ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనే మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) సోమవారం షెడ్యూల్‌ను ప్రకటించి, ఎలక్షన్ పండుగను తెచ్చింది. నోటిఫికేషన్ నుంచి మొదలు కొని.. కౌంటింగ్ వరకు తేదీలను ఖరారు చేస్తూ వివరాలు వెల్లడించింది. వచ్చే నెల 3న నోటిఫికేషన్ విడుదల కానుండగా, 30న పోలింగ్ జరుగనున్నది. షెడ్యూల్ నుంచి ఎన్నికలు జరిగేనాటికి మొత్తం ప్రక్రియ యాభై రోజుల్లోనే పూర్తవనుండగా, మోడల్ కోడ్ సోమవారం నుంచే అమల్లోకి వచ్చింది. మరోవైపు ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లా యంత్రాంగం ఇప్పటికే సన్నద్ధం కాగా, ఈ సారి 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 31.12 లక్షల పైచిలుకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మరోవైపు షెడ్యూల్ ఇవ్వడంతో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను మంత్రులు, ఎమ్మెల్యేలు వాయిదా వేసుకోగా, ఈసీ ప్రకటనతో ఒక్కసారిగా అన్ని పార్టీల్లోనూ టెన్షన్ మొదలైంది. బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకెళ్తుండగా, ప్రతిపక్షాల అభ్యర్థులెవరనేది నేటికీ అంతుచిక్కకుండా ఉన్నది.
– కరీంనగర్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్, అక్టోబర్ 9 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర శాసనసభ ఎన్నిలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) పచ్చా జెండా ఊపింది. నోటిఫికేషన్, నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ, స్క్రూటిని, ఎన్నికలు, కౌంటింగ్ తేదీలను సైతం ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వచ్చే నెల 3న నోటిఫిషన్ జారీ చేస్తామని పేర్కొన్నది. అదే రోజు నుంచి నవంబర్ 10 వరకు నామినేషన్ దాఖలుకు అవకాశం కల్పింది. నవంబర్ 15 వరకు ఉపసంహరణకు వీలు కల్పించిన ఈసీ, ఎన్నికలను నవంబర్ 30న నిర్వహించడానికి నిర్ణయించింది. నిబంధనల ప్రకారం నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజే బరిలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటించనుండగా, ఆ రోజు నుంచి ఎన్నికలు జరిగే రోజు వరకు పక్షం రోజుల సమయం ఉన్నది. కాగా 48 గంటల ముందే ప్రచారానికి స్వస్తి చెప్పాల్సి ఉంటుంది. ఆ లెక్కన చూస్తే నవంబర్ 28 సాయంత్రంతో ప్రచారానికి తెరపడనున్నది.
సిద్ధంగా యంత్రాంగం
ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఇప్పటికే ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధమైంది. ఈసీ ఆదేశాల మేరకు రెండు నెలలుగా అందుకు సంబంధించిన పనుల్లో మునిగి తేలుతున్నది. రెండునెలల క్రితమే భారీగా బదిలీల ప్రక్రియ పూర్తి కాగా, ఆయా స్థానాల్లో తాజాగా వచ్చిన అధికారులతో ఏర్పాట్లు చేయిస్తున్నారు. నాలుగు జిల్లాల కలెక్టర్లు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ బూత్ నుంచి ఓటు వేయించే వరకు.. ఈవీఎంల నుంచి ఓటరు చైతన్యం వరకు.. చేపట్టాల్సిన కార్యక్రమాలపై సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చి సిద్ధం చేశారు.
ఆగిన అభివృద్ధి పనులు
షెడ్యూల్ విడుదలతోనే మోడల్ కోడ్ అమల్లోకి వస్తున్నట్లుగా ఈసీ ప్రకటించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి పనుల్లో భాగంగా చేయాల్సిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను మంత్రులు, ఎమ్మెల్యేలు నిలిపివేశారు. నిజానికి సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు ఆదివారం రాత్రే షెడ్యూల్ చేసుకున్నారు. ఆ మేరకు సంబంధితవర్గాలు, గ్రామాల ప్రజలకు సమాచారం చేరవేశారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచే మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ కార్యక్రమాల్లో ఉండగా.. మధ్యాహ్నం ఈసీ షెడ్యూల్ విడుదల చేయడంతో సదరు పనులను వెంటనే నిలిపివేశారు.
భారీగా పెరిగిన ఓటర్లు
గత ఎన్నికలకు భిన్నంగా ఈ సారి ఓటింగ్ జరిగే పరిస్థితి కనిపిస్తున్నది. ఎక్కువగా నమోదయ్యే అవకాశమున్నది. ఈ నెల 4వ తేదీన ప్రకటించిన తుది ఓటరు జాబితా ప్రకారం 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 31,12,283 మంది ఓటర్లు ఉన్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. ఈ సారి కొత్తగా 3,24,734 మంది ఓటురుగా నమోదు చేసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ 15వేల నుంచి 50వేల పైచిలుకు ఓటర్లు పెరిగారు. కరీంనగర్, రామగుండం మినహా 11 నియోజకవరాల్లో మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అంతేకాదు, ఈసీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నారు. ఓటు నమోదుకు ఆసక్తి చూపిన నేపథ్యంలో ఓటు వేసేందుకు కూడా ఈసారి భారీగా స్పందించే అవకాశన్నదని నిపుణులు చెబుతున్నారు.
వేడెక్కిన రాజకీయం
ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిన నేపథ్యంలో జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. డిసెంబర్లోనే ఎన్నికలు ఉంటాయని ముందు నుంచి భావించిన బీఆర్ఎస్, ఇప్పటికే ప్రచారం హోరెత్తిస్తున్నది. ఆగస్టు 21వ తేదీన అభ్యర్థులను ప్రకటించగా, ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాలను ఒక దఫా చుట్టారు. మరోవైపు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో ప్రగతిని పరుగులు పెట్టించారు. ఇంకోవైపు సంక్షేమ పథకాలను ఇంటింటికీ దరిచేర్చారు. గడపగడపకూ వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. మరోవైపు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఏడు నియోజవర్గాల్లో సభలు నిర్వహించి, నూతనోత్సాహం నింపారు. ఆయాచోట్ల జనం నీరాజనం పలుకగా, బీఆర్ఎస్ నాయకులు మరింత ఉత్సాహంగా ముందుకుసాగుతున్నారు. కానీ, ఇప్పటి వరకు మిగతా పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయలేకపోయాయి. ఇంకా వేట సాగిస్తూనే ఉన్నాయి.
అమల్లోకి మోడల్ కోడ్
షెడ్యూల్ విడుదల చేసిన తక్షణం నుంచే మోడల్ కోడ్ అమల్లోకి వస్తుందని ఈసీ పేర్కొన్నది. కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకూ అమల్లో ఉండనున్నది. ఈ కోడ్‌ను ఎవరూ ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవన్న ఈసీ, ఈ విషయంలో పాత నిబంధలు పూర్తిగా వర్తిస్తాయని తాజాగా విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొన్నది. అంతేకాకుండా, మాడల్ కోడ్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త ఆదేశాలు వస్తాయని, బరిలో నిలబడే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, వారి ఏజెంట్లు సదరు ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో మాడల్కోడ్ను పకడ్బందీగా అమలు చేసేందుకు కావాల్సిన చర్యలు తీసుకున్నట్లుగా పేర్కొంది.
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్
తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటరు జాబితా ప్రకారం ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పురుషులు, మహిళలు ఇతరులు మొత్తం ఓట్ల వివరాలు