Sardar Sarvai Papanna Goud | ఓదెల, ఆగస్టు 18 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను సోమవారం గౌడ కులస్తులు ఘనంగా నిర్వహించారు. కొలనూరు గ్రామంలో గౌడ కులస్తులు పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బైరి రవి గౌడ్ మాట్లాడుతూ బహుజన ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పేర్కొన్నారు. పీడిత జనుల కోసం, బహుజనుల ఆత్మగౌరవం కోసం తన సర్వస్వాన్ని దారబోసిన మహాయోధుడు పాపన్న అని కొనియాడారు.
నిరంకుశ పాలనకు ఎదురొడ్డి, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన పాపన్న గౌడ్ తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణమన్నారు. సామాజిక, రాజకీయ సమానత కోసం కృషి చేసిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న పోరాటస్ఫూర్తిని భావితరాలకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమాలల్లో గౌడ సంఘం నాయకులు తోట తిరుపతి, సిరిసేటి సారయ్య, తోట అనిల్, బైరి సంతోష్, ముంజాల బాపు తదితరులు పాల్గొన్నారు.