Korukanti Chander | గోదావరిఖని : సింగరేణి సంస్థలో అపరిస్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం సాయంత్రం ఆర్ జీవన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్, టీబీజీకేస్ ఆందోళన నిర్వహించాయి. అనంతరం సింగరేణి అధికారులకు వినతిపత్రం అందజేశారు. గోదావరిఖని పట్టణంలోని హనుమాన్ నగర్ శివాజీ నగర్ చౌరస్తా ప్రాంతంలో సింగరేణి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కట్టడాలకు చిరు వ్యాపారులకు ఓనర్ షిప్ శాశ్వతంగా ఇవ్వాలని, సింగరేణి ఆధ్వర్యంలో ఆర్ ఓ ప్లాంట్లు పాతవి మరమ్మతులు చేయాలని, కొత్తగా ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
నత్త నడక నడుస్తున్న ఎస్ టి పి ప్లాంట్ల పనులను వేగవంతం చేయాలని, మారుపేర్ల బాధితులకు న్యాయం చేయాలని, సింగరేణిలో మెడికల్ బోర్డు తక్షణమే నిర్వహించి డిపెండెంట్ ఉద్యోగాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమంపై శ్రద్ధ వహించాలని, కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం కావద్దని ఆయన సూచించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, టీబీజీకేస్ నాయకులు రామగుండం డివిజన్ వన్ ఎస్ ఓ టు జి ఎం కు వినతి పత్రం అందజేశారు.