ఉమ్మడి జిల్లాలో యూరియా కొరత రోజురోజుకూ తీవ్రమవుతున్నది. ఒక బస్తా కోసం అన్నదాత అరిగోస పడాల్సి వస్తున్నది. గంటల తరబడి క్యూ కట్టినా దొరక్క, చివరకు ఉత్తచేతులతో వెనుదిరుగాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. ప్రస్తుతం వానలు పడుతున్న వేళ డిమాండ్ మరింత రెట్టింపు కానున్నది. పత్తి, వరి, మక్క, మిర్చి తదితర పంటలకు యూరియా వేయాల్సిన అవసరం ఏర్పడుతుండగా, సకాలంలో ఎరువు వేయకపోతే దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లోనే అన్నదాతలు పది రోజులుగా అగచాట్లు పడుతున్నా మంత్రులు పట్టించుకోవడం లేదు. ఎంపీలు మాట్లాడడం లేదు. కొరతపై సమీక్ష సమావేశాలు నిర్వహించడం లేదు. కనీసం సమస్య ఎప్పటివరకు పరిష్కారం అవుతుందో చెప్పడం కూడా లేదు. పైగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటారే తప్ప, పరిష్కారం దిశగా మాత్రం అడుగులు వేయడం లేదు. ఈ వ్యవహారాన్ని నిశితంగా చూస్తే ఇప్పట్లో కొరతకు మోక్షం లభించే అవకాశాలే కనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో సమైక్య రాష్ట్ర పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. నిజానికి తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో యూరియాకు ఎక్కడా కొరత రాలేదు. నిజానికి ఇప్పటికన్నా అప్పట్లోనే పంటల విస్తీర్ణం అధికంగా ఉన్నా.. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో అన్నదాతలు ఏనాడూ రోడ్డెక్కలేదు. ఆనాడు బీఆర్ఎస్ సర్కారు పంటల సాగుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి, కేంద్రంతో మాట్లాడి, యూరియా ముందుగానే తెప్పించి, అన్నదాతలకు సరిపడా ఇచ్చింది. కానీ, ప్రస్తుతం పరిస్థితి తిరగబడింది. బీఆర్ఎస్ హయాంలో వేసిన పంటల విస్తీర్ణంతో పోలిస్తే ఈ సీజన్లో వేసింది తక్కువే అయినా.. యూరియా అందించడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమవుతున్నది.
ప్రస్తుతం వానలు పడుతున్న వేళ పంటలకు యూరియా అందించాల్సిన సమయమిది. ఇప్పుడు యూరియా వేస్తే అధిక దిగుబడి వచ్చే అవకాశముంటుంది. ఈ సమయంలో అన్నదాతలు యూరియా కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఒక బస్తా ఇవ్వలేని దుస్థితి ఉన్నది. కేవలం ఒక బస్తా దక్కించుకోవడానికి రైతులు తమ పనులు వదులుకొని, సహకార సంఘాలు, ఆగ్రో సేవా కేంద్రాల వద్ద పడిగాపులు పడాల్సి వస్తున్నది. ఒకటి రెండు చోట్ల కాదు, ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే సమస్య కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రితోపాటు జిల్లా మంత్రులు సమీక్ష సమావేశాలు నిర్వహించి, యూరియా కొరతకు కారణాలు, డిమాండ్‌ను తీర్చేందుకు చేపట్టాల్సిన చర్యలు.. వంటి అంశాలపై చర్చించి, రైతులకు భరోసా ఇవ్వాల్సిన అవసరమున్నది.
కానీ, ఇన్చార్జి మంత్రి జాడ లేదు. కనీసం కలెక్టర్లకు కూడా ఫోన్లు చేసి కొరతపై మాట్లాడిన దాఖలాలు లేవు. అలాగే ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు శ్రీధర్‌బాబు, లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ పరిస్థితి అలాగే ఉన్నది. అలాగే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ముగ్గురు ఎంపీలున్నారు. అందులో కరీంనగర్, నిజామాబాద్ స్థానాల్లో బీజేపీ ఎంపీలుండగా, పెద్దపల్లిలో కాంగ్రెస్ ఎంపీ ఉన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సహా మిగిలిన నిజామాబాద్, పెద్దపల్లి ఎంపీలు సైతం కొరతను తీర్చేందుకు దృష్టిపెట్టిన దాఖలాలు లేవు. అధికారులతో సమావేశాలు నిర్వహించలేదు.
చిన్న చిన్న విషయాలపై మాట్లాడే బీజీపీ ఎంపీలు పది రోజులుగా యూరియా కోసం అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా వారి పక్షాన మాట్లాడ లేదు. సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత ఎక్కువగా యూరియా వచ్చేలా చర్యలు తీసుకున్నది లేదు. పైగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికే సరిపోతున్నారు. కేంద్రం నుంచి యూరియా కేటాయింపు తక్కువగా వచ్చిందని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే యూరియా పంపిణీ సరిగా కావడం లేదని బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.
ప్రస్తుతం వానలు పడుతున్నాయి. ఈ సమయంలో వరి, పత్తి, మక్క, మిర్చి వంటి పంటలకు ఎరువులు వేస్తే వర్షపు నీటికి కరిగిపోయి, మొక్క బలంగా పెరగడానికి ఆస్కారముంటుంది. అయితే ప్రస్తుతం తగినంత యూరియా వేద్దామంటే దొరకడం లేదు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సాగు పనులు వదిలి రోజుల కొద్దీ తిరుగుతున్నారు. అయినా ఈ సమస్యకు పరిష్కారం ఉందా.. లేదా..? అన్నదానిపై ప్రజాప్రతినిధులు గానీ, అధికారులు గానీ స్పష్టత ఇవ్వడం లేదు. ఇప్పటికైనా రైతులు మరిన్ని ఇబ్బందులు పడక ముందే మంత్రులు, ఎంపీలు జిల్లాల వారీగా లేదా ఉమ్మడి జిల్లా వారీగా ఒక సమీక్ష సమావేశం నిర్వహించాలన్న డిమాండ్ వస్తున్నది.
దానికి అనుగుణంగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి, ఉమ్మడి జిల్లా డిమాండ్ మేరకు ఎప్పటిలోగా యూరియా నిల్వలు రావడానికి ఆస్కారం ఉన్నదో అనేదానిపై స్పష్టత ఇస్తే బాగుటుందన్న అభిప్రాయాలు వస్తున్నాయి. అలా కాకుండా ఎవరికి వారు ఇతరులపై విమర్శలు చేసుకుంటూ కాలం వెల్లదీస్తే, ఆ ప్రభావం పంటల దిగుబడులపై పడి అన్నదాత భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యూరియా కొరత రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతున్న సమయంలో మంత్రులు, ఎంపీలు ఇప్పటికైనా స్పందిస్తారా.. లేదా..? అన్నది చూడాలి!
పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు అధికారుల లెక్కల ప్రకారం వరి, పత్తి, మక్క, కంది పంటల సాగు విస్తీర్ణం 2,28,585 ఎకరాలు. అందుకోసం 32వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేయగా, ఇప్పటివరకు 18వేలు వచ్చింది. ఇంకా 14వేల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉన్నది. నిజానికి ఈ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో యూరియా కొరత ఉన్నది. మిగిలిన యూరియా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉన్నది.
జగిత్యాల జిల్లాలో ఈ వానకాలంలో అంచనా వేసిన సాగు వీస్తీర్ణం 4,15 లక్షల ఎకరాలు కాగా, అందుకు 40వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని యంత్రాంగం అంచనా వేసింది. ఇప్పటివరకు 23వేలు టన్నులు రాగా, ఇంకా 17వేల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉన్నది. ఈ జిల్లాలోనూ కొరత వేధిస్తున్నది.
కరీంనగర్ జిల్లాలో వరి, మక్క, కంది, మిర్చి, పత్తి పంటలు కలిపి 3,43,240 ఎకరాల్లో సాగు చేయగా, అందుకోసం 43,254 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని యంత్రాంగం అంచనా వేసింది. అందులో ఇప్పటవరకు 21,802 మెట్రిక్ టన్నులు రాగా, ఇంకా 19,464 మెట్రిక్ టన్నుల రావాల్సి ఉన్నది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాగు వీస్తీర్ణం 2.09 లక్షల ఎకరాలు కాగా, 25వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అవుతుందని యంత్రాంగం అంచనా వేసింది. ఇప్పటివరకు 13 వేల మెట్రిక్ టన్నులు వచ్చిందని అధికారులు చెబుతుండగా, ఆ లెక్కన ఇంకా 12వేల మెట్రిక్‌టన్నులు రావాల్సి ఉన్నది.
ఉమ్మడి జిల్లా మొత్తంగా చూస్తే కోటి 42 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా డిమాండ్ ఉండగా.. ఇప్పటివరకు 75వేల మెట్రిక్ టన్నులే వచ్చింది. ఇంకా 62 వేల మెట్రిక్ టన్నులు అంటే ఇంచుమించి 47 శాతం వరకు రావాల్సి ఉన్నది.
బోయినపల్లి, ఆగస్టు 16 : కోరెం సహకార సంఘానికి రెండు రోజుల్లో 669 బ్యాగులు రాగా, శనివారం ఉదయం నుంచే రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే సిబ్బంది వివిధ కారణాలు చూపుతూ పంపిణీ చేయకుండా టోకెన్లు ఇచ్చారు. వాన పడకుంటే ఆదివారం పంపిణీ చేస్తామని, లేదంటే సోమవారం అందిస్తామని పంపించారు. దీంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. యూరియా బ్యాగుల కోసం వస్తే టోకెన్లు ఇచ్చి పంపారని ఆవేదన వ్యక్తం చేశారు.
శంకరపట్నం (తిమ్మాపూర్), ఆగస్టు 16 : శంకరపట్నం మండలం గద్దపాక పీఏసీఎస్ పరిధిలోని కాచాపూర్ గోదాంకు రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే క్యూలైన్లో ఉన్నారు. అయితే అక్కడ బ్యాగులు తక్కువగా ఉండడం, రైతులు వందల సంఖ్యలో రావడంతో అందరికీ సరిపోవని పంపిణీ నిలిపివేశారు. ఆదివారం మరో లోడ్ వస్తుందని సిబ్బంది నచ్చజెప్పారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో ఆశతో వస్తే ఒక్క బస్తా ఇవ్వకుండా పంపారని మండిపడ్డారు.