కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 11 : ప్రభుత్వ కార్యాలయాల్లో ఏళ్ళ తరబడి విధులు నిర్వర్తిస్తున్న దినసరి కూలీలను (Daily Wage workers) కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తున్నది. నెలంతా కష్టపడితే ఇచ్చేది ఆవగింజంతే అన్నట్లుగా ఉంటే, ఆ మొత్తం కూడా అందజేయకుండా నెలల తరబడి తాత్సారం చేస్తుండడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్త ఉద్యోగులతో పోటీ పడి వారి కప్పగించే పనులు చేస్తున్నా, వేతన విడుదలలో కనీస కనికరం లేకుండా వ్యవహరిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ముందు వారికి ఇచ్చిన హామీలు అటకెక్కించినా, నామమాత్రపు వేతనంతో రాత్రింబవళ్లు ఊడిగం చేస్తుండగా, ఇచ్చే కొద్దిపాటి జీతమైనా సక్రమంగా విడుదల చేయకపోవడం పట్ల చిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి తేటతెల్లమవుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. తమను ఎప్ప టికైనా క్రమబద్ధీకరిస్తుందనే ఆశతో తక్కువ వేతనానికైనా నిబద్ధతతో రెండు దశాబ్దాలుగా విధులు నిర్వర్తిస్తుంటే, నాలుగు నెలల నుంచి వారి భత్యం విడుదల చేయకపోవడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. దినసరి, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో ఇక నుంచి ఉద్యోగాలు చేయాల్సినవసరం లేదు. మిమ్మల్నందరిని క్రమబద్ధీకరిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నెలల తరబడి తమను పస్తులుంచడంపై రోజువారీ కార్మికుల కుటుంబాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
వచ్చే కొద్దిపాటి జీతంతో కుటుంబాలను నెట్టుకొచ్చే తాము గత నవంబర్ నుంచి చెల్లింపులు నిలిచిపోవడంతో, పూట గడవని స్థితికి తమ కుటుంబాలు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్లోని పలు ప్రభుత్వ విభాగాల్లో స్వీపర్లు, హౌస్ కీపర్లు, స్కావెంజర్లు, రాత్రి వాచ్మెన్లు, డ్రైవర్లు, ఆఫీసు సబార్డినేట్లు, తోటమాలి, వంట మనుషులుగా, ఇతరత్రా పనుల కోసం 40 మంది వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి ప్రతినెలా కేవలం రూ.8,500 వరకు మాత్రమే వేతన రూపకంగా అందజేస్తున్నారు. దినసరి పద్ధతిలో వీరిని నియమించగా, గత ఇరవై ఏండ్లుగా కొనసాగుతున్నారు. వీరకందజేసే వేతనం కూడా ప్రతి నెల క్రమం తప్పకుండా పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వేతనాల విడుదలలో జాప్యం కలుగుతుండగా, గతేడాది నవంబర్ నుంచి వీరిలో అత్యధిక మందికి వేతనాలు జమ చేయలేదని తెలుస్తోంది.
దీంతో, వారంతా నిత్యం అధికారుల చుట్టూ తిరుగుతుండగా, ఇదిగో అదిగో అంటూ మభ్యపెడుతున్నారని చిటపటలాడుతున్నారు. వచ్చే కొద్దిపాటి జీతంలో నుంచే పిల్లల చదువులు, కుటుంబ పోషణ, తల్లిదండ్రుల వైద్య ఖర్చులు చేయాల్సి ఉండడంతో, అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. అయితే, వారిలో అత్యధికులు ఉన్నతాధికారుల ఇండ్లలో, వారి క్యాంపు కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారే ఉన్నా, సకాలంలో వేతనాలు రాకపోవడం వెనుక ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయకపోవడమేనని సమాచారం. అధికారులు వారి బాధలు గమనించి తృణమో, ఫణమో ఇచ్చినా అవి ఏ మూలకు సరిపోవడం లేదని దినసరి కూలీలు బాధపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సత్వరమే బడ్జెట్ విడుదల చేయాలని కోరుతున్నారు.