కరీంనగర్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : మునుపెన్నడూ లేని విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే సమస్య కనిపిస్తున్నది. యూరియా కావాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నది. ఇరవై రోజులుగా అన్నదాతలు అరిగోస పడుతున్నారు. సాగు పనులు వదులుకొని మరీ సొసైటీ చుట్టూ రోజుల తరబడి తిరుగుతున్నారు. ఎక్కడికి యూరియా వచ్చిందని తెలిస్తే అక్కడికి పరుగులు తీస్తున్నారు.
ఉదయం నుంచే బారులు తీరుతూ పొద్దంతా పడిగాపులు గాస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో మాదిరిగానే చెప్పులను క్యూలో ఉంచి నిరీక్షిస్తున్నారు. అయినా దొరక్క మళ్లీ మళ్లీ తిరుగుతున్నారు. అదునులో యూరియా వేయకపోతే పంటల దిగుబడిపై ప్రభావం పడుతుందని, తాము నష్టపోవాల్సి వస్తుందని నెత్తీ నోరు కొట్టుకుంటున్నారు. అయినా అన్నదాతలపై కరుణచూపే వారు కరువయ్యారు. నిజానికి ఈ సమస్యను ముందు నుంచి సమీక్షించి, ముందస్తు చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిసినా పట్టించుకునే లేరు.
కొద్ది రోజులుగా రైతుల బాధలు కండ్లగడుతున్నా అధికార పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. యూరియాపై కలెక్టర్ సహా వ్యవసాయ, ఇతర శాఖల అధికారులు నిత్యం శ్రమిస్తున్నా.. జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్ రావు, జిల్లా మంత్రులు ఇప్పటి వరకు స్థానికంగా అధికారులతో సమీక్ష నిర్వహించ లేదు. లోటు ఎక్కడ ఉన్నదో పరిశీలించి పరిష్కరించే ప్రయత్నం చేయలేదు.
పైగా ఎక్కడో హైదరాబాద్‌లోని స్టార్ హోటల్లో ఇన్చార్జి మంత్రి, ఇతర జిల్లా మంత్రులు సమీక్ష నిర్వహించినా.. అందులో యూరియా అంశాన్ని ప్రస్తావించలేదు. ఇరవై రోజులుగా రైతులు తండ్లాడుతున్నా ఇన్చార్జి మంత్రి గానీ, జిల్లా మంత్రులు గానీ కొరత తీరుస్తామని ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు. పోనీ స్థానికంగా అంటే.. జిల్లా కేంద్రాల్లోనైనా కనీసం సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి, రైతులు ఇబ్బందులు, పంట దిగుబడిపై ప్రభావం వంటి అంశాలపై చర్చిస్తే రైతులకు భరోసా దొరికేది.
కానీ, ప్రస్తుతం తీవ్రంగా ఉన్న యూరియా సమస్యను వదిలేసి ఇతర అంశాలపై స్టార్ హోటల్లో మీటింగ్ పెట్టడంపై రైతుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. అలాగే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా కనీసం సమీక్షించడం లేదు. అధికారులకు ఎలాంటి ఆదేశాలు కూడా ఇవ్వడం లేదు. స్థానికంగా రైతుల వద్దకు వెళ్లి భరోసా కూడా కల్పించడం లేదు. ఈ పరిస్థితుల్లోనే రైతులు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే దుస్థితి వచ్చిందని మండిపడుతున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ ఇబ్బందులు పడలేదని, కాంగెస్ పాలనలో మాత్రం గోస పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు.
ఒక రోజు ముందుగానే చెప్పుల క్యూ
గంభీరావుపేట, ఆగస్టు 21 : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి సింగిల్ విండో గోదాంకు రైతులు గురువారం ఉదయం 6గంటలకే తరలివచ్చారు. లారీ లోడు వస్తదన్న సమాచారంతో అక్కడకు పెద్దసంఖ్యలో చేరుకొని, ముందస్తుగా చెప్పులు, బండరాళ్లను లైన్లో పెట్టి వెళ్లిపోయారు. గోదాంకు సాయంత్రం 5 గంటలకు 322 బస్తాలతో లారీ వచ్చింది. అయితే సిబ్బంది మాత్రం శుక్రవారం ఉదయం పంపిణీ చేస్తామని చెప్పడంతో తమ చెప్పులను అక్కడే ఉంచారు. తమ పాదాలకు చెప్పులు లేకున్నా ఎల్లదీసుకుంటామని, కానీ, సాగుకు యూరియా మాత్రం కావాలని రైతులు అన్నారు.
సగం మందికి అందలే
రుద్రంగి, ఆగస్టు 21: రుద్రంగి మండల కేంద్రంతోపాటు మానాల సొసైటీల్లో గురువారం యూరియా పంపిణీ చేశారు. రుద్రంగి రైతువేదికకు 230 బ్యాగులు, మానాల సొసైటీకి 230 బ్యాగులు రాగా, ఒక్కోచోట దాదాపు 300 మంది రైతులు బారులు తీరారు. దీంతో పోలీస్ పహారా మధ్యన బ్యాగులు పంపిణీ చేశారు. ఒక్క రైతుకు ఒకటీ లేదా రెండు చొప్పున ఇవ్వగా, దాదాపు సగం మంది నిరాశతో వెనుదిరిగారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిరీక్షించినా దొరకలేదని ఆవేదన చెందారు.
మనుమడితో పడిగాపులు
..కింది చిత్రంలో కనిపిస్తున్నది గంగాధర మండలం హిమ్మత్‌నగర్ గ్రామానికి చెందిన మహిళా రైతు లక్ష్మి. గురువారం ఉదయం 7 గంటలకు కురిక్యాల సింగిల్ విండోకు వచ్చి యూరియా కోసం పడిగాపులు గాసింది. సాయంత్రం వరకు కూడా అక్కడికి యూరియా రాలేదు. కుటుంబసభ్యులంతా ఎవుసం పనులకు వెళ్లగా, ఇంట్లో ఉన్న తన మనుమడిని చూసుకునే వారు లేక సంకనేసుకుని, సద్ది కట్టుకుని వచ్చింది. ఆమెకున్న ఐదెకరాల భూమికి పది బస్తాల యూరియా అవసరం కాగా, సొసైటీ నిర్వాహకులు రెండు బస్తాలే ఇస్తామని చెప్పడంతో వాటినైనా తీసుకుందామని పొద్దంతా పడిగాపులు గాసింది.
యూరియా ఎప్పుడొస్తది? అసలు వస్తుందా..? రాదా..? అనేది కూడా స్పష్టంగా చెప్పక పోవడంతో అక్కడే నిరీక్షించింది. కానీ, ఒక్క బస్తా కూడా రాకపోవడంతో సాయంత్రం వరకు వేచి చూసి ఇంటికెళ్లింది. ఆమెతో పాటు వచ్చిన అదే గ్రామానికి చెందిన తిప్పారపు లతది మరో గోస. చేయికి దెబ్బతగిలి ఇంట్లో విశ్రాంతి తీసుకోవాల్సిన ఆమె, నొప్పిని సైతం లెక్క చేయకుండా రెండు రోజులుగా సింగిల్ విండో చుట్టూ తిరుగుతున్నది. యూరియా కోసం వచ్చిన ప్రతిసారి నిరాశకు గురవుతున్నది. వీరిద్దరే కాదు, దాదాపు 300 మంది మూడు రోజులుగా కురిక్యాల సొసైటీ చుట్టూ తిరుగుతున్నారు. యూరియా ఎప్పుడు వస్తుందో తెలియకపోవడం, వచ్చినా కొద్ది సేపట్లోనే అయిపోతుండడంతో రోజూ వచ్చిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు.
క్యూలైన్లో పాసుపుస్తకాలు
రాయికల్, ఆగస్టు 21 : జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ వ్యవసాయ సహకార సంఘానికి గురువారం యూరియా లోడ్ వస్తుందన్న విషయం తెలుసుకున్న రైతులు, ఉదయం 5 గంటల నుంచే తరలివచ్చారు. పట్టాదారు పాసుపుస్తకాలు క్యూలైన్లో పెట్టి వేచి చూశారు. ఉదయం 9గంటలకు 300 బస్తాలతో లోడ్ రాగా, ఎకరానికి ఒక బ్యాగు చొప్పున గరిష్ఠంగా 3 వరకు ఇచ్చారు. సుమారు 250 మందిలో సగం మంది రైతులకు అందకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. కేసీఆర్ పాలనలో ఎన్నడూ యూరియా కోసం ఇబ్బంది పడలేదని, కానీ, కాంగ్రెస్ పాలనలో గోస పడుతున్నామని చెప్పారు.
పదిరలో బారులు
ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 21: ఎల్లారెడ్డిపేట సొసైటీ పరిధిలోని పదిర మహిళా సంఘ భవనానికి గురువారం 440 బ్యాగులు వచ్చాయి. అయితే అందుకు సంబంధించి బుధవారమే 180 మంది పదిర రైతులకు టోకెన్ ఇచ్చి, ఒక్కొక్కరికీ రెండు బస్తాలు ఇవ్వాలని నిర్ణయించారు. తీరా గురువారం బస్తాలు రాగా, పదిర రైతులతోపాటు హరిదాస్ నగర్ రైతులు కూడా తరలివచ్చారు. దీంతో కాసేపు గందరగోళం నెలకొన్నది. ముందుగా నిర్ణయించినట్టు 360 బ్యాగులు పదిర గ్రామస్తులకే అందించారు. తర్వాత మిగిలిన 80 బ్యాగులను హరిదాస్‌నగర్‌కు చెందిన రైతులకు ఇచ్చినప్పటికీ, అందని మిగతా రైతులు అసహనం వ్యక్తం చేశారు.
లైన్లో ఉన్నా దొరకలేదు
యూరియా కోసం మునుపెన్నడు గింత గానం ఇబ్బందులు పడలేదు. మూడు గంటలు లైన్లో ఉన్నా ఒక బస్తా దొరకలేదు. నాకు మా ఊరిలో మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో వరి సాగు చేస్తున్న. ప్రస్తుతం నాలుగు బస్తాల యూరియా అవసరం ఉంది. మా భూపతిపూర్ సొసైటీకి గురువారం ఉదయం లోడ్ వచ్చిందని తెలుసుకొని అకడికి వెళ్లి లైన్లో ఉన్న. నాతో పాటు చాలామందికి యూరియా దొరకలేదు. చివరకు ప్రైవేటులో రెండు 20-20బస్తాలు కొంటే ఒక యూరియా బస్తా ఇచ్చిన్రు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఎన్నడూ ఇంత ఇబ్బందులు పడలేదు. కానీ, ఈ కాంగ్రెస్ పాలనలో రైతులు తిప్పలు పడుతున్నరు. ప్రభుత్వం రైతులకు అవసరమైన యూరియాను తెప్పించడంలో విఫలమైంది.
– పాల్త్య ప్రభాకర్, రైతు ఒడ్డెలింగాపూర్ (రాయికల్ మండలం)
రోజంతా ఎదురుచూపే..
నాకు పదెకరాల వ్యవసాయ భూమి ఉంది. సొసైటీ వారు ఎకరానికి ఒకే బస్తా ఇస్తే ఏమూలకు సరిపోతది. యూరియా కోసం సొసైటీ ముందు రోజంతా పడిగాపులు పడాల్సి వస్తోంది. ఈ ప్రభుత్వం కావాలనే రైతులపై కక్ష కట్టిందా…?. రైతులకు ఇంతటి దుస్థితి వస్తదని అనుకోలే. పొలం వేయడానికి పుట్టెడు కష్టాలు పడాల్సి వస్తున్నా పట్టించుకునే వారు లేరు.
– చిన్నేని జగన్రావు, రైతు, కల్లూరు (కోరుట్ల రూరల్)
నెలెల్లినా దొర్కకపాయె
నేను ఏడెనిమిదెకరాలు పొలమేసిన. నాటేసి నెలెల్లిపాయె. ఇవారకు కొంచెం దొరికితే పల్సగా ఆడింతాడింత సల్లిన. నెలెల్లినా ఇవారకు యూరియా దొర్కకపాయె. బొప్పాపూర్‌కు అచ్చింది గానీ, 240 బస్తాలే ఏసిపోయిన్రు. అచ్చిన 500 మంది రైతులకు అవి యాడ సరిపోతయ్. రైతుకొక్క బస్తనన్న రాకపాయె.
-బొమ్మనవేణి నారాయణ, రైతు, బొప్పాపూర్ (ఎల్లారెడ్డిపేట)
మూడు రోజులుగా వస్తున్న
మాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఎకురం పత్తి, ఎకురం పొలం వేసినం. రెండు బస్తాల యూరియా కోసం మూడు రోజుల సంది కురిక్యాల సొసైటీ కాడికి వస్తున్న. పొద్దుగాల 8 గంటల సంది ఎదురు చూస్తున్న. రెండు బస్తాల కోసం మూడు రోజుల సంది కావలికాసుడు అంటే ఎంత ఇబ్బందో సార్లు అర్థం చేసుకోవాలే. కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు ఇట్ల గోస పడలె. దుకాణానికి పొయ్యి ఎన్ని అవసరం ఉంటే అన్ని తెచ్చుకున్నం. ఇప్పుడు అట్ల దొరుకత లెవ్వు.
– భాగ్యలక్ష్మి, కొండన్నపల్లి (గంగాధర)
బస్తాలు అచ్చుడే లేదు.. ఇచ్చుడెక్కడిది?
మూడు రోజుల సంది సొసైటీలకు యూరియా అచ్చుడే లేదు. ఇంక ఇచ్చుడు ఎక్కడిది? పది బస్తాల కోసం మూడు రోజుల సంది కురిక్యాల సొసైటీ కాడికి వస్తున్న. పొద్దుగాల 7 గంటల నుంచి సాయంత్రం వరకు చూసి పోతున్న. రోజు ఇదే పరిస్థితి. రెండు బస్తాలె ఇస్తమంటున్నరు. రెండు బస్తాలు ఎట్ల సరిపోతయే సార్లు చెప్పాలె. సరిపడా బస్తాలు అయ్యాలె.
– తిప్పారపు లత, హిమ్మత్‌నగర్ (గంగాధర)
కేసీఆర్ ఉన్నప్పుడు ఇబ్బంది లేదు
కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు యూరియా గిట్ల ఇబ్బంది పడలె. ఎప్పుడు మా మహిళలం ఇట్ల లైన్ కట్టలే. ఇంటి కాడికే యూరియా బస్తాలు తెచ్చి ఇచ్చిన్రు. ఎప్పుడో పదిహేనేండ్ల కింద ఇట్ల లైన్లు కట్టుడు చూసిన. మళ్ల ఇప్పుడే ఇట్ల లైన్లు కట్టుడు చూస్తున్న. రెండెకురాల ఎవుసం భూమి ఉంటే రెండు బస్తాలు ఇత్తరట. ఐదు బస్తాలు కావాలంటే ఇత్తలేరు. అవసరానికి మించి ఇస్తే మేం ఏం చేసుకుంటం? అవసరమున్న కాడికే వాడుకుంటం కదా! రైతులకు సరిపడా ఇచ్చి ఆదుకోవాలె.
– భూలక్ష్మి, హిమ్మత్‌నగర్ (గంగాధర)