రాజన్న సిరిసిల్ల ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల టౌన్ : అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి సర్కారు నేతన్నలను రోడ్డున పడేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నేతన్నలను ఆగంచేసిందే కాకుండా.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లాను తీసివేసే కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తన మీద కోపంతో జిల్లాను తీసివేస్తే.. సిరిసిల్ల అభివృద్ధి పదేండ్లు వెనక్కిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చేతనైతే ప్రజలకు మంచి చేయాలని గానీ, ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని హితవు పలికారు.
అబద్ధాలతో ప్రజలను మోసం చేయడమే తప్పా రెండేండ్లలో ఏ ఒక్క మంచి పని చేసింది లేదని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నేండేళ్ల కాలంలో సిరిసిల్ల అభివృద్ధికి కనీసం పన్నెండు పైసలు కూడా ఇవ్వలేదని ఆగ్రహించారు. మతం, దేవుళ్ల పేర్లు చెప్పి ఇంకెంత కాలం ప్రజల్ని మోసం చేస్తారని బండి సంజయ్‌ని ప్రశ్నించారు. అన్నింటా దగా చేసిన కాంగ్రెస్, బీజీపీకి తగిన గుణపాఠం చెప్పాలని నేతన్నలకు పిలుపునిచ్చారు. వస్త్ర పరిశ్రమకు జీవం పోసి, నేతన్నలకు బతుకునిచ్చిన కేసీఆర్‌కు అండగా ఉండాని, బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
గురువారం ఆయన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేశారు. ముందుగా ఒకటో వార్డు పరిధిలోని జ్యోతినగర్ కాలనీవాసులతో నేలపై కూర్చొని, ముచ్చటించారు. వారి సమస్యలు తెలుసుకొని, అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పట్టణంలోని పలు వార్డులో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ వస్త్ర పరిశ్రలకు జీవం పోశారని, నేతన్నల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు.
కానీ, అసెంబ్లీ ఎన్నికల ముందు నేతన్నలకు అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి రేవంత్ రెడ్డి, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను పట్టించుకోకుండా ఆగం చేశారని విమర్శించారు. ఇచ్చిన హామీలను, అరు గ్యారెంటీలను, 420 హామీలు అమలు చేయలేకపోవడాన్ని ప్రశ్నిస్తే.. రేవంత్ బూతులు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని మాయమాటలు చెబుతున్నారని, నమ్మితే మరోసారి మోసపోవడం ఖాయమని హెచ్చరించారు. ఓట్లడగడానికి వచ్చే కాంగ్రెస్ నేతలను బాకీలపై నిలదీయాలని ప్రజలకు సూచించారు.