మట్టి, ఇసుక, చెత్తాచెదారంతో పేరుకుపోయి సీసి డ్రైన్ లు..
అంటువ్యాధుల అంచున ప్రజలు..
Sanitation | పెద్దపల్లి రూరల్ సెప్టెంబర్ 17 : పెద్దపల్లి జిల్లా కేంద్రానికి, మండల కేంద్రానికీ కూతవేటు దూరంలో ఉండి, పెద్దపల్లి మండలంలోని 30 గ్రామపంచాయతీలలో అతి పెద్ద గ్రామపంచాయతీలుగా పేరుగాంచిన గ్రామాలు రెండు ఉండగా అందులో ఒకటి అప్పన్నపేట. అయితే ఈ గ్రామం పారిశుద్ద్య చర్యల విషయంలో స్థానిక అధికారులు , సిబ్బంది నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా పరిణమిస్తోంది. గ్రామపంచాయతీ పాలక వర్గాల పదవికాలం ముగిసి ప్రత్యేకాధికారులకు బాధ్యతలు వచ్చినప్పటి నుంచి ఇక్కడి ప్రజలు పడుతున్న బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయంటూ ఎవరికి చెప్పుకున్నా ఏం లాభం అనే రీతీలో మా ఊరి పరిస్థితి ఉందంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, సంబంధిత జిల్లా స్థాయి అధికారులు గ్రామాల్లో వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ సూచనలు ఆదేశాలు జారీ చేస్తున్న అప్పన్నపేట గ్రామంలో పారిశుద్ద్యంపై పరిస్థితిలో మార్పు రాలేదంటే అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్లాస్టిక్ వ్యర్థాలపై కఠినంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలున్నా అవేవి ఇక్కడ కనిపించడం లేదు. కేవలం కంటితుడుపు చర్యలుగానే పారిశుద్ద్య చర్యలు కనిపిస్తున్నాయి. గ్రామం చివరలో బొంపల్లికి వెళ్లే మార్గంలో మురుగు నీరు వెళ్లే కాలువ మొత్తం పచ్చని మొక్కలతో నిండిపోయి ప్లాస్టిక్ వ్యర్థాలు, మురికి నీరు వెళ్లకుండా మారింది అలా పూడిక నిండడం మూలంగా వర్షాలు పడినప్పుడల్లా కొద్దిపాటి చిన్నవర్షాలకే వరదనీటి ప్రవాహాం నేరుగా కాలువ నుంచి వెళ్లే పరిస్థితి లేక ఇండ్లలోకి వస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తాము ఎన్నిసార్లు కార్యదర్షికి మొరపెట్టుకున్న పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి పారిశుద్ద్య చర్యలు చేపట్టి ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
ఊరి పక్క ఇండ్ల వెనుక కాలువను తీయమని చెప్పినా చేస్తలేరు : బొబ్బిలి స్వామి
మా ఇంటి వెనుక పక్కనుంచే మురుగు నీరు వెళ్లే కాలువ ఉంది. అధికారులు గ్రామపంచాయతీ సిబ్బంది పట్టించుకోక పోవడం వల్ల పచ్చని మొక్కలు చెట్లుగా మేలిసి కాలువ కనిపిస్తలేదు. నీళ్లు పోతలేవు. అందులోనే ప్లాస్టిక్ బాటిళ్లు ఊరు చెత్త అంతా ఇక్కడ జామ్ అయి నీళ్లు ఎక్కువ అయినప్పుడల్లా ఇండ్లలోకి ఎగదన్నుతన్నయ్ ఎవరికి చెప్పినా పట్టించుకుంటలేరు. ఇప్పటికైనా మా బాధలకు విముక్తి చేసి కాలువలు శుభ్రం చేసి మాకు రోగాలు రాకుండా చూడాలే.