వేములవాడ, మే 8 : పీవోకే, పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేసిన క్షిపణి దాడులపై సబ్బండవర్గాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. పహల్గాంలో మతం అడిగి 26 మంది ఉసురు తీసిన ఉగ్రవాదుల దాడికి ప్రతీకారం తీర్చుకోవడాన్ని స్వాగతిస్తున్నారు. సైన్యం పనితీరు, పరాక్రమాలను చూసి గర్విస్తున్నామని, ‘సలాం సైనికా’ అంటూ అభినందనలు తెలుపుతున్నారు. గురువారం ఉమ్మడి జిల్లాలో పార్టీలకతీతంగా సంబురాలు చేసుకున్నారు. జగిత్యాల ధరూర్ క్యాంప్‌లో కాలనీవాసులు స్వీట్లు పంపిణీ చేసి పటాకులు పేల్చారు. మెట్పల్లిలో గంగపుత్ర సంఘం సభ్యులు జాతీయ జెండాతో కాలనీలో తిరుగుతూ ‘భారత్ మాతాకీ జై’ నినాదాలతో హోరెత్తించారు. అలాగే అక్కడక్కడ న్యాయవాదులు ర్యాలీలు తీశారు. కోరుట్లలో కోర్టు నుంచి కొత్త బస్టాండ్ అంబేదర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లారు.
జాతీయ పతాకాలు చేతబూని ‘భారత్ మాతాకీ’ జై నినాదాలతో హోరెత్తించారు. మానవహారంగా ఏర్పడి, పటాకులు కాల్చి, స్వీట్లు పంచారు. సిరిసిల్లలో జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి గాంధీ చౌక్ వరకు ‘జై జవాన్’ నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. వేములవాడలో తెలంగాణ చౌక్ నుంచి తిప్పాపూర్ తెలంగాణ తల్లి విగ్రహం వరకు న్యాయవాదులు ర్యాలీ తీసి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండ రవి మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్ దేశానికే గర్వకారణం అని అన్నారు. భారత్ సాంకేతిక సత్తా ఏంటో ఇవాళ ప్రపంచానికి తెలిసిందన్నారు. ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి ముషరులకు భారత్ సరైన సమాధానం ఇచ్చిందన్నారు. సాధారణ పౌరులకు హాని కలగకుండా కచ్చితమైన ప్రాంతాల్లో దాడులు చేయడంతో భారత్ టెక్నాలజీ శక్తి ప్రపంచానికి తెలిసిందని స్పష్టం చేశారు. ఈ ర్యాలీలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణరెడ్డి, న్యాయవాదులు కటకం జనార్ధన్, రేగుల దేవేందర్, గుడిసె సదానందం, పొత్తూరు అనిల్ కుమార్, కొడిమ్యాల పురుషోత్తం, కిశోర్‌రావు, జంగం అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.