేతన్నల ఖాతాలో జమయ్యాయి. రందీ లేకుండా బతికారు. కానీ, కాంగ్రెస్ సర్కారు నేతన్నలను పట్టించుకోకపోవడం, ఆర్డర్లు ఇవ్వకపోవడంతో మళ్లీ ఆకలికేకలు మొదలవుతున్నాయి. కుటుంబాలు వలసపోతున్నాయి. వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి.
– బీకే రాజు వస్త్ర ఉత్పత్తిదారుడు, సిరిసిల్ల
ఆర్డర్లు ఇవ్వాలి..
దశాబ్ధాల ఉమ్మడి ప్రభుత్వ హయాంలో ఏనాడూ నేతన్నల జీవన ప్రమాణాలు మెరుగు పడలేదు. 2014లో వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. పెద్ద ఎత్తున కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలు జరిగినా అండగా నిలువ లేదు. గత కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ చీరెల తయారీ ఆర్డర్లు ఇచ్చి ఆదుకున్నది. 30 వేల సాంచాలున్న సిరిసిల్లలో మరమగ్గాల పరిశ్రమపై వేలాది మంది కార్మికులకు చేతి నిండా పని కల్పించింది. కార్మిక కుటుంబాలు సంతోషంగా బతికాయి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ సర్కారు వచ్చి మళ్లీ పొట్టకొడుతున్నది. అనేక పథకాలను రద్దు చేస్తున్నది. వెంటనే ప్రభుత్వం స్పందించి నేతన్నను ఆదుకోవాలి. వస్ర్తోత్పత్తి ఆర్డర్లు, ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
– మూషం రమేశ్, తెలంగాణ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు
బతుకమ్మనే బతుకునిచ్చింది
2014కి ముందు ఉమ్మడి ప్రభుత్వంలో సిరిసిల్ల ఆగమైంది. సాంచాలలో సంక్షోభం వచ్చి, చాలా మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నరు. స్వరాష్ట్రంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ పరిశ్రమకు ఆర్డర్లు ఇచ్చి ఆదుకున్నరు. మళ్లీ వస్త్ర పరిశ్రమ పునర్జీవం పోసుకుని ముందుకు సాగింది. ఇంకా బతుకమ్మ చీరెల తయారీతో చేతినిండా కార్మికులకు పని దొరికింది. ఆత్మహత్యలు, ఆకలి చావులు ఆగిపోయాయి. ఒక్క సిరిసిల్లకే కోటి చీరెల ఆర్డర్లను ఇచ్చి, బతుకుదెరువు చూపిన్రు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమపై చిన్నచూపు చూస్తోంది. ఆర్డర్లను బంద్ చేసింది. మళ్లీ పాత రోజులు వస్తున్నయి. ఉపాధి లేక ఎన్నో కుటుంబాలు రోడ్డునపడుతున్నయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి.
– గాజుల నారాయణ వస్త్ర ఉత్పతి దారుడు, సిరిసిల్ల
రెండు లక్షల చీరెలు తయారు చేశాం
గత ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరెల వల్ల మా పరిధిలోని మ్యాక్స్ సొసైటీలో వంద సాంచాలపై ఏడేండ్లలో రెండు లక్షల బతుకమ్మ చీరెలు తయారు చేసినం. ఒక్కో కార్మికుడు నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేల దాకా కూలీ పొందాడు. అలాగే, బతుకమ్మ చీరెలకు వినియోగించే నూలు సబ్సిడీ, త్రిఫ్ట్ పథకం, బీమా సౌకర్యాలు, విద్యుత్ సబ్సిడీ ఇవ్వడం వల్ల మరమగ్గాల పరిశ్రమ సంక్షోభం నుంచి గట్టెక్కింది. తెలంగాణ జిల్లాలే కాకుండా ఇతర జిల్లాల నుంచి వేలాది మంది వచ్చి ఇక్కడ పని చేసుకుంటూ బతికారు. బతుకమ్మ చీరెలతోనే సిరిసిల్లకు ‘సిరి’ వచ్చిందని చెప్పవచ్చు. గత కేసీఆర్ ప్రభుత్వం ఆదుకోకపోతే సిరిసిల్లలో మరమగ్గాల పరిశ్రమ కనుమరుగయ్యేది.
– బొద్దుల సుదర్శన్ మరమగ్గాల యజమాని, సిరిసిల్ల