సిరిసిల్ల టౌన్ , మార్చి 24: కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓ రాజకీయ అజ్ఞాని అని జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు విమర్శించారు. మంగళవారం సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హోంశాఖ అంటే ఇంట్లో ఉండే శాఖ అని బండి సంజయ్ భావిస్తున్నాడని ఎద్దేవా చేశారు. కరీంనగర్ ప్రజలు ఎంపీగా గెలిపిస్తే గల్లీ స్థాయి రాజకీయాలకే పరిమితమయ్యారని అన్నారు. కరీంనగర్ ఉద్యమాల ఖిల్లా అని తన చిల్లర మాటలతో కరీంనగర్ ప్రజలు తల దించుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఉద్యమ నేత కేసీఆర్ పై చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఉన్నత స్థాయి అధికారి కేసీఆర్ దొంగ నోట్లు ముద్రించారని సమాచారం ఇచ్చారని చెబుతున్న బండి సంజయ్ తన కేంద్ర మంత్రి హోదాలో విచారణ చేయించి ఆరోపణలను రుజువు చేయాలని డిమాండ్ చేశారు. మతం మీద గెలిచి మతి లేని మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సిరిసిల్ల, కరీంనగర్ మున్సిపాలిటీలలో తట్టెడు మొరం పొయ్యలేదని, అభివృద్ధి చేసి ప్రజల ఆదరణ పొందాలని హితవు పలికాకు. కేసీఆర్ పై చేసిన ఆరోపణలు రుజువు చేయకపోతే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో కుంబాల మల్లారెడ్డి, ఓజ్జల అగ్గి రాములు, గజబింకార్ రాజన్న, సబ్బని హరీష్, చంద్రయ్య గౌడ్, గుండు ప్రేమ్ కుమార్, షేక్ సికందర్, కాసర్ల పవన్, పురుషోత్తం, సాయికిరణ్, జక్కుల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.